ఉడికీ ఉడకని వంట

చికెన్‌ లేకుండా చికెన్‌ బిరియాని వండడం కష్టం. ఒకవేళ కాస్త మేకప్‌ చేసి మన ప్లేట్‌లో వడ్డించినా, కాసేపటికి మనకే అర్థం అవుతుంది అందులో ఏం లేదో! దర్శకుడు శీను వైట్ల దగ్గర ఒకటే కథ ఉంది. దానికి ఆయన రకరకాల తిరుగమోతలు వేసి, హీరోలను మార్చి, బాక్సాఫీస్‌ దగ్గర మోత మోయించాలని చూస్తాడు. దూకుడులో మోత మోగింది. ఆగడులో శీనువైట్ల వీపుమోగింది. ఆ ప్రమాదం రిపీట్‌కాకుండా సేఫ్‌గేమ్‌కోసం బ్రూస్‌లీలో ప్రయత్నించాడు. అవుట్‌ కాలేదు కానీ, గోల్‌ […]

Advertisement
Update:2015-10-16 18:41 IST

చికెన్‌ లేకుండా చికెన్‌ బిరియాని వండడం కష్టం. ఒకవేళ కాస్త మేకప్‌ చేసి మన ప్లేట్‌లో వడ్డించినా, కాసేపటికి మనకే అర్థం అవుతుంది అందులో ఏం లేదో!
దర్శకుడు శీను వైట్ల దగ్గర ఒకటే కథ ఉంది. దానికి ఆయన రకరకాల తిరుగమోతలు వేసి, హీరోలను మార్చి, బాక్సాఫీస్‌ దగ్గర మోత మోయించాలని చూస్తాడు. దూకుడులో మోత మోగింది. ఆగడులో శీనువైట్ల వీపుమోగింది. ఆ ప్రమాదం రిపీట్‌కాకుండా సేఫ్‌గేమ్‌కోసం బ్రూస్‌లీలో ప్రయత్నించాడు. అవుట్‌ కాలేదు కానీ, గోల్‌ కొట్టలేకపోయాడు.
గోధుమపిండితో పూరీలు, పుల్కాలు, చపాతీలు, రోటీలు, నాన్‌లు ఇలా రకరకాలు చేయచ్చు. అయితే అన్నిటికంటే ముఖ్యం అవి సరిగా కాలాలి. ఎంత ఆకలివున్నా పిండిని ఎవడూ తినలేడు. సినిమా గురించి మాట్లాడకుండా బిరియాని, పూరి, తిరుగమోత ఈ గోలేంటి అనుకుంటున్నారా? సినిమాకూడా ఇలాగే మెయిన్‌ట్రాక్‌లోంచి సైడ్‌ట్రాక్‌లోకి దూకి పల్టీలు కొడుతూవుంటే చివరికి ఇక లాభం లేదనుకుని చిరంజీవివచ్చి కాస్త నిలబెట్టే ప్రయత్నం చేశాడు.
బ్రూస్‌లీ గురించి చెప్పాలంటే చిరంజీవి గురించే చెప్పాలి. ఆయన కనిపించేది గట్టిగా పదినిముషాలే అయినా సినిమా అంతా ఉంటే బావుండేది అనిపిస్తుంది. చిరంజీవి ఎంత ఎనర్జిటిక్‌గా ఉన్నాడంటే ఇంకో పదేళ్ళు హీరోగా చేసి అన్ని రికార్డుల్ని బద్దలుగొట్టేలా ఉన్నాడు.
మన సామాజిక జీవనంలో అసమానతలు, కులాలు ఇలా ఎన్నిలోపాలున్నా మనల్ని గట్టిగా బంధించేది కుటుంబం. భారతీయ సంస్కృతిలో ఉన్న బలమే కుటుంబం. తండ్రిమాటకోసం అడవులకు వెళ్ళిన రాముడిలో నచ్చేది మనకు కుటుంబబంధం, అలాగే రాజ్యంకోసం యుద్ధం చేసిన అన్నదమ్ముల్లో మనకు నచ్చనిది ఇదే. యూరోపియన్‌ సంస్కృతిలో కుటుంబం విచ్ఛిన్నమై చాలా కాలమైంది. మనకు ఇప్పుడిప్పుడే అది మొదలైంది. అయితే ఇంకా విధ్వంసకర స్థాయిలో లేదు. ఆర్థికశక్తుల వల్ల, దూరప్రాంతాల్లో ఉద్యోగాల వల్ల అన్నదమ్ములకి, అక్కచెల్లెళ్ళకి చాలామంది దూరమైపోతున్నారు. తిరిగి కలుసుకోవాలనే కోరికవల్ల ఎన్నికష్టాలకైనా వోర్చి సంక్రాంతి, దసరాలకి ఊళ్ళకు ప్రయాణమవుతున్నారు.
