ప్లెజర్ వర్సెస్ ప్రెషర్!
ఒక తండ్రికి అతను ఆఫీస్‌లో ఉండగా ఒక ఫోన్‌కాల్ వచ్చింది. మీ అబ్బాయి రెండురోజుల నుండి కాలేజికి రావడం లేదని. ఇంట్లో అతను కాలేజికనే చెప్పి వెళుతున్నాడు. ఆరా తీస్తే తన స్నేహితుని తల్లిదండ్రులు ఊరు వెళ్లడంతో నలుగురు పిల్లలు కలిసి ఆ ఇంట్లో కబుర్లు, ఇంటర్‌నెట్‌లతో ఎంజాయి చేస్తున్నారు. ఆ తండ్రికి కొడుకుమీద పట్టరానంత కోపం వచ్చింది. ఇంటికి వచ్చాడు. కొడుకుని కొట్టాడు, భార్యని తిట్టాడు. ఇల్లంతా యుద్ద రంగంగా మారిపోయింది. భార్యాభర్తలు ఇద్దరూ తప్పు నీదంటే నీదని వాదించుకున్నారు. ఎందుకు చేశావిలా అని […]
ఒక తండ్రికి అతను ఆఫీస్‌లో ఉండగా ఒక ఫోన్‌కాల్ వచ్చింది. మీ అబ్బాయి రెండురోజుల నుండి కాలేజికి రావడం లేదని. ఇంట్లో అతను కాలేజికనే చెప్పి వెళుతున్నాడు. ఆరా తీస్తే తన స్నేహితుని తల్లిదండ్రులు ఊరు వెళ్లడంతో నలుగురు పిల్లలు కలిసి ఆ ఇంట్లో కబుర్లు, ఇంటర్‌నెట్‌లతో ఎంజాయి చేస్తున్నారు. ఆ తండ్రికి కొడుకుమీద పట్టరానంత కోపం వచ్చింది. ఇంటికి వచ్చాడు. కొడుకుని కొట్టాడు, భార్యని తిట్టాడు. ఇల్లంతా యుద్ద రంగంగా మారిపోయింది. భార్యాభర్తలు ఇద్దరూ తప్పు నీదంటే నీదని వాదించుకున్నారు. ఎందుకు చేశావిలా అని ఎంత సేపు అడిగినా కుర్రాడు నోరు విప్పలేదు. తల ఎగరేసి అలాగే నిలబడ్డాడు.
ఇంట్లో ఇలాంటి వాతావరణం సృష్టించుకోవడం వలన, వచ్చిన సమస్య తీరదన్న సంగతి కోపంలో ఉన్న తండ్రికి గుర్తురాలేదు. ఆ ముగ్గురి మధ్య అడ్డుగోడలు పెరిగి సమస్య మరింత జటిలంగా మారింది తప్ప, ఇక ఈ తప్పు ఎప్పుడూ చేయకూడదు అనే మార్పు కొడుకులో రాలేదు. భర్త ఆవేదనలో అర్థం ఉందనే విషయం భార్యకు అర్థం కాలేదు. తాను కుటుంబం కోసం ఇంత కష్టపడుతుంటే భార్యా, కొడుకు తన మాట వినడం లేదనే బాధ, కోపం కుటుంబ యజమానిలో అలాగే మిగిలిపోయాయి. ఎమోషనల్‌గా కాదు…నిర్మాణాత్మకంగా..
ఇలాంటి సందర్భాల్లో కావలసింది నిర్మాణాత్మక ఆలోచనలు. మనకు నచ్చనిది జరిగినపుడు కోపం, ఆవేశం, ఏడుపు, దుఃఖం, విరక్తి, నిరాశ…ఇవన్నీ తన్నుకొస్తాయి. ముందు అవే వస్తాయి. తరువాత ఆ భావాలకు అనుగుణమైన ఆలోచనలు వస్తాయి. నిజానికి కొడుకు అలా చేసినపుడు… కాలేజి ఎగ్గొట్టి అలాంటి పనిచేయాలని నీకెందుకు అనిపించింది నాన్నా… అని అడగాలని ఏ తండ్రికీ అనిపించదు. అలా ఎవరైనా అడిగినా, అది మనలో చాలామందికి అసహజంగా కనబడుతుంది. కోపంగా, పెద్దగా అరవడమే ఆ సంఘటనలో సరైన ప్రతిస్పందన అనుకుంటాం. కానీ కోపంతో రెచ్చిపోతే ఎలాంటి ప్రయోజనం కనబడనప్పుడైనా సరైన విధానం ఇంకా ఏదో ఉందని మనం ఆలోచించాలి. మనకు నచ్చని సంఘటనకు మన స్పందన ముఖ్యమా, లేదా దాన్ని సరిదిద్దడం ముఖ్యమా… ఇది వేసుకోవాల్సిన ప్రశ్న.
