చదువుకి కాదు...ఒత్తిడికి గ్రేడ్‌లివ్వండి!
చదువు భారమై ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులు మన విద్యా విధానానికి ఒక సవాలుగా మారుతున్నారు. అయినా దీనిపై ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకున్నట్టుగా కనిపించదు. పిల్లల ప్రతిభను మూల్యాంకనం చేయడంలో,పరీక్షల విధానంలో చేసిన మార్పుల కారణంగా పిల్లలపై, టీచర్లపై మరింత ఒత్తిడి పడుతున్నది. చదువు వారందరికీ ఒక దాటలేని ఏరుగా మారి, ముంచేస్తుందేమో అనే భయాందోళనలను కలిగిస్తోంది. పద్నాలుగేళ్ల వయసులో ఒంటిపై కిరోసిన్ పోసుకుని మరణించాలని శ్రావణి అనే తొమ్మిదవ తరగతి విద్యార్థినికి అనిపించిందంటే ఈ చదువులు ఎంత భారంగా మారాయో అర్థం చేసుకోవచ్చు. మార్కులు […]
చదువు భారమై ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులు మన విద్యా విధానానికి ఒక సవాలుగా మారుతున్నారు. అయినా దీనిపై ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకున్నట్టుగా కనిపించదు. పిల్లల ప్రతిభను మూల్యాంకనం చేయడంలో,పరీక్షల విధానంలో చేసిన మార్పుల కారణంగా పిల్లలపై, టీచర్లపై మరింత ఒత్తిడి పడుతున్నది. చదువు వారందరికీ ఒక దాటలేని ఏరుగా మారి, ముంచేస్తుందేమో అనే భయాందోళనలను కలిగిస్తోంది. పద్నాలుగేళ్ల వయసులో ఒంటిపై కిరోసిన్ పోసుకుని మరణించాలని శ్రావణి అనే తొమ్మిదవ తరగతి విద్యార్థినికి అనిపించిందంటే ఈ చదువులు ఎంత భారంగా మారాయో అర్థం చేసుకోవచ్చు. మార్కులు ఇవ్వడం మానేసి గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం విద్యార్థుల్లోని చదువుని కాదు, వారిలోని ఒత్తిడిని మూల్యాంకనం చేసి గ్రేడింగ్ ఇవ్వాలి. ఏ విద్యార్థిలో ఎంత చదువుందో తెలుసుకోవడం కాదు, ఎవరిలో ఎంత స్ట్రెస్ ఉందో, ఎవరు ఎంతగా మనోవేదనతో కుంగిపోతున్నారో తెలుసుకుని తీరాలి.
పిల్లలు తమఫీలింగ్స్‌ని వెల్లడించడానికి విద్యా సంస్థల్లోనే ఒక వేదిక ఉండాలి. ఇదివరకు రోజుల్లో కేవలం నీతి కథలు చెప్పుకునేందుకు ఒక క్లాస్ ఉన్నట్టుగా. ప్రాణాలు తీసుకుంటూ సూసైడ్ నోట్‌లో వెల్లడిస్తున్న భావాలను, వారు అంతకుముందే నిర్భయంగా వెల్లడించగలగాలి. తమ గోడుని విని, తీర్చేవారున్నారని పిల్లలు నమ్మాలి. ఎలాగూ ఒత్తిడిలేని విద్యని అందించే శక్తి మనకు లేదు కనుక కనీసం ఇలాంటి అవకాశాలన్నా పిల్లల ముందుకు తేవాలి. తనకు క్లాస్‌లో అన్యాయం జరుగుతోందని ఒక విద్యార్థి భావించినపుడు, దానికారణంగా ఆమె లేదా అతని మనోభావాలు, ఇక బతకకూడదు అనిపించేంతగా దెబ్బతిన్నపుడు…ఆత్మహత్యే మార్గం కాదని వారికి అర్థం కావాలి. కన్న తల్లిదండ్రులు, గురువులు, ఇష్టమైన స్నేహితులు, సన్నిహితులు ఒక్కరైనా తమకు అండగా నిలుస్తారనే ధైర్యం లేకుండా, అంత దారుణంగా ఎందుకు గాయపడుతున్నారో పెద్దలు అర్థం చేసుకోవాలి. చదువులు, మార్కులు మాత్రమే జీవితం కాదని, వాటిని మైనస్ చేసినా బంగారంలాంటి జీవితం అలాగే ఉంటుందని పిల్లలకు నమ్మకం కలిగించాలి.
ఈమధ్యకాలంలో దేశంలో అసహనం పెరిగిపోతోందని, ఇది అవాంఛనీయ సంఘటనలకు దారితీస్తుందనే ఆందోళన దేశవ్యాప్తంగా వినబడుతోంది. ఆ అసహనాన్నిమించినది విద్యార్థుల్లో పెరుగుతున్న అసహాయత. విద్యావ్యవస్థకు సమాంతరంగా విద్యార్థుల్లో ఒత్తిడిని దూరంచేయడానికి తగిన వ్యవస్థని సృష్టించాలి. దాన్ని సమర్ధవంతంగా నడపాలి. ఇది ఇప్పుడు అత్యవసరంగా కనిపిస్తున్న పరిస్థితి. పిల్లలు, మేము చెప్పిందే చదవాలని ఆశించే తల్లిదండ్రులకు, అర్థం అయినా కాకపోయినా గుడ్డిగా చదివి ర్యాంకులు తెచ్చుకోవాలని ఆశించే విద్యాసంస్థలకు, పిల్లల్లో పేరుకుపోతున్న చదువుల ఒత్తిడిమీద క్లాసులు తీసుకోవాలి.