దూకుడు సినిమాలో బోలెడంత యాక్షన్‌, కామెడీ ఉన్నా మనకి బాగా నచ్చేది. మహేష్‌బాబుకి ఉన్న తండ్రి సెంటిమెంట్‌. తండ్రిని బాగుచేసుకోడానికి ఆయన పడేతపన మనల్ని కట్టిపడేస్తుంది. ఆ సినిమా విజయానికి ఇదే ప్రధానకారణం.
ఆగడులో కామెడీతోపాటు ఇలాంటి ఆప్యాయతని కూడా మిస్సయిన శీనువైట్ల ఈసారి చాలా జాగ్రత్తగా వోపెనింగే అక్కాతమ్ముళ్ళ సెంటిమెంట్‌తో ప్రారంభించాడు. అక్కకోసం చదువుని త్యాగంచేసిన తమ్ముడుగా హీరో ప్రయాణం మొదలవుతుంది. తండ్రి (రావు రమేష్‌) ఇద్దరిని చదివించలేడు కాబట్టి తాను స్టంట్‌మాస్టర్‌గా మారి అక్కకి చేయూతనిచ్చే తమ్ముడుగా రాంచరణ్‌ చాలా బాగా నటించాడు. అక్కడక్కడ గ్యాంగ్‌లీడర్‌ సినిమాని గుర్తుతెచ్చినా ఫస్టాఫ్‌ అంతా మంచి కామెడీ, లవ్‌ట్రాక్‌, ఫైట్లు, సెంటిమెంట్‌తో హాయిగా సాగిపోతుంది.
సెకాండాఫ్‌కి వచ్చేసరికి పాతఫార్ములానే నమ్ముకోవడంతో నస మొదలవుతుంది. గొప్ప పారిశ్రామికవేత్త, రాజ్యసభకి నామినేట్‌ కాబోయే వ్యక్తి, అండర్‌ గ్రౌండ్‌ డాన్‌ (సంపత్‌) చాలా సులభంగా, ఎప్పటిలాగే హీరో చేతిలో మూర్ఖుడు అవుతుంటాడు. బ్రహ్మానందం ప్రవేశించి కాసేపు వేరే ఎపిసోడ్‌కి తెరతీస్తాడు. ఇది మిస్‌ఫైర్‌ అయ్యింది. రొటీన్‌పాత్రలో బ్రహ్మానందం నవ్వించలేకపోయాడు. మూలకథ నడవకుండా ఆగిపోయి అరిగిపోయిన రికార్డులా గతంలో ఎన్నో సినిమాల్లో చూసిన సన్నివేశాలే మళ్ళీమళ్ళీ రావడంతో సెకండాఫ్‌ భారంగా నడుస్తుంది.
స్టంట్‌మాస్టర్‌గా, తమ్ముడుగా రాంచరణ్‌ వోకే. ఇక డ్యాన్స్‌లు ఎలాగూ బాగా చేస్తాడు. హీరోని పోలీస్‌ అధికారిగా కన్ఫ్యూజ్‌ అయ్యే హీరోయిన్‌గా రకుల్‌ అందంగా ఉంది. నదియా ఉన్నా నటించడానికేమీ లేదు. రావురమేష్‌ తండ్రిపాత్రల్ని ఫర్‌ఫెక్ట్‌గా చేస్తాడు.
సప్తగిరి, జయప్రకాష్‌రెడ్డి, షకలకశంకర్‌, పోసాని, పృథ్వి వీళ్ళంతా కూడా కామెడీ పండించారు. మొదటి సగభాగం కోనవెంకట్‌, గోపీ మోహన్‌ల ప్రతిభ కనిపిస్తుంది. సెకండాఫ్‌లో వాళ్ళుకూడా పాతచింతకాయనే ఎంచుకోవడం వల్ల విసుగనిపిస్తుంది.
అక్కాతమ్ముడు సెంటిమెంట్‌నే మెయిన్‌ ట్రాక్‌గా నడిపివుంటే చాలా బావుండేది. అయితే హీరో ఫ్యామిలీ కథకాకుండా ఇది విలన్‌ సంపత్‌ ఫ్యామిలీ కథగా మారేసరికి కుదుపులకి గురై చిరాకుకి గురి చేస్తుంది.
“లేచలో’ అనే పాట సూపర్‌ హిట్‌. మిగతాపాటలు కూడా నాట్‌బ్యాడ్‌. అభిమానులు పదేపదే చూడగలరేమో (చిరంజీవికోసం) కానీ సాధారణ ప్రేక్షకులు ఒకసారి చూడడానికి ఓకే.
శీనువైట్ల, కోనవెంకట్‌, గోపీ మోహన్‌లవద్ద మంత్రదండముంది సందేహం లేదు. అయితే వీళ్ళే కొత్తమంత్రాలు నేర్చుకోవడానికి బాగా బద్దకిస్తున్నారు. మంత్రదండానికి ఒకసారి రిపేరు వస్తే దానికీ కొయ్యముక్కకి తేడా ఉండదు.

– జిఆర్‌. మహర్షి

Tags:    
Advertisement

Similar News