ఎలా డీల్ చేస్తున్నాం అనేది ముఖ్యం. పిల్లల్లో మనకు నచ్చని మార్పు అనుకోకుండా ఒక రోజు మన కళ్లముందుకు వస్తుంది. కానీ దాని మూలం కొన్ని సంవత్సరాల క్రితమే వాళ్లలో మొదలై ఉంటుంది. చదువు, కాలం, స్నేహం, విలువలు, టైంపాస్, జీవితంలో పైకిరావడం, ఎంజాయిమెంట్…తల్లిదండ్రుల ప్రేమ….వీటన్నింటి పట్ల వారిలో ఎలాంటి అభిప్రాయాలు పెరుగుతున్నాయో, వారు పెద్దయి ఇలా ఏదోఒకరోజు మనముందు…నేనిలానే ఉంటా…ఏం చేసుకుంటావో చేసుకో….అని రాయిలా నిలబడేంత వరకు మనకు అర్థం కాదు.
ఇలాంటపుడే ఒక వర్గం తల్లిదండ్రులు, పిల్లలను పిల్లల్లాగే పెంచాలని, క్రమశిక్షణ చాలాముఖ్యమని అంటారు. మరొక వర్గం ఇందుకు పూర్తి వ్యతిరేకంగా పిల్లలకు స్నేహంగా చెప్పుకోవాలి తప్ప, కన్నాం కదా అని వారిమీద అజమాయిషి చేద్దాం అనుకోకూడదు అంటారు. ఎలా పెంచినా పిల్లల పెంపకంలో ఎన్నో కొన్ని సమస్యలు ఎదుర్కోని వారంటూ ఉండరు. అయితే ఈ సమస్యని మనం రెండురకాలుగా విడగొట్టుకుని చూడాలి. పిల్లలెందుకు అలా మారారు అనేది అర్థం చేసుకోవడం ఒకటయితే, వారిని మనం సరిగ్గానే డీల్ చేస్తున్నామా…వారి పట్ల మన ప్రవర్తన సరిగ్గానే ఉందా లేదా అనేది మరొక సమస్య. ఈ రెండింటినీ ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పోవడం చాలా అవసరం.
ప్రేమని ఇచ్చి… బదులు ఆశించవద్దు! పిల్లలకు అన్నీ ఇచ్చాం… వాళ్లు మేము చెప్పినట్టు ఎందుకు వినరు…అనేది అమ్మానాన్నల వాదన. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. తల్లిదండ్రుల నుండి ప్రేమని పొందడం పిల్లల హక్కు. అది వారికి బాగా తెలుసు. అందుకే వారు అదంతా తమ హక్కు అనుకుంటారు తప్ప, అందుకు ప్రతిఫలంగా తాము తల్లిదండ్రులు చెప్పినట్టు వినాల్సి ఉంటుందనుకోరు. ఆ ఆలోచన రాదు. రాకూడదు కూడా. ఇలాంటి బిజినెస్ లావాదేవీల్లాంటి వాటి వల్ల వ్యాపారంలో లాభాలు వస్తాయేమో కానీ, జీవితంలో ఇవి ఏ మాత్రం వర్కవుట్ కావు. ఇలాంటి సందర్భాల్లోనే పిల్లలు మేం కనమన్నామా…అంటూ నిష్కర్షగా, నిర్లక్ష్యంగా మాట్లాడతారు.
