దారికాచి దోచుకున్నారు...ప్రాణాలు పోగొట్టుకున్నారు!
దొంగతనం చేసి టూవీలర్‌మీద పారిపోయే క్రమంలో అంబులెన్స్ సైరన్ విని, పోలీసులని భ్రమపడ్డారు ఇద్దరు దొంగలు. ఆ భయంతో యాక్సిడెంటు చేసి ప్రాణాలే కోల్పోయారు. బెంగళూరు రాజాజీనగర్‌లో బిగ్‌బజార్ సమీపాన ఈ సంఘటన జరిగింది. 20ఏళ్ల సంతోష్, 18ఏళ్ల అభిలాష్ కలిసి బుధవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో, సంఘటన జరిగిన ప్రాంతంలో మాటు వేసి దారినపోయేవారిని దోచుకోవాలని అనుకున్నారు. అదే సమయంలో ఇఖ్‌లాఖ్, అతని తండ్రి యాకూబ్ ఊరినుండి బస్సు దిగి తాము నివసిస్తున్న కుర్బరహల్లికి వెళుతున్నారు. […]
దొంగతనం చేసి టూవీలర్‌మీద పారిపోయే క్రమంలో అంబులెన్స్ సైరన్ విని, పోలీసులని భ్రమపడ్డారు ఇద్దరు దొంగలు. ఆ భయంతో యాక్సిడెంటు చేసి ప్రాణాలే కోల్పోయారు. బెంగళూరు రాజాజీనగర్‌లో బిగ్‌బజార్ సమీపాన ఈ సంఘటన జరిగింది. 20ఏళ్ల సంతోష్, 18ఏళ్ల అభిలాష్ కలిసి బుధవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో, సంఘటన జరిగిన ప్రాంతంలో మాటు వేసి దారినపోయేవారిని దోచుకోవాలని అనుకున్నారు. అదే సమయంలో ఇఖ్‌లాఖ్, అతని తండ్రి యాకూబ్ ఊరినుండి బస్సు దిగి తాము నివసిస్తున్న కుర్బరహల్లికి వెళుతున్నారు. గుజరాత్ వాసులైన వారిద్దరూ బెంగళూరులో ఉంటున్నారు. ఆ సమయంలో వారు గుజరాత్‌నుండే వస్తున్నారు.
తండ్రీ కొడుకులను చూసిన సంతోష్, అభిలాష్‌లు వారిద్దరినీ బెక్‌తో అడ్డగించి, కత్తితో బెదిరించి వారినుండి మొబైల్ ఫోన్లు, పర్సులు లాక్కున్నారు. ఈ ఘటనలో కొడుక్కి కత్తి గాయాలు కూడా అయ్యాయి. అయితే దొంగతనం తరువాత వేగంగా వెళ్లబోయిన దుండగులకు దూరంగా అంబులెన్స్ సైరన్ వినిపించింది. దాన్ని వారు పోలీస్ వెహికల్ సౌండ్‌గా భావించి భయంతో వణికిపోయారు. ఆ కంగారులో అక్కడ ఉన్న స్పీడ్ బ్రేకర్‌కి ఢీకొట్టి అంతేవేగంగా వెళ్లి అక్కడే ఆగి ఉన్న వాటర్ టాంకర్‌కి ఢీకొన్నారు. దాంతో బండిమీద నుండి పడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో పాటు వచ్చి దొంగతనం కోసం మాటువేసిన మరొక ఇద్దరు తమ బండిమీద ఆగకుండా వెళ్లిపోయారని బాధిత తండ్రీ కొడుకులు పోలీసులకు తెలిపారు.
సంతోష్, అభిలాష్ మీద పోలీస్ కేసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు మృతుల నుండి దొంగతనం చేసిన సొమ్ముని స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.