రంగుల నిజాలు!
రంగులు…ప్రపంచంలో రంగులు అనేవే లేకపోతే… అసలు ఊహించలేము కదా! రంగులు మనకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, ఆహ్లాదాన్నిఇస్తాయి. మన జీవితమే ఒక వర్ణచిత్రం. అనుక్షణం పలురకాల రంగులు మనల్ని పలకరిస్తుంటాయి, మనతో ప్రయాణం చేస్తుంటాయి. నీరు, గాలి, భూమి, ఆకాశాల్లా రంగులు సైతం ప్రపంచం మొత్తానికీ ఒక్కటే. అలాంటి రంగుల గురించి కొన్ని కలర్‌ఫుల్ నిజాలు- -ప్రపంచంలో ఎక్కువమంది ఇష్టపడే రంగు నీలం. ఈ విషయం పలు అంతర్జాతీయఅధ్యయనాల్లో రుజువైంది. గ్లోబల్ మా ర్కెట్ కంపెనీలు సైతం ఇదే చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బ్లూని […]
-ప్రపంచంలో ఎక్కువమంది ఇష్టపడే రంగు నీలం. ఈ విషయం పలు అంతర్జాతీయఅధ్యయనాల్లో రుజువైంది. గ్లోబల్ మా ర్కెట్ కంపెనీలు సైతం ఇదే చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బ్లూని 40శాతం మంది ఇష్టపడుతున్నారు. దీని తరువాత స్థానంలో పర్‌పుల్ ఉంది. దీన్ని 14శాతంమంది ఇష్టపడుతున్నారు. ఎరుపు, ఆకుపచ్చకూడా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయని కొంతమంది పరిశోధకులు అంటున్నారు. అభిమాన రంగులుగా ఆఖరిస్థానాల్లో ఉన్నవి తెలుపు, ఆరంజ్, పసుపు.
-పిల్లలు మొట్టమొదట గుర్తించే రంగు ఎరుపు. రెండువారాల వయసు నుండి పిల్లలు ఎరుపుని గుర్తిస్తారు.
-పురుషుల కంటే మహిళలు ఎరుపు రంగు షేడ్‌లను ఎక్కువగా గుర్తించగలుగుతారు. ఎందుకంటే ఈ రంగుని గుర్తించే జీన్ ఎక్స్ క్రోమోజోమ్‌లో ఉంది. మహిళల్లో ఎక్స్ క్రోమోజోములు రెండు ఉంటే పురుషుల్లో ఒక్కటే ఉంటుందన్న సంగతి మనకు తెలుసు. ఎరుపు ఒక్కటే కాదు, రంగుల మధ్య అతి చిన్న తేడాని సైతం మహిళలే ఎక్కువగా గుర్తిస్తారు. మగవారు వస్తువుల కదలికలను నిశితంగా గమనించగలుగుతారట.
-పింక్ రంగుకి కోపాన్ని, ఆందోళనని తగ్గించే శక్తి ఉంది. అందుకే ఖైదీలు ఉండే జైళ్లకు, మానసిక రోగులు ఉండే చికిత్సా కేంద్రాలకు ఈ రంగుని వేస్తారు.
-కార్లకు సురక్షితమైన రంగు తెలుపు. మంచులో తప్ప మిగిలిన ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా స్పష్టంగా కనిపించే రంగు తెలుపు అని అధ్యయనాలు చెబుతున్నాయి. నిజానికి నిమ్మ పసుపు రంగు రోడ్డుమీద మరింత ఎక్కువగా కనిపించే రంగు అయితే ఈ రంగులో కార్లు తక్కువ కనుక తెలుపుకే ఈ ప్రాధాన్యత దక్కింది. తెలుపు తరువాత సిల్వర్, కార్లకు తగిన రంగు.
-ఎరుపు, పసుపు ఈ రెండు రంగులు ఆకలిని పెంచుతాయి. అందుకే కెఎఫ్‌సి, మెక్‌డొనాల్డ్స్ లాంటి ఆహార తయారీ సంస్థలు ఈ రంగులను ఎక్కువగా వాడుతుంటాయి. ఆకలిని కలిగించే రంగుల్లో చివర ఉన్నది నీలం.
-రంగులంటే భయపడడాన్ని క్రోమోఫోబియా అంటారు. గత జీవితంలోని బాధాకరమైన అనుభవాలతో మిళితమై ఉన్న రంగుల పట్ల కొందరికి ఈ ఫోబియా ఉంటుంది.
-పూర్వం నీలం రంగుని అన్ని సందర్భాల్లో అన్ని రకాల పెయింట్స్‌కి వాడకూడదనే చట్టాలు ఉండేవి. మేరీమాత, ఏసుక్రీస్తు చిత్రాలు, శిల్పాలకు మాత్రమే నీలం వాడే అవకాశం ఉండేది.
-లేత రంగుల వస్తువులు మనకు దగ్గరగా ఉన్నట్టుగా, ముదురు రంగులు మనకు దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది.
-కోళ్లకు ఎరుపు రంగు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎరుపు రంగు లైట్లలో కోళ్లు మరింత ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉంటాయి.
-రంగులు మన రుచి అనుభూతిని మార్చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. క్రీమ్, ఆరంజ్ కప్పుల్లో ఐస్‌క్రీమ్ తింటే మిగిలిన రంగుల కప్పుల్లో కంటే రుచికరంగా అనిపిస్తుంది.
-ఆరంజ్ రంగుని బట్టి పండుకి ఆ పేరు వచ్చిందా, ఆరంజ్ పండు ఆ రంగులో ఉండటం వల్లనే ఆ రంగుకి పండు పేరు వచ్చిందా అనే ప్రశ్న గుడ్డుముందా, పిల్లముందా… లాంటిది. 13వ శతాబ్దంలోనే ఆరంజ్ అంటే ఒక పండు… అనే అర్థం ఆంగ్ల భాషలో ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆరంజ్ రంగుని తొలుత జిలాహ్రెడ్ అనే వాళ్లు. అంటే ఎల్లో రెడ్ అని అర్థం. అంటే పండు ఆరంగులో ఉండడం వల్ల తరువాత కాలంలో ఆ షేడ్‌ని పండుపేరుతో పిలుస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.
-దోమలకు ముదురురంగులంటే ఇష్టం. దోమలు కుట్టకూడదంటే లేతరంగు దుస్తులను ధరించాల్సిందే మరి. గుర్తుంచుకోండి దోమలకు నీలం రంగంటే మరింత ఇష్టం.
-ఎద్దులు ఎరుపు రంగుని చూస్తే వెంబడిస్తాయి అనేది ఒక అపోహ మాత్రమేనని పరిశోధకులు తేల్చారు. వాటికి రంగుల పట్ల అలాంటి ప్రత్యేక స్పృహ అంటూ ఏమీ ఉండదు. కేవలం తమ ముందున్న వస్తువులు, లేదా ప్రాణుల్లోని కదలికల వలన మాత్రమే అవి అలా స్పందిస్తాయట.
-పసుపు రంగు ఎక్కువగా చూస్తే తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే దీన్ని విమానాల్లో ఎక్కువగా వాడరు. కళ్లకు కూడా ఇది చాలా ఇరిటేషన్ కలిగిస్తుంది.
-వి.దుర్గాంబ
–