ఎప్పుడూ ప్లెజర్ కావాలనుకోవడమే… పిల్లలు, అమ్మానాన్నలు చెప్పినదానికి వ్యతిరేకంగా వెళ్లడానికి కారణాలు చాలా ఉంటాయి…సునిశితంగా విశ్లేషిస్తే మనిషికో కారణం ఉంటుంది. కానీ జనరల్‌గా, ఇప్పుడున్న పరిస్థితుల్లో కనబడుతున్న పెద్ద కారణం మాత్రం, పిల్లలు అనుక్షణం ప్లెజర్ ని ఆశించడం. ఎలాగొలా సంతోషంగా, ఆనందంగా ఎంజాయి చేస్తూ గడిపేయాలి అనుకుంటున్నారు. వారిని ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచాలి…అనే తల్లిదండ్రుల తపనలోంచి వచ్చిన లక్షణమే అది. ప్లెజర్ ఇచ్చే అంశాలు తమ చుట్టూ ఎక్కువగా ఉండటం, చదువుల విధానంలో లోపాలు కూడా కారణాలే. వారికోసం సమయం కేటాయించి…సినిమాలు, ఇంటర్‌నెట్, ఫేస్‌బుక్‌లో ఛాటింగ్, జంక్‌ఫుడ్, స్మార్ట్ ఫోన్లు, ఫ్యాషన్లు…ఇవన్నీ కాకుండా, ఇంకెందులో ఆనందం ఉందో చెప్పగల శక్తి, ఆసక్తి తల్లిదండ్రులు, గురువులకు లేకపోవడం మరొక కారణం.
ఆనందో బ్రహ్మ…వారూ అదే అంటున్నారు పిల్లలు మనం ఆశించినతీరులో ఉండాలి…అనే వెర్షన్ మార్చి…మనకోసం కాదు, వారి భవిష్యత్తుకోసం, వారి జీవితంకోసం, వారి ఆనందం కోసమే వారు మారాలి…అనే దృక్పథంతో తల్లిదండ్రుల ఆలోచనలు ఉంటే, వాటిని పిల్లలకు అలాగే కన్వే చేస్తే వారిలో మార్పు వస్తుంది. పిల్లలను ప్లెజర్ మోటివేట్ చేసినంతగా తల్లితండ్రులు పెట్టే ప్రెషర్ మోటివేట్ చేయదు. ఎప్పుడూ ఆనందం కావాలనుకోవడం వల్లనే బద్దకం, క్రమశిక్షణా రాహిత్యం, పట్టుదల లేకపోవడం, వాయిదా మనస్తత్వం…ఇవన్నీ పెరిగిపోయి పిల్లలకు చదువుమీద ధ్యాస లేకుండా చేస్తున్నాయి. పెద్దవాళ్లు సంపాదన వెతుక్కుంటూ పోతుంటే, పిల్లలు ఆనందాన్ని వెతుక్కుంటూ పోతున్నారు.
ఆధ్యాత్మికమార్గంలో మోక్షం పొందాలనుకునేవాడి నుండి వీడియో గేమ్ ఆడుకునే ఆరేళ్ల పిల్లాడి వరకు అందరికీ కావాల్సింది ఆనందమే. ఒక మంచి పనిచేస్తే, ఒక బొమ్మ గీస్తే, ఏదన్నా సాధిస్తే, ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటే, ఎవరికైనా చిన్నసాయం చేస్తే… ఓ మంచి కళాభిరుచి పెంచుకుంటే, ఒక గెలుపు సాధిస్తే… ఇలాంటి పద్ధతుల్లో వచ్చే ఆనందం, స్నేహితులతో కబుర్లు చెప్పుకోవడంలో, కాలేజిమానేసి టైమ్‌ని కిల్ చేయడంలో రాదని పిల్లలకు చిన్నప్పటినుండే అర్థమయ్యేలా చెప్పలేకపోతే, వారు ఆనందంకోసం జీవితానికి ఏమాత్రం పనికిరాని మార్గాలను ఎంచుకుంటారు. వారి వ్యక్తిత్వాన్ని పెంచకుండా వ్యక్తిగా ఎదగమని మనం పిల్లలకు చెప్పలేము….
– వడ్లమూడి దుర్గాంబ