ఆవు పేడ పిడకలు...ఆన్‌లైన్లో హాట్ కేకులు!
రామాయణంలో పిడకల వేట అనేది ఒక పాతకాలపు నానుడి. కానీ ఇప్పుడు మన కళ్లముందు భారతంలో పిడకల వేట కనబడుతోంది. చెట్టుమీది కాయని, సముద్రంలో ఉప్పుని కలుపుతుంది వ్యాపారం. ఆధునిక మార్కెట్ ఏమైనా చేయగలుగుతుంది. దండకారణ్యంలో ఉన్నవాడికి కూడా ఆన్‌లైన్లో ఆహారం సప్లయి చేయగలుగుతుంది. అదే వరుసలో ఇప్పుడు మారుమూల గ్రామాల నుండి ఆవు పేడ పిడకలను, వేల కిలోమీటర్లు దాటించి అవసరం ఉన్నవారికి చేరవేస్తోంది. అమెజాన్, ఈ బే లాంటి ఆన్‌లైన్ రిటైల్ వాణిజ్య […]
By - sarviUpdate:2015-12-29 07:49 IST
రామాయణంలో పిడకల వేట అనేది ఒక పాతకాలపు నానుడి. కానీ ఇప్పుడు మన కళ్లముందు భారతంలో పిడకల వేట కనబడుతోంది. చెట్టుమీది కాయని, సముద్రంలో ఉప్పుని కలుపుతుంది వ్యాపారం. ఆధునిక మార్కెట్ ఏమైనా చేయగలుగుతుంది. దండకారణ్యంలో ఉన్నవాడికి కూడా ఆన్‌లైన్లో ఆహారం సప్లయి చేయగలుగుతుంది. అదే వరుసలో ఇప్పుడు మారుమూల గ్రామాల నుండి ఆవు పేడ పిడకలను, వేల కిలోమీటర్లు దాటించి అవసరం ఉన్నవారికి చేరవేస్తోంది. అమెజాన్, ఈ బే లాంటి ఆన్‌లైన్ రిటైల్ వాణిజ్య సంస్థలు, గ్రామీణ మహిళలు తయారుచేస్తున్న ఆవు పేడ పిడకలను నగరాలు, పట్టణాలకు అందమైన ప్యాంకింగ్‌ల్లో చేరవేస్తున్నాయి. ఎక్కువ ఆర్డరు ఇస్తే పిడకలమీద డిస్కౌంటు కూడా ఇస్తున్నాయి. అలాగే కొనుగోలు దార్ల కోరికమేరకు వాటిని అందమైన గిఫ్ట్ రేపర్లతో అలంకరించి మరీ ఇస్తున్నాయి.
హిందూ మత సంప్రదాయాల్లో, పూజలు, వ్రతాలు, హోమాలు వంటివాటిలో తప్పనిసరిగా ఆవు పేడ పిడకలను అగ్ని కోసం వినియోగిస్తారు. దీపావళి రోజుల్లో పిడకల డిమాండ్ మరింతగా ఉందని భారత్‌లో అతిపెద్ద ఆన్‌లైన్ రిటైల్ అమ్మకాల సంస్థల్లో ఒకటైన షాప్‌క్లూస్ ప్రతినిధి రాధికా అగర్వాల్ అంటున్నారు. దీపావళినాడు తమ ఇళ్లలో, ఫ్యాక్టరీలు, ఆఫీసుల్లో పూజలు నిర్వహించేవారిలో చాలామంది ఆవు పేడ పిడకల కోసం తమకు కాల్ చేస్తున్నారని ఆమె చెప్పారు. చలికాలం విహార ప్రదేశాలకు వెళ్లేవారు కూడా వెచ్చదనం కోసం వీటినే ఇంధనంగా వాడుతున్నారని, కొంతమందయితే తమ చిన్ననాటి స్మృతులను గుర్తు తెచ్చుకుని ఆ అనుభూతిని పొందడానికి ఈ పిడకల మంటలను ఆస్వాదిస్తున్నారని రాధిక చెబుతున్నారు.
రెండు నుండి ఎనిమిది పిడకలతో ప్యాకింగులను తయారు చేస్తున్నారు. ఒక్కో పిడక బరువు 200 గ్రాములు ఉంటోంది. ఈ ప్యాకింగుల ధర వంద నుండి నాలుగువందల రూపాయల వరకు ఉంటోంది. ఈ పిడకలను సేంద్రియ ఎరువులుగా వాడుతున్న వారూ ఉన్నారు. తమ పెరటితోట మొక్కలకు ఎరువుగా కొంతమంది వీటిని వాడుతున్నారు. ఏదిఏమైనా గ్రామీణ మహిళలకు ఉపాధి మార్గాన్ని చూపుతున్నఈ సరికొత్త వ్యాపారాన్ని ఆహ్వానించదగిన అంశంగానే భావించాలి.