పలకరిస్తే చాలు...అమ్మ పులకరిస్తుంది
ఉంగా… ఉంగా అంటూ ఊకొట్టే పాపాయికి, ఏమీ అర్థం కాదని తెలిసినా ఆ చిన్నారి కళ్లలో కళ్లుపెట్టి చూస్తూ, బోలెడన్ని కథలు కబుర్లు చెబుతుంది అమ్మ. అలా అమ్మ కబుర్లతో పెరిగి పెద్దయిన పిల్లలు అందరూ, వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లి కళ్లలోకి చూస్తూ కాసేపు ఆప్యాయంగా కబుర్లు చెబుతున్నారా అంటే…అవును అనలేము. ఎందుకంటే ఆ పని, తమకున్న అన్ని పనుల్లో ఆఖరిది, అసలు ప్రయార్టీ లేనిదిగా చాలామంది భావిస్తున్నారు కనుక. అలాంటివారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే వృద్ధాప్యంలో తమకు దగ్గరగా కూర్చుని […]
ఉంగా… ఉంగా అంటూ ఊకొట్టే పాపాయికి, ఏమీ అర్థం కాదని తెలిసినా ఆ చిన్నారి కళ్లలో కళ్లుపెట్టి చూస్తూ, బోలెడన్ని కథలు కబుర్లు చెబుతుంది అమ్మ. అలా అమ్మ కబుర్లతో పెరిగి పెద్దయిన పిల్లలు అందరూ, వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లి కళ్లలోకి చూస్తూ కాసేపు ఆప్యాయంగా కబుర్లు చెబుతున్నారా అంటే…అవును అనలేము. ఎందుకంటే ఆ పని, తమకున్న అన్ని పనుల్లో ఆఖరిది, అసలు ప్రయార్టీ లేనిదిగా చాలామంది భావిస్తున్నారు కనుక. అలాంటివారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది.
అదేమిటంటే వృద్ధాప్యంలో తమకు దగ్గరగా కూర్చుని మాట్లాడే సన్నిహితులు లేని వృద్ధులు మిగిలిన వారికంటే రెండింతలు ఎక్కువగా డిప్రెషన్‌కి గురయ్యే ప్రమాదం ఉందని ఓ అమెరికన్ పత్రికలో ప్రచురించారు. అధ్యయనం చేసి కనుగొన్న ఫలితమిది. ఫోన్లలో, మెయిల్స్‌లో పలకరిస్తున్నాం కదా…అంటే సరిపోదని, ఇలాంటి పలకరింపులు ఎదురెదురుగా కూర్చుని ఆప్యాయంగా మాట్లాడటం వలన కలిగే ప్రయోజనాన్ని అందించలేవని కూడా చెబుతున్నారు.
నలుగురితో కలిసిమెలసి జీవించడం అనేది మానసిక ఆరోగ్యానికి మొదటి మెట్టవుతుందని ఇప్పటికే చాలా పరిశోధనల్లో తేలింది. అయితే ఆత్మీయులు, కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి కమ్యునికేషన్ ఉంటే డిప్రెషన్ ప్రమాదం తగ్గుతుందనే విషయాన్ని పరిశీలించినపుడు ఈ విషయం వెల్లడైంది. ఫోన్‌కాల్స్ చేయడం, స్కైప్‌లో చూస్తూ మాట్లాడటం లాంటివి ముఖాముఖి మాట్లాడటంతో సమానమైన ఫలితాన్ని ఇవ్వవన్న విషయాన్ని తాము గుర్తించామని ఒరేగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్శిటీలో అసిస్టెంట్ సైకియాట్రి ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ అలెన్ టో చెబుతున్నారు.
ఒంటరిగా ఉండటం, నేరుగా కమ్యునికేషన్ లేకపోవడం అనేవి పెద్దవయసువారిలో డిప్రెషన్‌ని పెంచి మరణాన్ని మరింత త్వరగా తెచ్చిపెడతాయని వీరు హెచ్చరిస్తున్నారు. నేరుగా మనుషులు కలుసుకుని మాట్లడటంతో వృద్ధులు డిప్రెషన్లో పడకుండా కాపాడవచ్చని సలహా ఇస్తున్నారు. రెండేళ్లపాటు ఇందుకోసం అధ్యయనాన్ని నిర్వహించారు. 50-69 సంవత్సరాల మధ్య వయసున్న వారిలో, స్నేహితులు తరచుగా కలుసుకుని కబుర్లు చెప్పుకోవడం వలన డిప్రెషన్ రిస్క్ తగ్గినట్టుగా, అదే 70 సంవత్సరాల వయసు పైబడిన వారిలో అయితే తమ పిల్లలు, సన్నిహిత బంధువులు దగ్గరగా ఉండటం, కబుర్లు చెప్పడం… డిప్రెషన్‌ని తగ్గించినట్టుగా కనుగొన్నారు.
తమ బిజీ పనుల్లో పడిపోయి తల్లిదండ్రులను పట్టించుకోనివారికే కాదు, తమని కన్నవాళ్లు వృద్ధాశ్రమాల్లో హాయిగా, ప్రశాంతంగా బతికేస్తున్నారు అనుకునేవారికి సైతం ఈ పరిశోధనా ఫలితాలను ఒక హెచ్చరికగా భావించవచ్చు.