ప‌దిరూపాయ‌ల విరాళంతో...క‌శ్మీర్ మీద‌వుతుందా...?

భార‌త దౌత్య‌వేత్త‌ని అవ‌మానించిన పాక్ ప్ర‌ముఖుడు! పాకిస్తాన్‌, ఇండియాల మ‌ధ్య దాయాది ప‌గ‌లు ఎప్ప‌టికీ పోవ‌ని, రాజ‌కీయనేత‌లు, అధికారులు క‌లిసిన‌ప్పుడు ప‌లికే సుహృద్భావం, స్నేహ‌శీల‌త లాంటి చిలుక ప‌లుకులు కేవ‌లం మీడియాలో రాసుకోవ‌డానికి మాత్ర‌మే ప‌నికొస్తాయ‌ని తెలిపే సంఘ‌ట‌న‌లు ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి. ఇటీవ‌ల ఇస్లామాబాద్‌లో స్వాంకీ సెరెనా అనే హోట‌ల్‌లో అంత‌ర్జాతీయ స్థాయిలో అత్యున్న‌త‌ దౌత్య అధికారులు పాల్గొన్న ఒక స‌మావేశం జ‌రిగింది. పాక్‌లోని ఆక్స్‌ఫ‌ర్డ్ అండ్ కేంబ్రిడ్జ్ సొసైటీ దీన్ని ఏర్పాటు చేసింది. దాన్ని ఆక్స్‌బ్రిడ్జ్ స‌మావేశంగా పిలుస్తారు. ఆఫ్ఘానిస్తాన్‌, పాక్‌ల మ‌ధ్య […]

Advertisement
Update:2016-04-03 04:45 IST

భార‌త దౌత్య‌వేత్త‌ని అవ‌మానించిన పాక్ ప్ర‌ముఖుడు!

పాకిస్తాన్‌, ఇండియాల మ‌ధ్య దాయాది ప‌గ‌లు ఎప్ప‌టికీ పోవ‌ని, రాజ‌కీయనేత‌లు, అధికారులు క‌లిసిన‌ప్పుడు ప‌లికే సుహృద్భావం, స్నేహ‌శీల‌త లాంటి చిలుక ప‌లుకులు కేవ‌లం మీడియాలో రాసుకోవ‌డానికి మాత్ర‌మే ప‌నికొస్తాయ‌ని తెలిపే సంఘ‌ట‌న‌లు ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి. ఇటీవ‌ల ఇస్లామాబాద్‌లో స్వాంకీ సెరెనా అనే హోట‌ల్‌లో అంత‌ర్జాతీయ స్థాయిలో అత్యున్న‌త‌ దౌత్య అధికారులు పాల్గొన్న ఒక స‌మావేశం జ‌రిగింది. పాక్‌లోని ఆక్స్‌ఫ‌ర్డ్ అండ్ కేంబ్రిడ్జ్ సొసైటీ దీన్ని ఏర్పాటు చేసింది. దాన్ని ఆక్స్‌బ్రిడ్జ్ స‌మావేశంగా పిలుస్తారు. ఆఫ్ఘానిస్తాన్‌, పాక్‌ల మ‌ధ్య సంబంధాల‌పై చ‌ర్చించ‌డం దాని ఉద్దేశం. ఆ స‌మావేశంలో, పాకిస్తాన్‌లో భార‌త్ హై క‌మిష‌న‌ర్‌గా ఉన్న‌ గౌత‌మ్ బాంబావాలే త‌ర‌పున ఆయ‌న ప్ర‌తినిధిగా ఒక భార‌త దౌత్య అధికారి పాల్గొన్నారు.

ఆక్స్‌ఫ‌ర్డ్ అండ్ కేంబ్రిడ్జ్ సొసైటీ ఛైర్మ‌న్ ఇర్షాద్ ఉల్లా ఖాన్ స‌మావేశ వేదిక‌ మీద మాట్లాడుతూ, అసంద‌ర్భంగా భార‌త్ దౌత్య‌వేత్త గురించి ప్ర‌స్తావించి ఆయ‌న‌ను తీవ్రంగా అవ‌మానించారు. ఆ స‌మావేశంలో పాల్గొన్న అతిథులు స్వ‌చ్ఛందంగా విరాళాలు ఇచ్చేందుకు వీలుగా ఒక బాక్స్‌ని ఉంచారు. మాట్లాడుతూనే ఖాన్ హ‌ఠాత్తుగా విరాళం ప్ర‌స‌క్తి తీసుకువ‌చ్చి, త‌న ప‌ర్సులోంచి ప‌దిరూపాయ‌ల నోటు తీసి, ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగిన గ‌త‌ ఆక్స్‌బ్రిడ్జ్ స‌మావేశంలో పాల్గొన్న భార‌త దౌత్య‌వేత్త‌ ఇచ్చిన విరాళం… ఆ ప‌దిరూపాయ‌ల‌ నోట‌ని అన్నారు. అంత‌టితో ఆగ‌కుండా ప‌దిరూపాయ‌లు ఇవ్వ‌గ‌ల స‌మ‌ర్ధ‌త‌తో క‌శ్మీర్ స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రించ‌గ‌ల‌మ‌ని ఎలా అనుకుంటున్నారు…అంటూ ఎద్దేవా చేశారు. ఈ సారి తమ సిబ్బంది కెమెరాలతో నిఘా ఉంచి మ‌రీ ప‌రిశీలించార‌ని, భార‌త దౌత్య అధికారి ఈసారి 100 రూపాయ‌లు మాత్ర‌మే ఇచ్చార‌ని అన్నారు.

