దయ్యం భాష (Devotional)

ఒక నౌక సముద్రంలో సాగుతోంది. అది దూర దేశాలు వెళుతోంది. దాంట్లో వివిధ దేశాల ప్రజలు ఉన్నారు. విదేశీయానం పట్ల ఆసక్తి కలిగినవాళ్లు సముద్ర ప్రయాణాన్ని ఇష్టపడేవాళ్లు, వ్యాపారస్థులు ఎందరో ఉన్నారు. పెద్దలు,పిల్లలు, స్త్రీలు అందరితో నౌక సందడిగా ఉంది. వాళ్లలో ఒక సన్యాసి కూడా ఉన్నాడు. ఆయన ఎన్నో ధర్మాల్ని అధ్యయనం చేసినవాడు. మనుషుల గురించి బాగా తెలిసినవాడు. ప్రశాంత చిత్తుడు. నౌక అంతా కలకలం నిండి ఉన్నా నిర్లిప్తంగా తన లోకంలో తను వుండేవాడు. […]

Advertisement
Update:2015-09-12 18:31 IST

ఒక నౌక సముద్రంలో సాగుతోంది. అది దూర దేశాలు వెళుతోంది. దాంట్లో వివిధ దేశాల ప్రజలు ఉన్నారు. విదేశీయానం పట్ల ఆసక్తి కలిగినవాళ్లు సముద్ర ప్రయాణాన్ని ఇష్టపడేవాళ్లు, వ్యాపారస్థులు ఎందరో ఉన్నారు. పెద్దలు,పిల్లలు, స్త్రీలు అందరితో నౌక సందడిగా ఉంది. వాళ్లలో ఒక సన్యాసి కూడా ఉన్నాడు. ఆయన ఎన్నో ధర్మాల్ని అధ్యయనం చేసినవాడు. మనుషుల గురించి బాగా తెలిసినవాడు. ప్రశాంత చిత్తుడు. నౌక అంతా కలకలం నిండి ఉన్నా నిర్లిప్తంగా తన లోకంలో తను వుండేవాడు. ఉదయం సముద్రాన్ని చూస్తూ, దాని గాంభీర్యానికి తలవంచుతూ, ఆకాశాన్ని కలియజూస్తూ, సాయం సంధ్యల్ని పరిశీలిస్తూ కాలం గడిపే వాడు. దూరదేశం నించీ వచ్చిన ఆహ్వానం మేరకు అక్కడ

ఉపన్యసించడానికి ఆయన వెళుతున్నాడు. ఒక రోజు చీకటి పడబోతుంది. అది ఆయన ధ్యాన సమయం. ఒక మూల ఎవరూ లేని చోటుకు వెళ్ళి ధ్యానంలో కూర్చున్నాడు. నౌకలో రకరకాల జనం ఉంటారు. నౌకకూడా లోకం లాంటిదే. ఒక కుర్రాళ్ల గుంపు కూడా ఆ నౌకలో ఉంది. వాళ్ళు ఎప్పట్నించో ఆ సన్యాసిని ఆటపట్టించాలని చూస్తున్నారు. ఒక మూలంగా వెళ్లి సన్యాసి కూచోవడం చూసారు. ఇది సమయమనుకున్నారు. దగ్గరగా వెళ్లారు. సన్యాసి కళ్లు మూసుకుని ఉండడం చూశారు. ఒక కుర్రవాడు పిల్లి కూతలు కూశాడు. సన్యాసి కళ్ళు తెరవలేదు. మరో కుర్రాడు కాగితపు ఉండల్ని సన్యాసిపై విసిరాడు. సన్యాసి పట్టించుకోలేదు. ఇద్దరు కుర్రాళ్లు గంతులువేస్తూ పాటలు పాడారు. సన్యాసి పట్టించుకోలేదు. దాంతో కుర్రాళ్ల అహం దెబ్బతింది. ఒక కుర్రాడు తన చెప్పుతీసి సన్యాసిపై విసిరాడు. సన్యాసి చలించలేదు. ప్రార్థనలో మునిగిపోయాడు.

ఇదంతా పైనించీ దేవుడు చూస్తున్నాడు. దేవుడికి ఆగ్రహం కలిగింది. వెంటనే”నాయనా! నువ్వు ఒక్క మాట చెబితే ఈ నౌకను తలకిందు చేస్తా! వీళ్లందర్ని ముంచేస్తా!” అన్నాడు. ఆకాశం నుంచీ వినిపించిన ఆ మాటలతో అల్లరిమూక అదిరిపోయింది. అందరూ సన్యాసి పాదాలపై పడి క్షమాపణలు కోరారు. సన్యాసి వాళ్లను ఓదార్చి భయపడవద్దని చెప్పాడు. ఆకాశంలోకి చూసి ”దేవా! దయామయులైన మీరు దయ్యం భాషలో మాట్లాడడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. కరుణాసింధువయిన నువ్వు ఇంత కఠిన భాషలో మాట్లాడకూడదు కదా! మీరు దేన్నయినా తలకిందులు చెయ్యదలుచుకుంటే నౌకను కాదు. వీళ్ల బుద్దిని తలకిందులు చేయి. నౌకను తలకిందులు చేస్తే అంతా నాశనమవుతుంది. నువ్వు నాశనం చేసే వాడివి కాదు కదా! వెలుగు నింపే వాడివి కదా!” అన్నాడు. ఆకాశంనుంచీ బదులు వినిపించింది.

”నాయనా! నువ్వు సత్యం చెప్పావు. నాస్వరంలో తేడాను గుర్తించావు. చాలా సంతోషం. ఎవరైతే దయ్యం భాషను గుర్తించగలరో నా నిజమైన స్వరాన్ని వాళ్లే గుర్తుపడతారు. నువ్వు నా స్వరాన్ని గుర్తు పట్టావు. నా తత్వాన్ని తెలుసుకున్నావు. నువ్వు చెప్పినట్లు నేను వీళ్ళ బుద్ధిని తలకిందులు చేస్తాను” అని దేవుడు ఆ అల్లరిమూకలో పరివర్తన తెచ్చాడు. ఆ కుర్రాళ్లు పశ్చాతాపంతో సన్యాసిని క్షమాపణలు కోరారు. సన్యాసి వాళ్ళని చిరునవ్వుతో ఆదరించాడు. మనసులు నిర్మలంగా మారాయి. నౌక నిశ్చలంగా సాగింది.

– సౌభాగ్య

Tags:    
Advertisement

Similar News