ఈ బుడతడు...మేధస్సులో అసాధ్యుడు!
ఈ ఫొటోలో కనబడుతున్న అబ్బాయి పేరు వేదాంత్ ధీరేన్ థాకర్. వయసు పదకొండు సంవత్సరాలు. మహారాష్ట్రలోని శాంతి నగర్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. మిగిలిన పిల్లలకు ఇతనికి ఒక తేడా ఉంది. పిల్లలందరూ తమ చేతికందిన బొమ్మలను విరగ్గొట్టి, పగలగొట్టి వాటి రూపురేఖలను నాశనం చేస్తుంటారు…వేదాంత్ అందుకు విరుద్ధంగా విరిగిపోయిన బొమ్మలతో మరొక అందమైన, పనికొచ్చే వస్తువుని సృష్టిస్తుంటాడు. వివిధ బొమ్మల విడి భాగాలైన రిమోట్ కంట్రోల్స్, మాగ్నెట్స్, బ్యాటరీలు ఇలాంటివంటే వేదాంత్‌కి చాలా ఇష్టం. అతనిలో […]
వేసవి సెలవులు వస్తే చాలు, తను ఇంట్లో కుదురుగా ఉండడు… ఆడుకునేందుకు రోజంతా బయటకు వెళుతూ, మళ్లీ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. అలాగే తన స్నేహితులు కూడా చాలాసార్లు ఇంటికి వస్తుంటారు. ఇలాంటపుడు ప్రతిసారీ ఇంట్లో పనిలో ఉన్న తల్లి వచ్చి తలుపు తీస్తూ ఉంటుంది. అది ఆమెకు విసుగు, అలసట కలిగించే పని. తల్లికి ఆ శ్రమ లేకుండా తలుపు దానంతట అదే తెరుచుకునేలా రిమోట్ విధానాన్ని కనిపెట్టాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ప్రయత్నించాడు, విజయం సాధించాడు. ఇంట్లో ఏ మూల నుండైనా మెయిన్ డోర్‌ని తీయగల ఏర్సాటు తలుపుకి చేశాడు.
ఇప్పుడు వాళ్లమ్మ తన చేతిలో ఉన్న పనిని ఆపకుండానే ఇంట్లో ఎక్కడ ఉన్నా తలుపు తీయగలుగుతున్నారు. కారులోని రిమోట్ కంట్రోల్ సర్క్యూట్, మోటారు డ్రైవ్ మెకానిజం, యాంటీనా, గేర్ బాక్స్, ఒక నైలాన్ తాడు తదితరాలను తలుపుకి అమర్చి, దూరం నుండే ఓ రిమోట్ స్విచ్‌ని ఆన్, ఆఫ్ చేయడం ద్వారా తలుపు తెరుచుకుని మూసుకునే విధంగా ఆ పరికరాలు పనిచేసే ఏర్పాటు చేశాడు. వేదాంత్‌కి చిన్నప్పటినుండీ ఎలక్ట్రానిక్ వస్తువులంటే అమితమైన ఇష్టమని, తన కోసం తెచ్చిన ఆట వస్తువులను యథాతథంగా ఉంచేవాడు కాదని, వాటినుండి కొత్త వస్తువులను కనిపెడుతుండేవాడని అతని తండ్రి ధీరేన్ చెబుతున్నాడు. వేదాంత్ తయారుచేసిన నూతన వస్తువుల్లో ఎలక్ట్రానిక్ బోట్, సోలార్ పవర్ సోర్స్, క్రాకర్స్ తదితరాలున్నాయి. పిల్లల ఇష్టాలు, అభిరుచులు, ఆసక్తులను ప్రోత్సహిస్తే ప్రతి చిన్నారిలో ఇలాంటి ఒక బుల్లి మేధావి ఉంటాడని వేదాంత్ రుజువు చేస్తున్నాడు.