సారిపుత్రుడు (Devotional)

సారిపుత్రుడు గౌతమబుద్ధుడి ప్రముఖ శిష్యుల్లో ఒకడు.  గౌతమబుద్ధుడి జీవితకాలంలో జ్ఞానోదయం పొందినవాళ్లల్లో ఒకడు. సారిపుత్రుడు మొదట గౌతమబుద్ధుడి దగ్గరకు వాదించడానికి వచ్చాడు. అప్పటికే అతను గొప్ప గురువుగా పేరు పొందాడు.  ఐదువేలమంది శిష్యులతో పటాటోపంగా గౌతమబుద్ధుడి దగ్గరకి వచ్చాడు.  ప్రాథమిక సూత్రాల గురించి వాదోపవాదానికి వచ్చాడు. బుద్ధుడు సారిపుత్రుడిని సాదరంగా ఆహ్వానించి తన శిష్యులను, సారిపుత్రుని శిష్యుల్ని చూసి ”ఇతను గొప్ప ఉపాధ్యాయుడు.  ఒకరోజుకి తప్పకుండా ఇతను గొప్ప గురువు అవుతాడని నాకు నమ్మకం వుంది” అన్నాడు.  […]

Advertisement
Update:2015-09-06 18:31 IST

సారిపుత్రుడు గౌతమబుద్ధుడి ప్రముఖ శిష్యుల్లో ఒకడు. గౌతమబుద్ధుడి జీవితకాలంలో జ్ఞానోదయం పొందినవాళ్లల్లో ఒకడు.

సారిపుత్రుడు మొదట గౌతమబుద్ధుడి దగ్గరకు వాదించడానికి వచ్చాడు. అప్పటికే అతను గొప్ప గురువుగా పేరు పొందాడు. ఐదువేలమంది శిష్యులతో పటాటోపంగా గౌతమబుద్ధుడి దగ్గరకి వచ్చాడు. ప్రాథమిక సూత్రాల గురించి వాదోపవాదానికి వచ్చాడు.

బుద్ధుడు సారిపుత్రుడిని సాదరంగా ఆహ్వానించి తన శిష్యులను, సారిపుత్రుని శిష్యుల్ని చూసి ”ఇతను గొప్ప ఉపాధ్యాయుడు. ఒకరోజుకి తప్పకుండా ఇతను గొప్ప గురువు అవుతాడని నాకు నమ్మకం వుంది” అన్నాడు. సారిపుత్రుడితో పాటు అందరూ ఆశ్చర్యపోయారు. బుద్దుడి మాటలు వాళ్లకు అర్దం కాలేదు. ” మీ ఉద్దేశం ఏమిటి?” అన్నాడు సారిపుత్రుడు. బుద్దుడు”నువ్వు మంచి తర్కవేత్తవు. బాగా వాదిస్తావు. నువ్వు ప్రభావశీలివైన ప్రతిభాశాలివి. మేధావి అయిన ఉపాధ్యాయుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ నీకు వున్నాయి. ఐదువేల మంది తెలివైన అనుయాయులు నీకున్నారు. కానీ నువ్వు ఇంకా గురువు కాలేదు. నువ్వు గురువు అయితే నేనే నీ దగ్గరికి వచ్చేవాడిని. నువ్వు నా దగ్గరికి వచ్చేవాడివి కావు.

నువ్వు గొప్ప తత్వవేత్తవు కానీ నీకు ఏమీ తెలీదు. కానీ నీ తెలివితేటల పట్ల నాకు విశ్వాసం వుంది. నువ్వు అబద్ధం చెప్పవు అనే అనుకుంటున్నాను. నువ్వు ఒక ఆలోచనాపరుడివి. కానీ ఏదీ నీకు అనుభవంలోకి రాలేదు. నీకు ఎలాంటి అనుభవమైనా కలిగిందని చెబితే నీతో నేను వాదించడానికి సిద్దం. కానీ ఒక సంగతి గుర్తుంచుకో. అబద్ధం ఆడడం అన్నది నీకు ఏ విధంగానూ ఉపయోగపడదు. దొరికిపోతావు. ఎందుకంటే అనుభవం అన్నది అపురూప మైనది. అది పవిత్ర గ్రంథాల్లో ఉండదు. దాన్ని గురించి స్పష్టత నీకు అవసరం” అన్నాడు.

