మౌస్ కదిపితే...ఓ కుదుపు!
ఈ ప్రపంచంలో మనకు నచ్చని విషయాలు చాలా ఉంటాయి. కానీ వాటిని గురించి మన మనోభావాలను ఎవరితో పంచుకోవాలి, ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎవరిని అందుకు బాధ్యులను చేయాలి.. అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం ఉండదు. అందుకే మాట్లాడాలని ఉన్నా, చాలాసార్లు మౌనంగా ఉండిపోతాం. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. ఓ సాధారణ పౌరుడు ఏ అంశంమీదైనా మాట్లాడవచ్చు…తన మనోభావాలను వ్యక్తం చేయవచ్చు…. ఎవరినైనా ప్రశ్నించవచ్చు, నిలదీయవచ్చు. ఇవన్నీ ఆన్‌లైన్ పిటీషన్ ద్వారా అనాయాసంగా చేసేయవచ్చు. ఇంట్లోంచి కాలు కదపకుండా…కేవలం చేతిలో ఉన్న మౌస్ ని […]
ఈ ప్రపంచంలో మనకు నచ్చని విషయాలు చాలా ఉంటాయి. కానీ వాటిని గురించి మన మనోభావాలను ఎవరితో పంచుకోవాలి, ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎవరిని అందుకు బాధ్యులను చేయాలి.. అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం ఉండదు. అందుకే మాట్లాడాలని ఉన్నా, చాలాసార్లు మౌనంగా ఉండిపోతాం. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. ఓ సాధారణ పౌరుడు ఏ అంశంమీదైనా మాట్లాడవచ్చు…తన మనోభావాలను వ్యక్తం చేయవచ్చు…. ఎవరినైనా ప్రశ్నించవచ్చు, నిలదీయవచ్చు. ఇవన్నీ ఆన్‌లైన్ పిటీషన్ ద్వారా అనాయాసంగా చేసేయవచ్చు. ఇంట్లోంచి కాలు కదపకుండా…కేవలం చేతిలో ఉన్న మౌస్ ని కదుపుతూ చేసే ఈ సోషల్ మీడియా ప్రచారం ఇప్పుడు దేశవ్యాప్తంగా బాగా ఊపందుకుంది.
ఛేంజ్ డాట్ ఆర్గ్, ఝాట్కా డాట్ ఆర్గ్, ఆవాజ్ డాట్ ఆర్గ్, బిట్‌గివింగ్ డాట్ కామ్…ఇవన్నీ ఇప్పుడు సమాజాన్ని అత్యంత ప్రభావితం చేస్తూ, పిటీషన్ వెబ్‌సైట్స్‌గా పనిచేస్తున్నాయి. ఈ వెబ్‌సైట్లలో ప్రపంచంలో మనకు నచ్చని ఏ విషయం గురించైనా మాట్లాడవచ్చు. మనలాంటి భావాలున్నవారి సపోర్టుని కూడగట్టుకోవచ్చు. అయితే మౌస్‌తో మార్పుని సాధించేయగలమా… అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నవారూ ఉన్నారు. కానీ మన గొంతు ప్రపంచానికి తెలుస్తుంది. మన అభిప్రాయానికి మద్ధతు పెరుగుతున్న కొద్దీ ఒక పరోక్ష పోరాటం జరుగుతున్నట్టేనని ఇందులో తమ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నవారు చెబుతున్నారు. అంటే సిటిజన్లే నెటిజన్లయి సమస్యలపై పోరాటం చేస్తున్న ఆధునిక ప్రక్రియ ఇది.
ఈ ఆన్‌లైన్ యాక్టివిజమ్ ఫోరమ్స్‌లో వ్యక్తుల అభిప్రాయాలకు సామూహిక బలం సమకూరుతోంది. ఈ వేదికలను తక్కువగా అంచనా వేయలేమని బెంగళూరు నుండి పనిచేస్తున్న ఇంటర్‌నెట్ అండ్ సొసైటీ సెంటర్ అనే స్వచ్ఛంద సంస్థకు పాలసీ డైరక్టర్‌గా ఉన్న ప్రణేశ్ ప్రకాష్ అంటున్నారు. ఈ వెబ్‌సైట్ల ద్వారా వ్యక్తమయ్యే సామూహిక స్పందన, ప్రజల అభిప్రాయాల పైనా, ప్రభుత్వ పాలసీలపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఇందుకు ఒక ఉదాహరణని చూపుతున్నారు.
