షర్మిల భవిష్యత్ ఏంటి..? సాక్షి ఆసక్తికర కథనం

ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ లో కూడా షర్మిలపై వ్యతిరేకత పెరుగుతుందని అంటున్నారు. షర్మిల నాయకత్వం వల్ల ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగవకపోగా.. మరింత దిగజారుతుందన్నారు.

Advertisement
Update: 2024-06-03 06:58 GMT

ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఏపీలో తొలి ఎన్నికలను ఎదుర్కొన్న వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్ ఏంటి..? దీనిపై ఎవరెవరు ఎలా కామెంట్ చేసినా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ.. జగన్ కి సంబంధించిన 'సాక్షి' మీడియాలో కథనం వచ్చిందంటే కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. కొంతకాలం షర్మిల విషయంలో అంటీముట్టనట్టుగా ఉన్న సాక్షి మీడియా.. ఆమె ఆరోపణలు, వివేకా హత్యకేసు విషయంలో ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో కౌంటర్ అటాక్ మొదలు పెట్టింది. పోలింగ్ తర్వాత ఇప్పటి వరకు షర్మిలను పక్కనపెట్టిన సాక్షి.. తాజాగా ఆమె రాజకీయ భవిష్యత్ ఏంటనే విషయంపై ఆసక్తికర కథనాన్నిచ్చింది.

డిపాజిట్ కష్టం.. భవిష్యత్ అగమ్యగోచరం..

షర్మిలకు కడప పార్లమెంట్ సెగ్మెంట్ లో డిపాజిట్ కష్టమని సాక్షి కథనం సారాంశం. ఆ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే 10 అసెంబ్లీ సీట్లలో కూడా కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థులు డిపాజిట్ కోల్పోతున్నారని, దీంతో షర్మిల వ్యక్తిగత ఇమేజ్ కూడా పూర్తిగా డ్యామేజీ అవుతుందని వార్తలిచ్చారు. ఎన్నికల వేళ ఆమె ఎప్పుడూ వెళ్లని గ్రామాలకు కూడా వెళ్లి కొంగుచాచి మరీ ఓట్లు అభ్యర్థించిందని, అయినా కూడా సెఫాలజిస్ట్ లు ఆమెను పట్టించుకోలేదని, డిపాజిట్లు కూడా దక్కవంటున్నారని చెప్పుకొచ్చింది. అంటే.. వివేకా సెంటిమెంట్ అస్త్రం కూడా కడపలో షర్మిలకు ఉపయోగపడలేదని ఆ కథనం సారాంశం.

కాంగ్రెస్ లో వ్యతిరేకత..

ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ లో కూడా షర్మిలపై వ్యతిరేకత పెరుగుతుందని అంటున్నారు. కడపలో షర్మిల తరపున తొలివిడత ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్న డాక్టర్‌ నర్రెడ్డి తులసిరెడ్డి, రెండో విడతలో ఆమె పక్కన లేరని, తులసిరెడ్డిని ఆమె కావాలనే దూరం పెట్టిందని చెబుతున్నారు. కాంగ్రెస్ లో క్రియాశీలకంగా ఉన్న నాయకులను కూడా షర్మిల పట్టించుకోలేదని, వారంతా ఆమెకు, పార్టీకి దూరమయ్యారని, ఫలితాల తర్వాత పరిస్థితి మరింతగా మారుతుందని తేల్చి చెబుతున్నారు. షర్మిల నాయకత్వం వల్ల ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగవకపోగా.. మరింత దిగజారుతుందని, నాయకులంతా పార్టీకి దూరమవుతున్నారని సాక్షి ప్రత్యేక కథనాన్నివ్వడం విశేషం. 

Tags:    
Advertisement

Similar News