నువ్వు నువ్వుగా ఉండు (Devotional)

ఒక సందర్భంలో ఒక వృద్ధబాలుడు నా దగ్గరకు వచ్చాడు.  ”నేను జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాను.  బుద్ధుడిగా మారాలనుకుంటున్నాను.  దయచేసి నాకు మార్గం చూపిస్తారా?” అని అడిగాడు.  అతనికి దాదాపు అరవై సంవత్సరాలుంటాయి. నేను అతన్ని ‘వృద్ధబాలుడు’ అన్నాను.  ఎందుకన్నానో తెలుసా? అతని మనసు ఎదగలేదు.  తను తనుగా కాకుండా ఇతరుల్లా మారాలని ఎవరనుకుంటారో వాళ్ళలో పరిణితి ఉండదు.  అందువల్ల వాళ్లు పసివాళ్లే.  అందుకనే అతను అరవయ్యేళ్ల వాడయినా అతన్ని బాలుడన్నాడు.  వయసు వృద్ధత్వాన్ని తెచ్చింది.  కానీ మనసు ఎదగలేదు.  […]

Advertisement
Update: 2015-09-20 13:01 GMT

ఒక సందర్భంలో ఒక వృద్ధబాలుడు నా దగ్గరకు వచ్చాడు. ”నేను జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాను. బుద్ధుడిగా మారాలనుకుంటున్నాను. దయచేసి నాకు మార్గం చూపిస్తారా?” అని అడిగాడు. అతనికి దాదాపు అరవై సంవత్సరాలుంటాయి. నేను అతన్ని ‘వృద్ధబాలుడు’ అన్నాను. ఎందుకన్నానో తెలుసా? అతని మనసు ఎదగలేదు. తను తనుగా కాకుండా ఇతరుల్లా మారాలని ఎవరనుకుంటారో వాళ్ళలో పరిణితి ఉండదు. అందువల్ల వాళ్లు పసివాళ్లే. అందుకనే అతను అరవయ్యేళ్ల వాడయినా అతన్ని బాలుడన్నాడు. వయసు వృద్ధత్వాన్ని తెచ్చింది. కానీ మనసు ఎదగలేదు. కనక ‘వృద్ధబాలుడ’న్నాను.

అతని మాటలు విని నేను ”మిత్రమా! ఎవరయితే ఇంకొకరిలా మారాలనుకుంటారో వాళ్లు తమ అసలయిన తత్త్వాన్ని పోగొట్టుకుంటారు. విత్తనంలో వృక్షం నిక్షిప్తమయి ఉన్నట్లే ప్రతి వ్యక్తిలో అతని తత్త్వం నిగూఢంగా ఉంటుంది. దానికి సహజమయిన ఎదుగుదల అవసరం. అట్లా కాకుండా ఇంకేదోగా మారాలనుకుంటే అది ఆత్మహత్యా సదృశం. మనది కాని తత్వాన్ని అనుసరిస్తే అనుకరిస్తే మన వ్యక్తిత్వం దెబ్బతింటుంది. అప్పుడు కృత్రిమత్వం అలవడుతుంది. అనుకరణంలో ఔన్నత్యం లేదు. స్వాభావికమయిన ఎదుగుదల ఉన్న వాళ్ళలోనే సత్యం వెలుగుతుంది. వాళ్లే దైవాన్ని అందుకోగలరు. అంతే కానీ రాముణ్ని, కృష్ణుణ్ని, బుద్ధుణ్ణి, మహావీరుని, ఇంకెవరినో అనుకరించాలనుకుంటే వాళ్ళు ఆదర్శమనే ముసుగు వేసుకుంటారు. ఆ ముసుగులో స్వీయస్వాతంత్య్రాన్ని స్వేచ్ఛను కోల్పోతారు” అంటూ ఒక కథ చెప్పాను.

ఒకానొకప్పుడు ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతను అనుకరణ కళలో ఆరితేరిన వాడు. ప్రత్యేకించి పక్షలు స్వరాల్ని అపురూపంగా అనుకరించేవాడు. ధ్వని అనుకరణ నైపుణ్యం సాధించాడు. జనం అతని అనుకరణ కళని అభినందించారు. అతన్ని ఆకాశానికి ఎత్తారు. అతని అనుకరణ కళ ఏ స్థాయికి చేరిందంటే పక్షుల స్వరాల్ని అనుకరిస్తూ క్రక్రమంగా అతను తన సొంత స్వరాన్ని మరిచిపోయాడు. తనకొక స్వరముందన్న విషయమే విస్మరించాడు. జనాల అభినందనలు మాత్రం నిరంతరం అందుకునేవాడు. దానివల్ల అతనికి తనమీద అంతులేని విశ్వాసం పెరిగింది. అతని ప్రతిభ తమ గ్రామ పరిసర ప్రాంతాలకే కాక దేశమంతా విస్తరించాలని భావించి గ్రామ ప్రజలు ”నువ్వు రాజు దగ్గరికి వెళ్లి నీ విద్యను ప్రదర్శించు. రాజు గొప్ప ఔదార్యమున్నవాడు. ఆయన నిన్ను సత్కరిస్తాడు. సన్మానిస్తాడు. తన ఆస్థానంలో నిన్ను నియమించుకుంటాడు” అని ప్రోత్సహించారు. గ్రామప్రజల ప్రోత్సాహంతో అతను రాజధానికి చేరి రాజ సభలో ప్రవేశానికి అనుమతి సంపాదించాడు. సభలో ప్రవేశించాడు. సభ జనాలతో నిండి ఉంది. రాజు సింహాసనాన్ని అధిరోహించి ఉన్నాడు. అతను తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించి, పక్షలు వివిధ స్వరాల్ని ప్రతిభావంతంగా వినిపించాడు. సభా సదులంతా హర్షధ్వానాల్ని ప్రకటించారు. రాజు మాత్రం వివేకవంతుడు. జ్ఞాని. అతను ఆ వ్యక్తిని చూసి ”నీ అనురణ కళ చాలా బాగుంది. కానీ పక్షుల స్వరాల్ని వినిపించడానికి పక్షులున్నాయి. ప్రత్యేకంగా వాటిని నువ్వు వినిపించాల్సిన పని లేదు. కానీ ప్రకృతి సిద్ధంగా నీకో స్వరం ఉంది. ఆ స్వరాన్ని నువ్వు ఆలపించు. ఆ స్వరం నీ తత్త్వాన్ని మాకు అందించి మమ్మల్ని తన్మయుల్ని చేస్తుంది” అన్నాడు.

ఆ వ్యక్తి ఎంత ప్రయత్నించినా అతని స్వరం పెగల్లేదు. అనుకరణకు అలవాటయిన అతని స్వరం స్వీయతత్త్వాన్ని కోల్పోయింది. ఈ కథ విని వృద్థబాలుడిలోని బాలుడు మాయమయ్యాడు.

– సౌభాగ్య

Tags:    
Advertisement

Similar News