ఇది బాడీ షేపింగ్ కాదు...షేమింగ్ !
కొన్ని విషయాలను ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగించాలన్నదానిపై అస్సలు క్లారిటీ ఉండదు. అలాంటి వాటిపై ఎవరేం చెప్పినా అది ఆయా వ్యక్తుల అభిప్రాయాలుగా మాత్రమే మిగులుతాయి. శారీరక అందం పట్ల మనకున్న స్పృహ కూడా అలాంటిదే. మనం మనుషులం కూరగాయలం కాదు…అని చాలా సందర్భాల్లో చెప్పుకుంటూనే కొన్ని విషయాల్లో చాలా అసందర్భంగా ప్రవర్తిస్తుంటాం. మంచాలు, కుర్చీలు, తలుపులు, కిటికీలు తదితరాల నిర్మాణంలో కొలతలను ఉపయోగించినట్టుగా మనుషుల అందాన్ని, ముఖ్యంగా స్త్రీల అందాన్ని కొలతలతో అంచనా వేస్తున్నాం. ఈ సృష్టిలో ప్రతి మనిషీ ప్రత్యేకం. ఒకరిలా […]
కొన్ని విషయాలను ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగించాలన్నదానిపై అస్సలు క్లారిటీ ఉండదు. అలాంటి వాటిపై ఎవరేం చెప్పినా అది ఆయా వ్యక్తుల అభిప్రాయాలుగా మాత్రమే మిగులుతాయి. శారీరక అందం పట్ల మనకున్న స్పృహ కూడా అలాంటిదే. మనం మనుషులం కూరగాయలం కాదు…అని చాలా సందర్భాల్లో చెప్పుకుంటూనే కొన్ని విషయాల్లో చాలా అసందర్భంగా ప్రవర్తిస్తుంటాం. మంచాలు, కుర్చీలు, తలుపులు, కిటికీలు తదితరాల నిర్మాణంలో కొలతలను ఉపయోగించినట్టుగా మనుషుల అందాన్ని, ముఖ్యంగా స్త్రీల అందాన్ని కొలతలతో అంచనా వేస్తున్నాం.
ఈ సృష్టిలో ప్రతి మనిషీ ప్రత్యేకం. ఒకరిలా ఒకరు ఉండరు, ఉండాల్సిన అవసరం లేదన్న చిన్నపాటి జ్ఞానాన్ని పక్కనపెట్టి….అమ్మాయిలంతా ఈ మధ్యకాలంలో… అవే కళ్లు…అవే పెదవులు, అవే నడుములు, అవే నవ్వులు…అవే కురులు, అవే దుస్తులు అన్నట్టుగా అందరూ మూసపోసినట్టుగా ఒకేలా కనబడుతున్నారు. సినిమాలు, ప్రకటనలు, మీడియా, సోషల్ మీడియా…ముఖ్యంగా ఇబ్బడి ముబ్బడిగా వచ్చిపడుతున్న సరికొత్త ఫ్యాషన్లు…ఇవే మనుషుల ఐడెంటిటికి ఇప్పుడు ఆధారం. అంటే మనమంతా ఇప్పుడు మార్కెట్ సృష్టిస్తున్న మనుషులన్నమాట.
ఈ మధ్య ఒక సందర్భంలో ఇదే విషయాన్ని చెబుతూ నటి లిసారే ఇది బాడీ షేపింగ్ కాదు…షేమింగ్ అని వ్యాఖ్యానించారు. ఈ అవాస్తవిక దృక్పథాలకు తెరదించాల్సిన అవసరం ఉందని ముఖ్యంగా మీడియా ఆ పనిచేయాలని ఆమె అన్నారు. ఇలా ఉండాలి, అలా ఉండాలి…అని చూపించే ఫొటో షాపింగ్ వ్యవస్థ మితిమీరిపోయిందని, మనందరికీ అందంగా ఉండటం ఇష్టమే అయినా…దాని వెనుక ఉన్న వాస్తవాలను అంగీకరించాలి…అన్నారామె. క్యాన్సర్ వచ్చి కోలుకున్న ఈ నలభై మూడేళ్ల ఆంగ్ల, బాలివుడ్ చిత్రాల నటి, మోడల్… తానిప్పుడు తన శరీర ఆకారం పట్ల సంతృప్తిగానే ఉన్నా, ఇంకా బాడీ షేపింగ్…అనే ఒత్తిడిని ఎదుర్కొంటున్నానన్నారు.
సినిమా సినిమాకి మరింత స్లిమ్‌గా కనిపిస్తున్న తారలు ఈ విషయంలో ఎంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నారో మనకు అర్థమవుతుంది. చాలాసార్లు ఇంటర్వ్యూల్లో వారు… ఈ సినిమాలో మరింత అందంగా కనబడతాను…మరింతగా ప్రేక్షకులను అలరిస్తాను… అని చెబుతుంటారు. సాటి తారలతో పోటీని ఎదుర్కోవడానికి చేసే కసరత్తులో అదీ ఒక భాగం వారికి. కానీ అలాంటి శరీర ఆకారం తమకూ తప్పనిసరి అని సాధారణ అమ్మాయిలు, సగటు మహిళలు భావించాల్సిన పనిలేదు. ఏ సిఎ నో, మెడిసినో చదువుతున్న అమ్మాయి…ఆరోగ్యం కోసం ప్రతిరోజూ ఓ అరగంట వ్యాయామం చేస్తే మంచిదే…కానీ తన నడుము కొలత తగ్గించుకోవాలనే విషయంమీద దృష్టి పెట్టి వ్యాయామం చేస్తే అది ఎంత హాస్యాస్పదంగా అనిపిస్తుంది.
