పులిని చంపిన వీరుడు (For Children)

సంతాల్‌ పరగణాలల్లో గ్రామాల్లో ఉమ్మడి వ్యవసాయం కూడా చేసేవాళ్ళు. పంట చేతికి వచ్చిన సమయంలో వంతుల వారీగా కాపలా కాసేవాళ్ళు. పందులు, ఎలుగుబంట్లు, నక్కలు మొదలయిన అడవి జంతువులు పంటల మీద పడి ధ్వంసం చేసేవి. వాటి బారి నుండి రక్షించాలంటే కాపలా అవసరం. ఒకరోజు ఒక సంతాల్‌ వంతు వచ్చింది. కాపలాకు అన్ని సిద్ధం చేసుకున్నాడు. అడవి జంతువుల బారి నుండి తప్పించుకోవడానికి చెట్టెక్కి కాపలా కాసేవాళ్ళు. చెట్టులేని పక్షంలో వెదురుబొంగులతో మంచెలాంటిది కట్టి దానిపై […]

Advertisement
Update:2015-09-05 18:32 IST

సంతాల్‌ పరగణాలల్లో గ్రామాల్లో ఉమ్మడి వ్యవసాయం కూడా చేసేవాళ్ళు. పంట చేతికి వచ్చిన సమయంలో వంతుల వారీగా కాపలా కాసేవాళ్ళు. పందులు, ఎలుగుబంట్లు, నక్కలు మొదలయిన అడవి జంతువులు పంటల మీద పడి ధ్వంసం చేసేవి. వాటి బారి నుండి రక్షించాలంటే కాపలా అవసరం.

ఒకరోజు ఒక సంతాల్‌ వంతు వచ్చింది. కాపలాకు అన్ని సిద్ధం చేసుకున్నాడు. అడవి జంతువుల బారి నుండి తప్పించుకోవడానికి చెట్టెక్కి కాపలా కాసేవాళ్ళు. చెట్టులేని పక్షంలో వెదురుబొంగులతో మంచెలాంటిది కట్టి దానిపై ఓ గుడిసెలాంటిది కట్టుకుని దానిలో ఉండి కాపలా కాసేవాళ్ళు.

ఆ సంతాల్‌ పొలం కేసి బయల్దేరాడు. చేతిలో బల్లెం, విల్లంబులు పట్టుకుని బయల్దేరాడు. ఎదురుగా ఒక అడవి పంది దూసుకు వచ్చింది. సూటిగా చూసి బల్లెం విసిరాడు. అది దాని కడుపుగుండా దూసుకుపోయింది. అడవి పంది చనిపోయింది. దాన్ని వీపుపై వేసుకుని పొలం దగ్గరకి వెళ్ళి మంచి ఎక్కి అక్కడే దాని ముక్కలు ముక్కలు చేశాడు. ఎప్పుడూ కత్తి, బల్లెం మొదలయినవి దగ్గరే ఉంచుకుంటాడు. ఇట్లాంటి పరిస్థితి వస్తుందని మంచెపైనే మసాలాలలు, వంటసామాగ్రి సిద్ధంగా పెట్టుకున్నాడు.

పైనే నాలుగురాళ్ళతో పొయ్యి అమర్చి మంటపెట్టారు. అది చలికాలం. ఒకవేపు చలికాచుకుంటూ ఇంకోవేపు కారంపొడి, వుప్పు దట్టించిన మాంసం ముక్కల్ని కాల్చుకుంటూ తిన్నాడు.

దుప్పటి కప్పుకుని మధ్యమధ్యలో మాంసం ముక్కలు తింటూ ఉంటే మహా ఆనందంగా ఉంది. ముక్కలు తిన్న తరువాత ఎముకల్ని కిందకు విసిరేశాడు.

ఎన్నిసార్లు ఎముకల్ని కిందకు విసిరినా ఏ మాత్రం శబ్దం రాలేదు. ఆశ్చర్యమేసింది. ఒకసారి మంచె కిందకు చూశాడు. గుండాగినంత పనయింది. ఎందుకంటే మంచె కింద ఒక పులి ఉంది. అది ఎముకను పైనించీ వేసినప్పుడల్లా ఆ ఎముక కిందపడకుండా ఎగిరి అందుకుంటోంది.

దాంతో సంతాల్‌కి భయం పట్టుకుంది. దాని బారి నుండి ఎట్లా తప్పించుకోవాలో తోచలేదు. ఆలోచించాడు.

తన దగ్గరున్న కత్తిని చూశాడు. అది పిడికత్తి. దాన్ని నిప్పులో పెట్టాడు. ఈలోగా కాల్చిన మాంసం ముక్కల్ని తింటూ ఎముకల్ని ఒకటొకటిగా కిందకు వదుల్తున్నాడు. పులి ఎగిరి ఎముకల్ని అందుకుంటూ ఉంది.

నిప్పులో పెట్టిన కత్తి నిగనిగలాడింది. ఎముకల్ని వదుల్తూ వాటితో బాటు ఎర్రగా కాలిన పిడికత్తిని కూడా వదిలాడు. అది కూడా ఎముకే అనుకున్న పులి ఆ పిడికత్తిని గుటుక్కున మింగింది. ఆ కత్తి గొంతుమధ్యలో ఆగిపోయి పులి ఊపిరాడక గిలగిలా తన్నుకుని చనిపోయింది.

తెల్లారాకా విషయం తెలుసుకుని వీరోచితంగా పులిని చంపిన తమ గ్రామస్థుణ్ణి భుజాలపై ఎక్కించి వీధుల్లో తిప్పి సన్మానించారు గ్రామస్థులు.

– సౌభాగ్య

Tags:    
Advertisement

Similar News