ఆ రైలు.... భౌ భౌ అంటుంది!
ప్రతి కుక్కకీ ఓ రోజొస్తుంది అనేమాటని 80ఏళ్ల యూజిన్ బోస్టిక్ నిజం చేశారు. టెక్సాస్ లోని ఫోర్ట్ వర్త్ కి చెందిన ఈ పెద్దమనిషి వీధి కుక్కలకోసం ఓ చిన్న రైలు తయారుచేశారు. కుక్కలను ప్రేమగా పెంచుకునేవారు వాటిని తమ వాహనాల్లో ఎక్కించుకుని తీసుకువెళ్లడం మామూలు విషయమే కానీ, ఇలా కుక్కల కోసమే రైలు తయారుచేసిన మొదటి వ్యక్తి బోస్టికే అయివుంటారు. ఎనిమిది బోగీలున్న ఈ బుల్లి రైల్లో కుక్కలను కూర్చోబెట్టుకుని సాయంత్రాలు షికారుకి వెళుతుంటారాయన. పదిహేనేళ్ల […]
పదిహేనేళ్ల క్రితం రిటైర్ అయిన బోస్టిక్ తన శేష జీవితంలో ఏదైనా మంచిపని చేయాలనుకున్నారు. దాంతో వీధి కుక్కలను చేరదీసి పెంచి పోషించడం మొదలుపెట్టారు. వీరి ఇల్లు వీధి చివరలో ఉండటం, వీరికో గుర్రపు శాల ఉండటంతో తమ కుక్కలను వదిలించుకోవాలనుకునేవారు అక్కడకు తెచ్చి వదిలేసి వెళుతుండేవారు. ఆ కుక్కలను పెంచి పోషించడం బోస్టిక్‌కి ఆయన సోదరునికి ఓ అలవాటుగా మారింది. కుక్కలు తిరిగేందుకు వారి ఇంటిచుట్టూ విశాలమైన ప్రదేశం ఉంది. అయినా వాటిని బయటకు తీసుకువెళితే బాగుంటుంది కదా… అనిపించేది బోస్టిక్‌కి. ఆ ఆలోచనే చివరికి ఈ బుల్లి రైలుని రూపొందించేలా చేసింది.
ఒక రోజు ఒక ట్రాక్టరు నడుపుతున్న వ్యక్తి దానికి చిన్న బండి ఆకారంలో ఉన్న డబ్బాలను ఎటాచ్ చేసి వాటిపై రాళ్లను తరలించడం బోస్టిక్ చూశారు. దాంతో కుక్కలకోసం ఓ రైలుని తయారుచేయాలనే ఆలోచన వచ్చిందాయనకు. ప్లాస్టిక్ డ్రమ్ములను తీసుకుని వాటిలో కుక్కలు కూర్చునేందుకు వీలుగా పెద్ద రంధ్రాలు చేశారు. తనకు వెల్డింగ్ పని తెలిసి ఉండడంతో వాటికింద చక్రాలు అమర్చి, ఒకదానికొకటి కనెక్ట్ చేశారు. వాటిని ట్రాక్టర్‌కి అనుసంధానం చేయడంతో చక్కని బుల్లి రైలు తయారైంది. ఇంకేముందీ, ఒక్కో డ్రమ్ము బోగీలో ఒక్కో కుక్కని ఎక్కించుకుని ఎంచక్కా ఊరంతా షికారు చేయడం మొదలుపెట్టారు బోస్టిక్.
ప్రస్తుతం తన దగ్గర ఉన్న తొమ్మిది కుక్కలను రైల్లో ఎక్కించుకుని వారానికి మూడునాలుగుసార్లయినా బయటకు షికారుకి వెళుతుంటారు. ఊరంతా తిరిగి వస్తుంటారు. కుక్కలు ఈ ట్రిప్‌లను చాలాబాగా ఎంజాయ్ చేస్తున్నాయి. ట్రాక్టర్ కి బోగీలను అనుసంధానం చేయడం చూశాయంటే చాలు వాటి ఉత్సాహం చెప్పనలవి కాదంటారు బోస్టిక్. పరిగెత్తుకుని వచ్చి దేని బోగీలో అది కూర్చుని షికారుకి రెడీ అయిపోతాయని, వాటి ఆనందం తనలో అంతులేని సంతృప్తిని నింపు తోందని చెబుతున్నారు ఈ పెద్దమనసున్న మనిషి.