ఏరి? ఎక్కడ... ఆ ఉత్తర కుమారులు?
బలుపుకు వాపుకు తేడా ఏంటో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు, శ్రేణులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఆవులు మళ్లించే అర్జునులు ఎవరో .. ఉత్తిత్తి మాటలు చెప్పే ఉత్తరకుమారులు ఎవరో కూడా తేలిపోతోంది. తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యమాని టీ కాంగ్రెస్ అగ్రనేతల సత్తా ఎమిటో మరోసారి రుజువైంది. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ బతికి బట్టకట్టిందని ఎవరైనా అంటే తెలంగాణకే చెందిన సోకాల్డ్ సీనియర్ నేతలు కస్సున లేచేవారు. కాంగ్రెస్ వల్లే రాజశేఖర్ […]
బలుపుకు వాపుకు తేడా ఏంటో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు, శ్రేణులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఆవులు మళ్లించే అర్జునులు ఎవరో .. ఉత్తిత్తి మాటలు చెప్పే ఉత్తరకుమారులు ఎవరో కూడా తేలిపోతోంది. తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యమాని టీ కాంగ్రెస్ అగ్రనేతల సత్తా ఎమిటో మరోసారి రుజువైంది. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ బతికి బట్టకట్టిందని ఎవరైనా అంటే తెలంగాణకే చెందిన సోకాల్డ్ సీనియర్ నేతలు కస్సున లేచేవారు. కాంగ్రెస్ వల్లే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, హస్తం గుర్తే లేకుంటే వైఎస్ ఎక్కడున్నారని ప్రశ్నించేవారు. మండుటెండలో పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ను వైఎస్ ఒంటిచేత్తో బతికించారని అన్నప్పుడు కూడా అంతే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితం సోనియా ప్రసాదించిన భిక్ష అని కూడా డైలాగులు పేల్చారు.
Click to Read: కడపలో స్టీల్ ప్లాంట్- కాగుతున్న నూనెలో చేయి పెట్టడమేనా?
మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కవిత చేతిలో ఓడిపోయిన మాజీ ఎంపీ మధుయాష్కి అయితే నిత్యం ఇవే డైలాగులు చెప్పేవారు. రోజూ ప్రెస్‌మీట్లు పెట్టే మరో రాజ్యసభ ఎంపీ అయితే రాజశేఖర్ రెడ్డి ప్లేస్‌లో తాను ముఖ్యమంత్రిని కావాల్సిన వాడినని, ఆయన తొక్కేశారని చెప్పేవారు. సదరు ఎంపీ గారే సోనియా గాంధీ దగ్గరకు వెళ్లి మొన్నటి ఎన్నికలకు ముందు తెలంగాణ ఇస్తే 17 మంది ఎంపీలను వెంటబెట్టుకుని ఢిల్లీ వస్తానని కోతలు కోశారని కూడా చెబుతుంటారు. అయితే గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సదరు సీనియర్ నేత స్వయంగా డిపాజిట్లు కోల్పోయారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారంటే… పీసీసీ చీఫ్ సరైన వ్యక్తి లేకపోవడం వల్లే ఓడిపోయామంటూ మొత్తం నెపాన్ని పొన్నాల లక్ష్మయ్య మీదకు నెట్టేశారు. మరి ఇప్పుడు పీసీసీ చీఫ్ ఉత్తమకుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి ఏం చేస్తున్నారు?. వరంగల్‌లో డిపాజిట్ కూడా సాధించలేకపోయారు.
ఇప్పుడు 12ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే ఏడు స్థానాల్లో అసలు పోటీ చేసే ధైర్యం కూడా చేయలేని దుస్థితికి చేరారు. కొన్ని జిల్లాల్లో స్థానిక సంస్థల నుంచి టీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ అభ్యర్థులే ఎక్కువగా విజయం సాధించారు. అక్కడ కూడా కనీసం అభ్యర్థిని నిలిపే దమ్ము కూడా కాంగ్రెస్ నేతలకు లేకుండాపోయింది. చివరకు ఓడిపోతామని తెలిసినా క్రికెట్‌లో ఆఖరి బంతి వరకు ఆట ఆడుతారు. ఆ మాత్రం స్పూర్తి, ధైర్యం కూడా ఇప్పుడు టీ కాంగ్రెస్ నేతలకు, లేదంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా అన్నది ఆ పార్టీ శ్రేణుల ఆవేదన. కాంగ్రెస్ ఉంది. సోనియా గాంధీ ఉన్నారు. కోతలు కోసిన నేతలూ ఉన్నారు. కానీ కాంగ్రెస్‌కు డిపాజిట్లు తీసుకురాగల ధీరులే కనిపించడం లేదు. కనీసం అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులు బరిలో దిగేలా చేయగల నేతలు లేరు. ఉన్న వారంతా కోతల కుమారులే అన్నది కాంగ్రెస్ శ్రేణుల బాధ.