హుమా ఖురేషి అనే హిందీ తార ఈ విషయంపై స్పందిస్తూ తాను తెరమీద అందంగా కనిపించేందుకు అనుక్షణం ఒత్తిడిని ఎదుర్కొన్న సందర్భాలున్నాయని చెప్పింది. తారలే కాదు, శరీర కొలతల స్పృహతో సాధారణ అమ్మాయిలు సైతం అనవసరంగా ఈ బాధని అనుభవిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
మార్కెట్ మన భావాలను ఎలా శాసిస్తున్నదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. బ్యూటీ, బాడీ షేపింగ్ మార్కెట్ ప్రపంచంలో మనమంతా పావులై ఆడుతున్నట్టే లెక్క. దుస్తుల విషయమైతే చెప్పాల్సిన పనిలేదు. నిజానికి మన అవసరానికి బట్టలు ధరిస్తున్నామో, సదరు వ్యాపారస్తులకు లాభాలు తెచ్చిపెట్టేందుకు వారు మనల్నివినియోగించుకుంటున్నారో తెలియని పరిస్థితి. ఒక చిన్న ఉదాహరణ…పెద్ద వయసు వారు సైతం ధరించే విధంగా లంగాఓణీలు మార్కెట్లోకి వచ్చినపుడు వీటిని ఎంత విరివిగా టివిషోల్లో యాంకర్లు, పార్టిసిపెంట్లు వాడారో మనకు తెలుసు. ఇందులో ఉన్న తప్పొప్పుల గురించి కాదీ ప్రస్తావన. మార్కెట్ మనల్ని ఎలా ప్రభావితం చేస్తోందో చెప్పడానికే.
అలాంటిదే ఈ బాడీ షేపింగ్. ఆరోగ్యంగా, మనకి నచ్చినట్టుగా, మన శరీరానికి తగినట్టుగా ఉండటం మంచిదా లేదా సదరు సినిమాలు, ప్రకటనలు, మేగజైన్లు మీడియా చూపిస్తున్న షేప్‌లో ఉండటం ముఖ్యమా అనేది ఎవరికి వారు సమాధానం చెప్పుకోవాల్సిన ప్రశ్న.
మొత్తానికి బాడీ షేపింగ్ అనేది ఇప్పుడు ఒక పెద్ద అబ్సెషన్, ఒక వ్యామోహం, ఒక ఒత్తిడి, ఒక వ్యాపార సంస్కృతి…ఇలా చెప్పుకుంటూపోతే దీనికి అంతమే ఉండదు. కోట్లమందిని రంజిపచేయాల్సిన వృత్తిలో ఉండటం వలన సినిమా తారలు తమ శరీర సౌందర్యం పట్ల నిరంతర స్పృహని కలిగి ఉంటారు…ఇప్పుడు అదే స్పృహ సగటు స్త్రీ పురుషుల్లోనూ ఉంటోంది. అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం… ఈ మూడు మంచి విషయాలే అయినా వీటి మధ్య సన్నని గీతలున్నాయి. వాటిని చూడలేకపోవడం వలన ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.. అందంగా కనిపించలేకపోతే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఇంతకంటే మరో దౌర్భాగ్యం శరీర కొలతలే అందమని భావించడం. ఆరోగ్యంగానే ఉన్నా శరీరం మరింత అందంగా కనిపించాలనే వ్యామోహంతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నవారూ ఉంటున్నారు.
చివరగా ఒక మాట…. స్త్రీల అందం విషయంలో ఆల్చిప్పల్లాంటి కళ్లు, తామరతూడుల్లాంటి చేతులు, సన్నని నడుములు ఎప్పుడో కవులు సృష్టించారు. దేవతా మూర్తులకు సైతం ఆ కొలతలను ఆపాదించి కవిత్వాలు రాశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మాయిలకు తామరతూడులు కాదు…ఇనుపరాడ్డుల్లాంటి చేతులు కావాలి. సుకుమారం అనే పదాన్ని స్త్రీనుండి ఎంత విడదీయ గలిగితే అంతమంచిది. రాజులు, రాజ్యాలు పోయినా, కవులు కావ్యాలు రాయడం మానేసినా ఈ మహిళల శరీర కొలతల ప్రమాణం మాత్రం మారలేదు. మహిళని కేవలం లైంగిక దృక్పథంతో చూసిన ఈ భావజాలాన్ని సినిమాలు, ఫిట్‌నెస్ సెంటర్లు, ఫ్యాషన్లు, బ్యూటీ ఉత్పత్తులు లాంటివన్నీ, అన్నింటికీ మించి పురుషాధిపత్య సమాజం పెంచి పోషిస్తూనే ఉన్నాయి.
ఇదంతా ఆది, అంతం లేని విషవలయం. అందుకే పూర్తి మానసిక స్వేచ్ఛతో ఎవరికి నచ్చినట్టుగా వారు ఉండటం అవసరం. అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనేవి మార్కెట్ డిజైన్ చేసే దుస్తులు కాదు…ఎవరికి వారు సొంతంగా డిజైన్ చేసుకోవాల్సిన వ్యక్తిత్వంలో భాగాలు. ఇదితెలుసుకుంటే ఈ విషవలయాన్ని కొంతవరకు ఛేదించగలం.
-వడ్లమూడి దుర్గాంబ