పిల్లలపై ఒత్తిడిని పెంచుతున్న అంశాలు…
-మీరు జీవితానికి చాలా ముఖ్యమైన దశలో ఉన్నారని, ఇప్పుడు ఫెయిలయితే, జీవితంలో ఫెయిలయినట్టేనని పిల్లలకు నూరిపోయడం.
– పిల్లలపై అంతా మితిమీరిన అంచనాలు పెట్టుకోవడం
– పెరుగుతున్న వయసు, చదువులతో వారి జీవన శైలిలో వచ్చిన మార్పులు, కొత్తవాతావరణంలో ఇమడాల్సి రావడం (కాలేజీల్లో, హాస్టల్స్‌లో). హాస్టల్ అయితే నిద్ర, ఆహారంలో మార్పులు, రూమ్మేట్స్ తో సమస్యలు. వారు అవసరం అనుకున్నపుడు పెద్దవాళ్లు తోడుగా లేకపోవడం.
-చెప్పుకోదగిన బాధలు లేకపోయినా ఒక్కసారిగా జీవితంలో వచ్చిన మార్పులు, అమితమైన ఉత్సాహభరిత వాతావరణం సైతం ఒత్తిడికి గురిచేస్తాయి.
-వయసుతో పాటు వారి శరీరంలో, భావోద్వేగాల్లో వస్తున్న మార్పులను స్వీకరించే శక్తి లేకపోవడం, మనసు విప్పి చెప్పే అవకాశాలు లేకపోవడం
-చదువుకోసం తమ ఆటపాటలను అభిరుచులను వదిలివేయాల్సి రావడం, ..వీటితో పాటు వారిలో ఒత్తిడిని నిభాయించుకునే శక్తి సామర్ధ్యాల లోపం, టైమ్ మేనేజిమెంట్, హెల్త్ మేనేజ్‌మెంట్ వంటివి అంతుపట్టకపోవడం. ఇవన్నీ విద్యార్థుల్లో ఒత్తిడికి కారణం కావచ్చు.
అసలు ఒత్తిడి అంటే ఏమిటి?
ఒక వాస్తవ లేదా ఊహించిన భయానికి, ఒక మార్పుకి, ఒక సంఘటనకు మనసు, శరీరాలు స్పందించే తీరే ఒత్తిడి. వీటినే స్ట్రెస్సర్స్ అంటారు. ఇవి మానసికమైన భయాలు, యాటిట్యూడ్ సమస్యలు, ఆందోళనలు కావచ్చు లేదా భౌతికంగా వాస్తవ జీవితంలో వచ్చిన మార్పులు కావచ్చు. అంటే హాస్టల్‌కి వెళుతున్న అమ్మాయి ఒంటరితనాన్ని ఫీల్ కావడం, లేదా ఏ ఆర్థిక, కుటుంబ సమస్యలో ఎదురుకావడం రెండూ ఒత్తిడికి మార్గాలే. యవ్వనంలోకి అడుగుపెడుతున్న పిల్లలకు శారీరక, మానసిక, సామాజిక, విద్యాపరమైన మార్పులు ఒత్తిడిని కలిగిస్తాయి.
శారీరక సమస్యలు
-ఆకలి తగ్గుతుంది, లేదా పెరిగిపోతుంది.
-అలసట పెరుగుతుంది. శరీరంలో వివిధ భాగాల్లో నొప్పులు, తలతిరగటం, పొట్టలోనొప్పులు, నిద్రాపరమైన సమస్యలు.
-ఒత్తిడి రోగనిరోధక శక్తిని తగ్గించివేయడం వలన తరచుగా జ్వరం, జలుబు, దగ్గు రావడం మానసిక సమస్యలు.
-ఆత్మవిశ్వాసం లోపించడం, తమనితాము తక్కువగా భావించడం -తీవ్రమైన ఆందోళన, కోపం లేదా డిప్రెషన్.
-ఆత్మగౌరవం లేకపోవడం, చిన్న బాధని, అవమానాన్ని తట్టుకోలేకపోవడం.
-ఏకాగ్రత లేకపోవడం, చదువు శక్తికి మించినదిగా అనిపించడం ఒత్తిడి ఒక దశ వరకు మంచిదే, లక్ష్యం పట్ల మో టివేట్ చేస్తుంది. కానీ అది దాటి శ్రుతి మించితేనే నెగెటివ్‌గా మారుతుంది. తల్లిదండ్రులు, గురువులు అందరి దృష్టీ విద్యార్ధుల చదువులమీదే ఉంటుంది. వారెలా చదువుతున్నారు అనేది ముఖ్యమే… దాంతో పాటు వారెలా ఉన్నారు… అనేది మరింత ముఖ్యమైన అంశం. పిల్లలు బాగా చదవాలి… అందుకు వారి మనసు, శరీరం ఆరోగ్యంగా ఉండాలి. పిల్లల ముందు భారీ లక్ష్యాలు ఉంచే పెద్దలు ఈ చిన్న అంశాలు గుర్తుంచుకుని తీరాలి.
-వి.దుర్గాంబ