13 ఏళ్లుగా కారులోనే కాపురం..!
పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలు కోట్ల రుణాలు తీసుకున్నా కిమ్మనకుండా ఉండే బ్యాంకులు, నిరుపేదలు పదివేలు తీసుకున్నా పీడించి వసూలు చేస్తుంటాయి. వారు తాకట్టుపెట్టిన ఆస్తులను వేలం వేస్తుంటాయి. ఇది ఎప్పుడూ జరుగుతున్నదే. కర్ణాటకలోని చంద్రశేఖర్ గౌడ అనే వ్యక్తి విషయంలో అలాగే జరిగింది. కర్ణాటకలోని సుల్యా తాలూకాలోని నూజలు అనే ఊరికి చెందిన అతను, తన 2.29 ఎకరాల భూమిని తాకట్టుపెట్టి ఓ కో ఆపరేటివ్ సొసైటీ నుండి 54వేల రూపాయలు లోనుగా తీసుకున్నాడు. తిరిగి చెల్లించలేకపోవడంతో […]
పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలు కోట్ల రుణాలు తీసుకున్నా కిమ్మనకుండా ఉండే బ్యాంకులు, నిరుపేదలు పదివేలు తీసుకున్నా పీడించి వసూలు చేస్తుంటాయి. వారు తాకట్టుపెట్టిన ఆస్తులను వేలం వేస్తుంటాయి. ఇది ఎప్పుడూ జరుగుతున్నదే. కర్ణాటకలోని చంద్రశేఖర్ గౌడ అనే వ్యక్తి విషయంలో అలాగే జరిగింది. కర్ణాటకలోని సుల్యా తాలూకాలోని నూజలు అనే ఊరికి చెందిన అతను, తన 2.29 ఎకరాల భూమిని తాకట్టుపెట్టి ఓ కో ఆపరేటివ్ సొసైటీ నుండి 54వేల రూపాయలు లోనుగా తీసుకున్నాడు. తిరిగి చెల్లించలేకపోవడంతో సొసైటీ అతని భూమిని వేలం వేసింది. ఆ నేలలో ఉన్న అతని ఇంటిని కూడా కూల్చేసింది. దాంతో ఎంతగా మనసు విరిగిపోయిందో కానీ… చంద్రశేఖర గౌడ పదమూడు సంవత్సరాలుగా తన కారులోనే కాపురం ఉంటున్నాడు. ప్రస్తుతం అతని వయసు 43 సంవత్సరాలు.
1999లో అతను సొసైటీ నుండి అప్పు తీసుకున్నాడు. సొసైటీ భూమిని వేలం వేయగా 1లక్షా 20వేలు వచ్చాయి. తన బాకీ మినహాయించుకుని గౌడకు 11వేలు తిరిగి వస్తాయని తెలిపింది. కానీ అతను ఆ డబ్బుని తెచ్చుకోనే లేదు. తన సోదరి దగ్గర ఉంటూ ఒక పాత ఫియట్ కారుని కొనుక్కున్నాడు. వేలం తరువాత ఇల్లుని కూడా కూలగొట్టడంతో కారులోనే నివాసం ఉండటం మొదలుపెట్టాడు. ఒక అడవి ప్రాంతంలో కారుని పార్క్ చేసుకునే వాడు. బుట్టలు అల్లుకుంటూ వచ్చిన డబ్బుతో జీవనం సాగించేవాడు. అలా పదమూడేళ్లు గడిచాక మీడియా గౌడ విషయాన్ని వెలుగులోకి తేవడంతో పలువురు పరిపాలనా అధికారులు స్పందించారు.
కానీ అతను అక్కడి నుండి రావడానికి కానీ, వైద్యపరీక్షలకు కానీ అంగీకరించలేదు. అయితే డిప్యూటీ కమిషనర్ హోదాలో ఉన్న ఎబి ఇబ్రహీం మాత్రం అతనితో మాట్లాడాం…మా సహాయం తీసుకోవడానికి ఒప్పుకున్నాడు అంటున్నారు. మంగళూరుకి వచ్చి జీవించమని చెప్పినా, సొసైటీ మీద అతను చేసిన ఫిర్యాదుపై ముందుకు వెళ్లడానికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామని చెప్పినా గౌడ అంగీకరించలేదు. సొసైటీ తనపని తాను నిర్వహించడంలో తప్పు లేదు కానీ, అది వ్యవహరించిన తీరులోనే లోపం ఉందని డిప్యూటీ కమిషనర్ అంటున్నారు.
జిల్లా మెడికల్ అధికారి అతనికి వైద్య పరీక్షలు జరిపించమని ఆదేశించగా సంబంధిత సిబ్బంది ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ గౌడ పరీక్షలు చేయించుకోకుండానే అక్కడి నుండి వెళ్లిపోయాడు. గౌడకి కౌన్సెలింగ్ అవసరమని ఓ సైకియాట్రిస్టు అంటున్నారు. ఏదిఏమైనా చంద్రశేఖర్ గౌడ మనసుకి తీవ్రమైన గాయమైనట్టుగా అతని ప్రవర్తన వలన తెలుస్తోంది.