గుప్తనిధులు (Devotional)

ఒక యువకుడు ఒక సన్యాసిని దర్శించి నమస్కరించాడు.  సన్యాసి ఆ యువకుణ్ణి చూశాడు. యువకుడి ముఖంలో ఎంతో నిరాశ, దిగులు కనిపించాయి. జీవితం పట్ల ఏమాత్రం విశ్వాసం లేనట్లు నీరసించిపోయి కనిపించాడు. సన్యాసి యువకుడితో ‘ఏమయింది? ఎందుకంత దిగులుగా ఉన్నావు? అన్నీ కోల్పోయినట్లు ఎందుకలా ఉన్నావు?” అని అడిగాడు.  యువకుడు ”స్వామీ! నేను ఏం చేసినా కలిసి రాలేదు. ఉన్నవన్నీ పోగొట్టుకున్నాను. నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. దేవుడు నా దగ్గరున్నవన్నీ దోచేసుకున్నాడు.  నా దగ్గర […]

Advertisement
Update:2015-09-11 18:31 IST

ఒక యువకుడు ఒక సన్యాసిని దర్శించి నమస్కరించాడు. సన్యాసి ఆ యువకుణ్ణి చూశాడు. యువకుడి ముఖంలో ఎంతో నిరాశ, దిగులు కనిపించాయి. జీవితం పట్ల ఏమాత్రం విశ్వాసం లేనట్లు నీరసించిపోయి కనిపించాడు. సన్యాసి యువకుడితో ‘ఏమయింది? ఎందుకంత దిగులుగా ఉన్నావు? అన్నీ కోల్పోయినట్లు ఎందుకలా ఉన్నావు?” అని అడిగాడు. యువకుడు ”స్వామీ! నేను ఏం చేసినా కలిసి రాలేదు. ఉన్నవన్నీ పోగొట్టుకున్నాను. నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. దేవుడు నా దగ్గరున్నవన్నీ దోచేసుకున్నాడు. నా దగ్గర ఏమీ లేకుంటే నన్ను ఎవరూ లెక్క పెట్టరు. సంపద ఉన్నవాణ్ణే లోకం సత్కరిస్తుంది. ఇంత పేదవాడిగా ఉండడం కన్నా చనిపోవడం మేలని నిర్ణయించుకున్నాను” అన్నాడు. సన్యాసి అంతా విన్నాడు ”చూడు బాబూ! నీ దగ్గర ఎర్రఏగానీ లేదు. దేవుడు అంతా తీసేసుకున్నాడు. ఇక నాకు మరణం తప్ప మరో మార్గం లేదు అంటున్నావు కదా! నాకు నిన్ను చూస్తే అలా అనిపించడం లేదు. నీ దగ్గర ఎంతో సంపద ఉన్నట్లనిపిస్తోంది. నీ దగ్గర నిధినిక్షేపాలున్నాయి. వాటిని గానీ నువ్వు అమ్మితే నీకూ లాభం ఉంటుంది” అన్నాడు. సన్యాసి మాటలకు యువకుడు ఆశ్చర్యపోయాడు.

”స్వామీ! మీరేమంటున్నారు? నా దగ్గర పైసా కూడా లేకుండా నిరుపేదగా మారాను. మీరేమో నా దగ్గర నిధి నిక్షేపాలు ఉన్నట్లు చెబుతున్నారు” అన్నాడు. సన్యాసి ”లేదయ్యా! నీ దగ్గర గుప్తనిధులున్నాయి. నాకు తెలుసు. నాకు తెలిసిన ఒక రాజు ఉన్నాడు. మనం ఆయన దగ్గరకు వెళదాం. ఎందుకంటే ప్రతిదానికీ విలువ కట్టగలగిన నైపుణ్యం ఆరాజు దగ్గరుంది. ఆయన నీదగ్గరున్న సంపదకు విలువ కడతాడు. దానికి సరిపడా నీకు ధనమిస్తాడు. నీకు అభ్యంతరం లేకుంటే మనం ఆయన దగ్గరకు వెళదాం” అన్నాడు. యువకుడికి అంతా అయోమయంగా ఉంది. తన దగ్గర ఏమీ లేదు. ఈ సన్యాసేమో తన దగ్గర నిధి

ఉందంటున్నాడు. నాకు తెలీని నిధి నా దగ్గరెక్కడుంది? అని ఆశ్చర్యపోయాడు. చూద్దాం అని ”సరే వెళదాం పదండి” అన్నాడు. దార్లో సన్యాసి ”నీ కళ్లు రాజుకు నచ్చాయనుకో. వాటికి యాభయైవేలు యిస్తాడు. అట్లాగే నీ మెదడు,కాలేయం,గుండె వీటికయితే లక్ష రూపాయలు సరేనా?!” అన్నాడు సన్యాసి.

ఆమాటలు వింటూనే యువకుడు ఈ సన్యాసికి పిచ్చెక్కిందని అనుకున్నాడు. ”ఏమంటున్నారు? బుర్రున్న వాడెవడయినా మెదడు,గుండె అమ్ముకుంటారా? నేనే కాదు ఎంత డబ్బిచ్చినా ఎవరూ అమ్మరు” అన్నాడు. సన్యాసి నవ్వి ”అయితే ఇంత విలువైనవి నీ దగ్గర పెట్టుకుని పేదవాడివని ఎందుకు దిగులు పడతావు? ఇది అంతులేని సంపద. అమూల్య నిధి. ఈ విలువైన సంపదను నువ్వు ఉపయోగించుకోలేకపోతే నీ దగ్గర ఎంత ధనమున్నా లాభం లేదు. ఉన్నవి ఉపయోగించడం నేర్చుకో” అన్నాడు.

ఇంకా ”దేవుడు మనిషికి అంతులేని సంపద నిండిన జీవితాన్ని ఇచ్చాడు. జీవితం కంటే గొప్ప సంపద లేదు. జీవితంలో ఐశ్యర్యాన్ని చూడలేని వాళ్లు బయట ఏమీ చూడలేరు!” అన్నాడు. ఆ మాటల్తో జ్ఞానోదయమై యువకుడు సన్యాసికి నమస్కరించి ఆనందంగా వెళ్ళిపోయాడు.

– సౌభాగ్య

Tags:    
Advertisement

Similar News