పెళ్ళిళ్ళ పేరయ్య-చిరుతపులి (For Children)
సంతాల్ పరగణాల్లో పెళ్ళిళ్ళ పేరయ్యలు నిర్భయంగా అడవుల్లోకి వెళ్లేవాళ్ళు. పులులకు వాళ్ళు భయపడేవాళ్ళు కారు. అడవిలో క్రూరమృగాలకు వాళ్ళు భయపడే వాళ్ళు కారు. దీనికి సంబంధించి ఒక కథ ఉంది. పూర్వం ఒక పెళ్ళిళ్ళ పేరయ్య ఒక గ్రామం నించి బయల్దేరి అడవి గుండా ఇంకో గ్రామం వెళుతున్నాడు. అతనికి ఒక చిరుతపులి ఎదురయింది. అతనిమీద దూకబోయింది. అతను ఆగు అన్నాడు. ఎందుకు? అంది. నేను చాలా ముఖ్యమయిన పనిమీద వెళుతున్నాను అన్నాడు. ఏమిటా ముఖ్యమయిన పని […]
సంతాల్ పరగణాల్లో పెళ్ళిళ్ళ పేరయ్యలు నిర్భయంగా అడవుల్లోకి వెళ్లేవాళ్ళు. పులులకు వాళ్ళు భయపడేవాళ్ళు కారు. అడవిలో క్రూరమృగాలకు వాళ్ళు భయపడే వాళ్ళు కారు. దీనికి సంబంధించి ఒక కథ ఉంది.
పూర్వం ఒక పెళ్ళిళ్ళ పేరయ్య ఒక గ్రామం నించి బయల్దేరి అడవి గుండా ఇంకో గ్రామం వెళుతున్నాడు. అతనికి ఒక చిరుతపులి ఎదురయింది. అతనిమీద దూకబోయింది. అతను ఆగు అన్నాడు. ఎందుకు? అంది. నేను చాలా ముఖ్యమయిన పనిమీద వెళుతున్నాను అన్నాడు. ఏమిటా ముఖ్యమయిన పని అని అడిగింది.
అతను ‘నేను ఒకణ్ణి. ఇద్దరు చేసే పనిమీద వెళుతున్నాను’ అన్నాడు.
చిరుతపులి ‘ఒకర్ని ఇద్దరు చెయ్యడమంటే ఏమిటి?’ అంది.
అతను ‘నీకు తెలుసుకోవాలని ఉందా?’ అన్నాడు. చిరుతపులి ‘అవును’ అంది.
‘అయితే ఒక పనిచేయి మొదట ఈ సంచిలోకి రా. మనం కొంతదూరం వెళ్ళాకా నీకు ఆసంగతి తెలిసేలా చేస్తా’ అన్నాడు.
చిరుతపులి సరేనని సంచిలోకి వచ్చింది. పెళ్ళిళ్ళ పేరయ్య సంచిని మూటకట్టి నెత్తిన పెట్టుకుని బయల్దేరాడు.
కొంతదూరం వెళ్ళాకా ఒక చెరువు కనిపిస్తే సంచిని ఆ చెరువులో విసిరేసి వెళ్ళాడు. దాంతో చిరుతపులి నీళ్ళలో మునిగిపోతుందనుకున్నాడు.
కానీ ఇంకోలా జరిగింది. ఆ చెరువు గట్టున ఒక ఆడచిరుతపులి కాచుకుని ఉంది. చెరువులో ఏదయినా పెద్ద చేప దొరుకుతుందేమోనని ఎప్పట్నించో కాచుకుని ఉంది. అంతపెద్ద సంచి నీటిలో పడేసరికి అదేదో పెద్ద జంతువనుకుని ఆసంచి బయటకి లాగింది. మూట విప్పితే దాంట్లోంచీ చిరుతపులి బయటకి వచ్చింది. చిరుతపులి తన కళ్ళ ఎదుట ఆడచిరుతపులిని చూసి తనకు ఆడతోడు దొరికినందుకు ఎంతో ఆనందించింది. పెళ్ళిళ్ళ పేరయ్య ఒకటిని రెండు చెయ్యడమంటే ఏమిటో తెలిసికొంది.
రెండు ఆనందించాయి. అన్యోన్యంగా కలిసిపోయాయి.
పెళ్ళిళ్ళ పేరయ్య చిరుతపులి నీటిలో మునిగి చనిపోయిందనుకున్నాడు. ఆ విషయమే మరచిపోయాడు. ఒకరోజు అడవిలో వెళుతూ ఉంటే చిరుతపులి ఎదురయింది. దాంతో అదిరిపోయి అది ప్రతీకారం తీర్చుకుంటున్నదన్న భయంతో పరిగెత్తబోయాడు.
అది ‘భయపడకు, ఆగు’ అని ఆడచిరుతపులిని, రెండుచిన్ని చిరుతల్ని తీసుకొచ్చింది. అన్నీ కలిసి తనని ఎక్కడ చంపుతాయో అని పెళ్ళిళ్ళ పేరయ్య భయపడిపోయాడు.
చిరుతపులి మీరు చెప్పడమే కాదు, చేసి చూపారు. ఒకర్ని ఇద్దరు చేశారు. ఇద్దరు నలుగురయ్యారు అన్నది.
పెళ్ళిళ్ళ పేరయ్యకు ఏమీ అర్థం కాకపోయినా భయం పోయింది. చిరుతపులి ఇక ఎప్పుడూ మీకు అడవిలో తిరుగుండదు. ఆటంకముండదు అన్నది.
అప్పటినించే పెళ్ళిళ్ళ పేరయ్యలు నిర్భయంగా అడవిలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు.
– సౌభాగ్య