అక్క‌డ మాట్లాడాల్సిన వ‌క్త వేచి ఉన్నా ప‌ట్టించుకోకుండా, ఖాన్ త‌న ధోర‌ణిలో భార‌త్ దౌత్యాధికారిని ఎగ‌తాళి చేస్తూ పోయారు. ఖాన్, పాక్‌లో ప్ర‌ముఖుడు, ఆయ‌న వ్యాపార‌వేత్త‌, క‌వి కూడా. నిజానికి ఆయ‌న అలా మాట్లాడే వీలు లేదు. ఎందుకంటే ఆ స‌భ నిర్వ‌హ‌ణ‌కు గానూ ఎవ‌రికి తోచినంత విరాళం వారు ఇవ్వ‌వ‌చ్చ‌ని ఆహ్వాన స‌మ‌యంలోనే పేర్కొన్నారు. కానీ వాస్త‌వాన్ని ప‌క్క‌న పెట్టేసి ఖాన్ అవాకులు చ‌వాకులు పేలడంతో భార‌త్ దౌత్య‌వేత్త తెల్ల‌బోయి చూశారు. ఖాన్ అక్క‌డితో ఆగ‌లేదు. ముఖ్య‌వ‌క్త ప్ర‌సంగం అయిపోయిన త‌రువాత తిరిగి ప‌దిరూపాయ‌ల నోటుని త‌న ప‌ర్సులోంచి తీసి…అమ్మ‌య్య దొరికింది అంటూ, దాన్ని ఆడియ‌న్స్‌కి చూపిస్తూ, ఆ నోటుని భార‌త్ హై క‌మిష‌న్ గుర్తుగా ఆక్స్‌ఫ‌ర్డ్ అండ్ కేంబ్రిడ్జి దాచుకుంటుంద‌ని అన్నాడు.

ఖాన్ కావాల‌నే అలా చేశాడ‌ని భార‌త దౌత్య అధికారులు భావిస్తున్నారు. పాక్ ప్ర‌భుత్వంపై క‌శ్మీర్ విష‌యంలో ఉన్న ఒత్తిడే ఆయ‌న‌తో అలా మాట్లాడించింద‌ని వారు అనుకుంటున్నారు. త‌మ అధికారి రెండు స‌మావేశ స‌మ‌యాల్లోనూ 500 రూపాయ‌లు విరాళం ఇచ్చార‌ని భార‌త దౌత్య అధికారులు వెల్ల‌డించారు. స‌మావేశం ముగిశాక భార‌త అధికారి, ఖాన్ వ‌ద్ద‌కు వెళ్లి, మీ ద‌యాపూరిత‌మైన మాట‌ల‌కు, గొప్ప ఆతిథ్యానికి కృత‌జ్ఞ‌త‌లు అంటూ చెప్పార‌ని స‌మాచారం. దౌత్య‌వేత్త‌లుగా ప‌నిచేసేవారికి ఇలాంటి సంద‌ర్భాలు ఎదుర‌వుతుంటాయి కానీ మ‌రీ ఇంతటి హేళ‌న మాత్రం చాలా అరుద‌నే చెప్పాలి. భార‌త్, పాక్‌ల్లో హై క‌మిష‌న‌ర్ స్థాయి అధికారులు కూడా ఇలాంటి అవ‌మానాలు ఎదుర్కొంటూ ఉంటారు. గ‌త ఏడాది క‌రాచీలో ఒక క్ల‌బ్, భార‌త హై క‌మిష‌న‌ర్‌ని అతిధిగా పిలిచేందుకు అంగీక‌రించ‌లేదు. భార‌త్ విదేశీ వ్య‌వ‌హారాల శాఖ త‌మ దౌత్య అధికారుల‌ను ఢిల్లీ దాటి వెళ్లేందుకు అనుమ‌తించ‌డం లేదు… అంటూ ప‌దేప‌దే విమ‌ర్శించే పాక్, భార‌త్ దౌత్య‌వేత్త‌ల విష‌యంలో ఇంత హీనంగా ప్ర‌వ‌ర్తించ‌డంపై ఏం మాట్లాడుతుందో మరి.

Tags:    
Advertisement

Similar News