బీజేపీ ప్రభ మసకబారుతోందా?
దేశంలో దశాబ్దకాలం తరువాత తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ విజయం గాలివాటమా? ఎన్నికల ముందు చాయ్‌వాలాగా జనాల ఆదరణ దక్కించుకున్న మోదీ ప్రభ తగ్గుతోందా? గతేడాది అధికారంలోకి వచ్చాక హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగరవేసింది. కశ్మీర్లో పాగా వేసింది. ఇదంతా మోదీ చలవేనని మీడియా, బీజేపీ- ఎన్డీఏ మిత్రపక్షాలు ఊదరగొట్టాయి. కానీ, కొంతకాలంగా కమలనాథుల కంచుకోటలు కదులుతున్నట్లుగా ఉంది. దీనికి ఢిల్లీ రాష్ట్ర ఎన్నికలతో బీజంపడిందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఢిల్లీ […]
Advertisement
దేశంలో దశాబ్దకాలం తరువాత తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ విజయం గాలివాటమా? ఎన్నికల ముందు చాయ్‌వాలాగా జనాల ఆదరణ దక్కించుకున్న మోదీ ప్రభ తగ్గుతోందా? గతేడాది అధికారంలోకి వచ్చాక హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగరవేసింది. కశ్మీర్లో పాగా వేసింది. ఇదంతా మోదీ చలవేనని మీడియా, బీజేపీ- ఎన్డీఏ మిత్రపక్షాలు ఊదరగొట్టాయి. కానీ, కొంతకాలంగా కమలనాథుల కంచుకోటలు కదులుతున్నట్లుగా ఉంది. దీనికి ఢిల్లీ రాష్ట్ర ఎన్నికలతో బీజంపడిందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఢిల్లీ ఎన్నికలతో మోదీకి సంబంధం లేదని, అక్కడ ప్రత్యేక పరిస్థితులు ఉన్నందు వల్లే 70 స్థానాలున్న ఢిల్లీలో కేవలం 3 స్థానాలు గెలుచుకున్నామని చెప్పుకొచ్చారు.
ఇది మోదీ పాలనకు రెఫరెండం కాదా?
ఢిల్లీ ఓటమిని ఆప్ గాలివాటంగా అభివర్ణించింది బీజేపీ. మరి ఇప్పుడు తాజాగా బీహార్ ఎన్నికల ఓటమి మోదీ పరిపానలకు రెఫరెండం కాదని చెప్పే ధైర్యం బీజేపీ నేతలు చేయగలరా? వారు చెప్పినా.. చెప్పకున్నా.. దేశ ప్రజలతో పాటు, బ్రిటన్, అమెరికాలు సైతం బిహార్ ఎన్నికను ఆసక్తిగా గమనిస్తున్నాయంటే.. ఇది ముమ్మాటికీ మోదీ పాలనకు రెఫరెండంగానే భావించాల్సి ఉంది. నితీశ్ పాలనను రాక్షసపాలనతో అభివర్ణించిన మోదీ, అక్కడ రామరాజ్యాన్ని ఎందుకు తేలేకపోయారంటే..ఏమని సమాధానం చెబుతారు. కొంతకాలంగా దేశంలో ముస్లింలపై పెరుగుతున్న దాడులు, గోమాంసం విషయంలో చెలరేగుతున్న వివాదాలపై మోదీ మౌనం కూడా బీహర్‌లో ఓటమికి కారణాలుగానే చెప్పవచ్చు. సాహితీవేత్తల పురస్కార్ వాపసీ కూడా కమలనాథుల ఓట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపెట్టింది. ఇకపోతే బీహార్ ఎన్నికల కోసం ఎంఐఎంలాంటి మతతత్వ పార్టీలతో బీజేపీ రహస్య ఒప్పందం చేసుకుందన్న ప్రత్యర్థుల ఆరోపణలు కూడా పార్టీ విజయావకాశాలను దెబ్బతీశాయి.
దక్షిణాదిన ప్రభావం చూపుతుందా?
బిహార్‌లో ఓటమి కచ్చితంగా దక్షిణాదిపై ప్రభావం చూపుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కర్ణాటక, ఏపీ, తెలంగాణలో పార్టీ క్రియాశీలకంగా ఉంది. ముఖ్యంగా ఏపీలో టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొత్త రాష్ట్రం ఏపీలో రాజధాని నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక హోదా కల్పిస్తామని మాట తప్పిన మిత్రపక్షంగా బీజేపీ ఓ అపవాదు మూటగట్టుకుంది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో సాక్షాత్తూ ప్రధాని మోదీనే స్వయంగా బీహర్‌కు రూ.2 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినా.. అక్కడి ఓటర్లు ఆదరించలేదంటే.. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో మాట నిలబెట్టుకోకపోవడం కూడా ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలోలాగానే గెలిచాక మాట తప్పుతారన్న భయం అక్కడి ఓటర్లలో కలిగి ఉంటుందని, కేంద్రంలో ఉన్న సర్కారును రాష్ట్రంలో ఆదరించకపోవడానికి ఇది కూడా కారణమనే చెబుతున్నారు.
Advertisement