అక్కడ చేపలు కూడా తమ్ముళ్లకు చెప్పే ఈత కొట్టాలి..!

మంత్రి పరిటాల సునీత నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల కత్తికి చేపల చెరువులు కూడా రెండుగా చీలుతున్నాయి. దశాబ్దాలుగా సాఫీగా సాగిన తంతును కూడా తగాదాగా మార్చి తమ రాజకీయ ప్రాబల్యం పెంచేందుకు తమ్ముళ్లు ఎత్తులేస్తున్నారు. పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలోని బి. యాలేరు చెరువుపై ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు రాజకీయాలు ఆడుతున్నారు. దీంతో చెరువు మీద ఆధారపడి 60, 70 ఏళ్లుగా జీవనం సాగిస్తున్న కుటుంబాలు పొట్టనింపుకునేందుకు పాట్లు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. జిల్లాలో […]

Advertisement
Update:2016-02-14 07:24 IST

మంత్రి పరిటాల సునీత నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల కత్తికి చేపల చెరువులు కూడా రెండుగా చీలుతున్నాయి. దశాబ్దాలుగా సాఫీగా సాగిన తంతును కూడా తగాదాగా మార్చి తమ రాజకీయ ప్రాబల్యం పెంచేందుకు తమ్ముళ్లు ఎత్తులేస్తున్నారు. పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలోని బి. యాలేరు చెరువుపై ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు రాజకీయాలు ఆడుతున్నారు. దీంతో చెరువు మీద ఆధారపడి 60, 70 ఏళ్లుగా జీవనం సాగిస్తున్న కుటుంబాలు పొట్టనింపుకునేందుకు పాట్లు పడాల్సిన దుస్థితి ఏర్పడింది.

జిల్లాలో పెద్ద చెరువుల్లో ఒకటైన బి. యాలేరు చెరువులో గ్రామానికి చెందిన బోయ సామాజికవర్గ కుటుంబాలు చేపలు పెంచుకుని జీవనం సాగిస్తున్నాయి. ఇందుకోసం కమిటీ ఏర్పాటు చేసుకుని చేపల పిల్లలను చెరువులో వదిలి నాలుగైదు నెలల తర్వాత పట్టుతారు. వాటిని అమ్మగా వచ్చిన సొమ్ములో పెట్టుబడి తీసివేసి మిగిలిన సొమ్మును పంచుకుంటారు. అయితే ఈ గ్రామంలో టీడీపీకి తొలి నుంచి పట్టులేదని చెబుతున్నారు. ఈనేపథ్యంలో చేపల చెరువు సొసైటీలో విభేదాలు సృష్టించారు.

కొందరి చేత అధికారులకు ఫిర్యాదులు చేయించారు. దీంతో చెరువులో చేపలు పడితే ఘర్షణలు జరిగే అవకాశం ఉందంటూ చెరువులోకి ఎవరూ దిగకుండా చేశారు అధికార పార్టీ నేతలు. రూ. 14 లక్షల 70 వేలు వెచ్చించి చేప పిల్లలు కొని తెచ్చి వదలిన సొసైటీ సభ్యులకు ఇప్పుడు దిక్కుతోచడం లేదు. అంతేకాదు… కొద్ది రోజుల క్రితం అధికార పార్టీ నేతల దిశానిర్దేశం మేరకు మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపలు పట్టారు. వాటిని అమ్మగా వచ్చిన సొమ్మును అధికారులు తమవద్దే పెట్టుకున్నారు. కనీసం చేప పిల్లల కోసం పెట్టిన పెట్టుబడైనా తిరిగి ఇవ్వాలని గ్రామస్తులు కోరినా ససేమిరా అంటున్నారు.

చేప పిల్లలు ఎక్కడ కొన్నది, ఎంతకు కొన్నది తదితర వివరాలు స్పష్టంగా చెబితేనే పెట్టుబడి సొమ్ము ఇస్తామని తేగేసి చెప్పారు. దీంతో 300 బోయ కుటుంబాలు ఏం చేయాలో అర్థం కావడం లేదంటున్నాయి. ప్రశాంతంగా ఉన్న గ్రామాలో టీడీపీ నేతలు చిచ్చు పెట్టారని ఆవేదన చెందుతున్నారు. టీడీపీ నేతలు రాజకీయాలను తమ లాంటి చిన్నవారి జీవితాలపై ప్రయోగించవద్దని కోరుతున్నారు. 70 ఏళ్ల చెరువు చరిత్రలో చేపలు పట్టకుండా అడ్డుకోవడం ఇదే తొలిసారి అని సొసైటీ డైరెక్టర్ చెబుతున్నారు. చేపల చెరువు పేరుతో గ్రామాన్ని రెండుగా చీల్చి పార్టీ బలోపేతం చేసుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అయితే అన్ని వ్యవస్థలు టీడీపీ చేతిలోనే ఉండడంతో ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాక మౌనంగా ఉంటున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News