శ్రుతి మించితే ఏదైనా వ్యసనమే అవుతుంది. అది మంచయినా, చెడయినా. సెల్‌ఫోన్ వాడకం ఇప్పుడు మనకు అలాగే తయారయింది. అది మనుషులను విడగొడుతుందో, కలుపుతుందో తెలియని పరిస్థితి. సమూహంలో ఒంటరి… అనే పదం సెల్‌ఫోన్‌కి అడిక్ట్ అయినవారికి సరిగ్గా సరిపోతుంది. వందమందితో కలిసి ఉన్నా ఫోన్ చేతిలో ఉంటే ఎవడిగొడవ వాడిదే. ఒక రకంగా మనుషులు వాస్తవ కనెక్షన్లకు దూరమై వర్చువల్ కనెక్షన్లకు దగ్గరవుతున్నారు.
అమెరికన్ ఫొటోగ్రాఫర్ ఎరిక్ పికర్ గిల్ తీసిన ఈ ఫొటోలు చూడటానికి ఫన్నీగా అనిపిస్తున్నా మనకు ఇలాంటి సీరియస్ హెచ్చరికలే చేస్తున్నాయి. వీటిలో ఒక కనిపించని విషాదం ఉంది… భయం గొలుపుతున్న వాస్తవం ఉంది. సెల్‌ఫోన్ మనుషుల మధ్య బంధాలు పెంచుతోందా…తగ్గిస్తోందా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానమే చెబుతున్నాయివి. రిమూవ్డ్ పేరుతో ఈయన ఈ వినూత్న ఫొటోసిరీస్ ప్రాజెక్టుని రూపొందించారు.
ఇందులో మనుషులు టెక్నాలజీకి ఎంతగా అడిక్ట్ అయిపోయారు…ఎల్లప్పుడూ ఫోన్ ద్వారా ప్రపంచానికి కనెక్ట్ అయి ఉండటం అనే ఒత్తిడిని ఎంతగా ఎదుర్కొంటున్నారు… అనే విషయాలు కళ్లకు కట్టినట్టుగా కనబడుతున్నాయి. తనకు ఎదురైన ఒక వాస్తవ సంఘటనను చూసి ప్రభావితుడై ఈ ఫొటో సీరిస్‌ని తీశారు ఎరిక్. ఆయనకు ఇలాంటి ఆలోచన ఇచ్చిన ఆ సంఘటన న్యూయార్క్, ట్రాయ్ సిటీలోని ఒక కాఫీషాప్‌లో ఎదురైంది.
ఒక కుటుంబం ఈ ఫొటో గ్రాఫర్ పక్క సీట్లలో కూర్చున్నారు. భార్యాభర్తలు, ఇద్దరు కూతుళ్లు. తండ్రి, ఇద్దరు కూతుళ్లు ఎవరిఫోన్లో వారు బిజీగా మాట్లాడుకుంటున్నారు. తల్లి చేతిలో మాత్రం ఫోన్ లేదు. ఆమె కుటుంబంతో సరదాగా గడపాలనే ఆశతో ఉన్నట్టుగా ఉంది. అందుకే ఫోన్‌ని పక్కన పెట్టేసింది. కానీ తనతో మాట్లాడేందుకు ఎవరికీ ఖాళీ లేకపోవడంతో విషాదంగా కిటీకిలోంచి బయటకు చూస్తోంది. తనకు అత్యంత ఆత్మీయులైన కుటుంబసభ్యులు పక్కనే ఉన్నా భరించలేనంత ఒంటరితనాన్ని ఆమె అనుభవించడం…ఈ ఫొటోగ్రాఫర్‌కి అర్థమైంది. అప్పుడు వచ్చిన ఆలోచనతో ఆయన…. మనుషులు ఒకరితో ఒకరు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నపుడు కూడా తమ ఫోన్లతో బిజీగా ఉండటంపై సెటైరికల్‌గా ఈ వరుస ఫొటోలు తీశాడు.
నిజజీవితంలో స్నేహితులు, భార్యాభర్తలు, కొలీగ్స్ ఇలా అనుబంధాల్లో ఉన్నవారు ఫోన్లు పట్టుకుని పక్కపక్కనే ఉండేలా చేశాడు. తరువాత వాళ్లను అదే భంగిమల్లో ఉంచి చేతుల్లోంచి ఫోన్లను తీసేశాడు. అప్పుడు ఫొటోలు తీశాడు. ప్రపంచంతో కనెక్ట్ అయి ఉండటం కోసం పక్కనున్న సన్నిహితుల ఉనికిని కూడా ఫీల్ కాలేకపోతున్న వారికి నిజంగా ఈ ఫొటోలు చెప్పదెబ్బలాగే ఉన్నాయి. వీటిని చూశాక ఫోన్ తో ఉండకూడని ఎన్ని సందర్భాల్లో మనం దానితో ఉంటున్నామో మనందరికీ గుర్తొచ్చే తీరుతుంది. అలాగేటెక్నాలజీని మనం వాడటం లేదని, అదే మనల్ని వాడుతోందన్న విషయం అర్థమౌతుంది.