ఆన్‌లైన్లో పిటీషన్ మీద సంతకం చేయడం అంటే బయటకు వచ్చి తమ నిరసనని తెలిపినట్టేనని దానికీ దీనికీ తేడా లేదని కవితా మురళీధరన్ అంటున్నారు. ఆన్‌లైన్ పిటీషన్లు, ప్రచారాలు ప్రజలను, ప్రభుత్వాలను కదిలిస్తున్నాయి అనేందుకు మరొక ఉదాహరణ, బిట్‌గివింగ్ వెబ్‌సైట్లో భారతదేశపు ఐస్ హాకీ టీమ్‌కి సహాయంగా నిలబడండి…అంటూ ఒక ఆన్‌లైన్ ప్రచారం జరిగింది. ఆసియా ఐస్ హాకీ ఛాంపియన్ షిప్ కప్ పోటీలకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం లేకపోవడంతో స్పందించిన నెటిజన్లు ఈ ప్రచారం చేశారు. దీని ద్వారా ఆ క్రీడాకారులకు కావాలసిన దానికన్నా ఎక్కువ నిధులు సమకూరాయి.
ఇంకా ఈ సోషల్ మీడియా ప్రచారంతో ఎక్కువ మందిని ప్రభావితం చేసిన అంశాల్లో….బెంగళూరు పరిశుభ్రత, కేరళలో వీధికుక్కల సంరక్షణ, ఖాన్స్ ఫర్ కిసాన్స్ పేరుతో షారుఖ్, అమీర్, సల్మాన్ ఖాన్లను రైతుల ఆత్మహత్యలపై స్పందించమంటూ ప్రజాపిలుపు, నేతాజీ ఫైల్స్ వెల్లడి డిమాండ్, బీఫ్ బ్యాన్‌పై నిరసన తదితరాలు ఉన్నాయి. అయితే ఇదంతా మాటలకే పరిమితమయ్యే రాజకీయ నాయకుల వైఖరిలా మారుతోందా…అనే ప్రశ్నకు ప్రణేశ్ ప్రకాష్ సమాధానం ఇస్తూ, ఒక సమస్యపై ఎంతమంది స్పందిస్తున్నారు అనేది ముఖ్యమైన విషయమని, కొన్నిసార్లు ఇలా హెచ్చు స్పందన ఉన్న అంశాలపై ప్రజలు ఒక సంఘంగా ఏర్పడి ప్రత్యక్ష్యంగా పనులు చేస్తున్నారని, రోడ్ల మరమ్మతులు, నదుల ప్రక్షాళన లాంటి పనులు అలా జరుగుతున్నాయని అన్నారు.
ఝాట్కా ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ దీపాగుప్తా ఈ ప్రచారాన్ని ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ గళాన్ని వినిపించడంగా అభివర్ణించారు. ఎన్నికలు తప్ప సాధారణ పౌరుడికి దేశం విషయంలో తన అభిప్రాయాలను వ్యక్తీకరించే అవకాశం లేని పరిస్థితుల్లో ఇది ఒక బలమైన వేదికగా ఆమె పేర్కొన్నారు. అంతేకాదు, అందరికీ సమస్యలపై, విషయాలపై అవగాహన, మాట్లాడగల నైపుణ్యం ఉండకపోవచ్చు. బయటకు వచ్చి ఉద్యమించే శక్తిసామర్థ్యాలు లేకపోవచ్చు. అలాంటివారు తమ మనోభావాలను, ఆశయాలను అణచివేసుకోకుండా తాము మార్పుని కోరుతున్నామంటూ తమ గొంతుని వినిపించేందుకు ఇదొక మంచి అవకాశమని దీపా గుప్తా అన్నారు. తమకి నచ్చని విషయాలపై స్పందించే అవకాశం లేనపుడు నిస్సహాయంగా అనిపిస్తుందని, సోషల్ వెబ్‌సైట్ ప్రచారం ఆ నిస్సహాయత ఫీలింగ్‌ని దూరం చేస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ విధానం వలన మార్పు వస్తుందనేవారితోపాటు దీని వలన ప్రయోజనం ఏముంది ఉట్టి మాటలేగా అనేవారూ ఉన్నారు. కాకపోతే అన్యాయాలు, అక్రమాలు, తప్పులు, బాధ్యతారాహిత్యాలు, ప్రభుత్వ నిర్లక్ష్యాలు లాంటివాటిపై ఓ సాధారణ పౌరుడు వేలెత్తి చూపించగల అవకాశంగా, ఎంతటివారినైనా ధైర్యంగా ప్రశ్నించగల ఒక విశాలమైన వేదికగా ఇది ఎంతో శక్తిమంతమైనదనే చెప్పాలి.