వయసు (Devotional)
స్వామి రామ తీర్థ మొదటిసారి విదేశాలకు ప్రయాణమయ్యాడు. ఆయన ఒక నౌకలో వెళుతున్నాడు. ఆ నౌకలో ఒక వృద్ధుడు కూడా ప్రయాణిస్తున్నాడు. అతను జర్మన్ దేశస్థుడు. అతని వయసు దాదాపు తొంభై ఏళ్లుంటాయి. అతని తల నెరిసిపోయింది. చర్మం ముడుతలు పడింది. కళ్లకు లావుపాటి అద్దాలు పెట్టుకున్నాడు. ఇవన్నీ చూసే వాళ్లకు అతని వయసును చూపిస్తున్నాయి. కానీ దాంతో సంబంధం లేకున్నా ఆ జర్మన్ వృద్ధుడు తన పనిలో మునిగి ఉన్నాడు. రామతీర్థను ఆకర్షించిన విషయం అతన్లో […]
స్వామి రామ తీర్థ మొదటిసారి విదేశాలకు ప్రయాణమయ్యాడు. ఆయన ఒక నౌకలో వెళుతున్నాడు. ఆ నౌకలో ఒక వృద్ధుడు కూడా ప్రయాణిస్తున్నాడు. అతను జర్మన్ దేశస్థుడు. అతని వయసు దాదాపు తొంభై ఏళ్లుంటాయి. అతని తల నెరిసిపోయింది. చర్మం ముడుతలు పడింది. కళ్లకు లావుపాటి అద్దాలు పెట్టుకున్నాడు. ఇవన్నీ చూసే వాళ్లకు అతని వయసును చూపిస్తున్నాయి. కానీ దాంతో సంబంధం లేకున్నా ఆ జర్మన్ వృద్ధుడు తన పనిలో మునిగి ఉన్నాడు. రామతీర్థను ఆకర్షించిన విషయం అతన్లో ఒకటుంది. ఏమిటంటే ఆ జర్మన్ నౌక డెక్‌మీద కూచుని చైనాభాషని నేర్చుకుంటున్నాడు. స్వామి రామతీర్ధకు ఎంతో ఆశ్చర్యమేసింది. ఆ వృద్ధుడు పిచ్చివాడిలా కనిపించాడు. ఎందుకంటే చైనా భాష చాలా కష్టం. దాన్ని సమగ్రంగా నేర్చుకోవాలన్నా దానిపై అధికారం సంపాదించాలన్నా సంవత్సరాలు పడతాయి. ఆ భాషని ఈ వయసులో నేర్చుకుని అతనేం చేస్తాడు? ఎందకంత ఆసక్తిగా ఆ భాషను నేర్చుకుంటున్నాడు? ఇలా రామతీర్ధ మనసులో ఎన్నో ఆలోచనలు మెదిలినా అడగడమెందుకులే అని తన ఉత్సుకతని తమాయించుకున్నాడు.
రెండురోజులు గడిచాయి. ఆవృద్ధుడు ఎప్పట్లాగే డెక్‌మీదకు వచ్చి చైనా లిపిని ప్రాక్టీసు చెయ్యడంలో మునిగిపోయాడు. ఇక ఆపుకోలేక మూడో రోజు ఆ వృద్ధుని దగ్గరకు వెళ్లి నమస్కరించాడు. ఆ వృద్ధుడు ప్రతి నమస్కారం చేశాడు. స్వామి రామతీర్ధ ”సర్! అన్యధా భావించకండి. మీరు చేస్తున్న పని చూసి నాకు కొన్ని ప్రశ్నలడగాలనిపించింది. ఈ వయసులో మీరు చైనా భాష నేర్చుకుంటున్నారు. మంచిదే. దీన్ని నేర్చుకుంటారు. నేర్చుకుని ఏం చేస్తారు? పైగా ఈ వయసులో అవునూ ఇంతకూ మీ వయసెంత?” అన్నాడు.
ఆ జర్మన్‌వ్యక్తి తలపైకెత్తి రామతీర్థను చూసి, ”భలే ప్రశ్న వేశారు. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచీ నాకు వయసు ధ్యాస లేదు. నేను అంతగా ఎప్పుడూ పనిలో మునిగి ఉంటాను. నాకు ఆ ఆలోచనే రాలేదు. అయినా దానివల్ల లాభమేమిటి? ఎప్పుడో చావు వస్తుంది. దాన్ని గురించి ఆలోచించకుంటూ బతుకును వదులుకోవటమెందుకు? బహుశా నాకు తొంభైయ్యేళ్లు ఉండవచ్చు” అన్నాడు. రామతీర్థ ”ఇప్పటికే మీరు వృద్ధులు. ఈ భాష ఎప్పుడు నేర్చుకుంటారు. ఎన్నేళ్లు పడతాయి?” అన్నాడు. ఆ వృద్ధుడు ”నేను భాషను నేర్చుకుంటున్నంత సేపు వయసు స్పృహ నాకు లేదు. నేను నేర్చుకుంటున్నాను. చాలా యిష్టంగా నేర్చుకుంటున్నాను. పసివాడిలా ఆహ్లాదంగా ఇష్టమయిన పని చేస్తున్నాను యిష్టమయిన పని చేయడమే పని ప్రయోజనం. మరణానికి భయపడితే చేస్తున్న పని ఆపేస్తాం. తొంభయి సంవత్సరాలుగా నేను నేర్చుకుంటూనే ఉన్నాను. పని చేస్తూనే ఉన్నాను. అంటే తొంభయి సంవత్సరాల పాటు మరణాన్ని జయించాను అన్నాడు
ఏది ఎందుకు అన్న ప్రశ్నలతో పనిలేదు. నచ్చిన పని చెయ్యాలి. ఆనందంగా చెయ్యాలి. అప్పుడే తొమ్మిదేళ్ళయినా తొంభయ్యేళ్ళయినా తేడా ఉండదు. చివరి క్షణం ఎప్పుడొస్తుందో ఎవరూ చెప్పలేరు. ఆ ఆలోచన అసంగతం. తెలియని భయాన్ని కొని తెచ్చుకోవడం వెర్రితనం” అని. ”ఇంతకూ నీ వయసెంత?” అన్నాడు. ఆ మాటలకు స్వామి రామతీర్థ ఖంగుతిన్నాడు. అప్పుడు స్వామిరామతీర్థ వయసు ముప్పయి సంవత్సరాలే!
– సౌభాగ్య