ఇంకా నువ్వు సత్యాన్ని అనుభవానికి తెచ్చుకున్నావని చెబితే నీతో వాదించడానికి నేను సిద్ధం. లేదా సత్యాన్ని నువ్వు అనుభవానికి తెచ్చుకోలేదని నువ్వు చెబితే నిన్ను నా శిష్యుడిగా స్వీకరించడానికి నాకు అభ్యంతరం లేదు. నిన్ను నేను గురువును చేస్తాను. ఆ విషయం గురించి నేను అభయం ఇస్తున్నాను. అబద్ధాన్ని ఆధారం చేసుకుని నాతో వాదిస్తావో, సత్యానికి కట్టుబడి నా శిష్యుడివై నాతో కలిసి అధ్యయనం చేస్తావో, అనుభవాన్ని పంచుకుంటావో నీ ఇష్టం.

ఒకప్పటికి నువ్వు గురువై నాతో వాదనకు సిద్దపడితే నీతో వాదించడానికి నేనూ సిద్ధపడి ఉంటాను” అన్నాడు. క్షణకాలం నిశబ్దం అలుముకుంది. సారిపుత్రుడు సత్యానికి తల వంచే వ్యక్తి. అతను బుద్ధుడితో ”మీరు చెప్పింది నిజం. నేనెప్పుడూ దాన్ని గురించి ఆలోచించలేదు. మీరు అనుభవం గురించి అడుగుతారని నేను ఊహించనే లేదు. దేశంలో ఎన్నోచోట్ల వాదించాను. ఎందరినో ఓడించాను” అన్నాడు.

అది మనదేశంలో ఒకప్పటి పద్ధతి. వాదోపవాదాలు జరిగేవి. ఓటమి పాలైన వాళ్లు శిష్యులుగా మారేవాళ్లు. సారిపుత్రుడు ”ఇక్కడున్న నా శిష్యుల్లో చాలామంది ఉపాధ్యాయులు, బోధకులు. కానీ ఎప్పుడూ ఎవరూ నన్ను అనుభవం గురించి అడగలేదు. నాకు ఎలాంటి అనుభవం లేదు. కాబట్టి ఇక్కడ వాదించడానికి అవకాశమే లేదు. మీ పాదాలను తాకుతున్నా, నాకు అనుభవం వచ్చేదాకా ఆగుతాను.నాపై నేను అధికారం పొందేదాక ఆగుతాను” అన్నాడు.

అప్పటి నుండి మూడేళ్లపాటు బుద్ధుడితో ఉన్న తరువాత సారిపుత్రుడికి జ్ఞానోదయం అయింది. శక్తివంతుడయ్యాడు. అతను జ్ఞానోదయం పొందిన రోజు బుద్ధుడు అతన్ని పిలిపించి ”నువ్వు నాతో వాదించదలచుకున్నావా?” అన్నాడు. సారిపుత్రుడు బుద్ధుని పాదాలను స్పర్శించి ”మొదట మీ పాదాలను ముట్టుకున్నప్పుడు నాకు అనుభవం లేదు. ఇప్పుడు నాకు అనుభవం ఉంది కాబట్టి మీ పాదాలను స్పర్శించాను. ఇక్కడ వాదించడం, చర్చించడం అన్న సమస్యే తలెత్తదు.

అప్పుడు వాదించడం అసాధ్యమైంది. ఇప్పుడు కూడా వాదించడం అసాధ్యమైంది. ఇక్కడ వాదించడానికి ఏమీ లేదు. మీకు తెలుసు, నాకు తెలిసింది ఒకటే. నేను మీశిష్యుడిని, నేను ఇతరులకు గురువును కావచ్చు కానీ, ఎప్పటికీ మీకు శిష్యుడినే. మీరు నాజీవితాన్నే మార్చేశారు. లేకపోతే నేను అనవసరంగా ఇతరులతో వాదిస్తూ నా కాలాన్ని, ఇతరుల కాలాన్ని వ్యర్ధం చేస్తూ నిష్పలంగా మరణించేవాడిని” అన్నాడు.

– సౌభాగ్య

Tags:    
Advertisement

Similar News