ఆయ‌న జీవితం...క‌మ్మ‌ని టీ చుక్క‌లు...సాహితీ చ‌మ‌క్కులు!

ఢిల్లీలో ఇన్‌కం టాక్స్ ఆఫీస్‌కి ద‌గ్గ‌ర‌లో ఒక టీ దుకాణం ఉంది. ఆ టీ షాపు య‌జ‌మాని పేరు ల‌క్ష్మ‌ణ‌రావు.  అర‌వై మూడు సంవ‌త్స‌రాల వ‌య‌సున్న ఈ పెద్ద‌మ‌నిషి అమ్ముతున్న టీలో ఒక ప్ర‌త్యేక‌త ఉంది. ఆ టీ, టీ ఆకుల గుబాళింపుతో పాటు సాహితీ ప‌రిమ‌ళాలను సైతం వెద‌జ‌ల్లుతుంది. ఎందుకంటే ఆయ‌న మంచి ర‌చ‌యిత. ఇప్ప‌టివ‌ర‌కు ఇర‌వై నాలుగు పుస్త‌కాలు రాశారు. అందులో 12 పుస్త‌కాలను ప్ర‌చురించారు. ప్ర‌స్తుతం ఆయ‌న మాస్ట‌ర్స్ డిగ్రీ కూడా చేస్తున్నారు. […]

Advertisement
Update:2015-09-01 08:54 IST

ఢిల్లీలో ఇన్‌కం టాక్స్ ఆఫీస్‌కి ద‌గ్గ‌ర‌లో ఒక టీ దుకాణం ఉంది. ఆ టీ షాపు య‌జ‌మాని పేరు ల‌క్ష్మ‌ణ‌రావు. అర‌వై మూడు సంవ‌త్స‌రాల వ‌య‌సున్న ఈ పెద్ద‌మ‌నిషి అమ్ముతున్న టీలో ఒక ప్ర‌త్యేక‌త ఉంది. ఆ టీ, టీ ఆకుల గుబాళింపుతో పాటు సాహితీ ప‌రిమ‌ళాలను సైతం వెద‌జ‌ల్లుతుంది. ఎందుకంటే ఆయ‌న మంచి ర‌చ‌యిత. ఇప్ప‌టివ‌ర‌కు ఇర‌వై నాలుగు పుస్త‌కాలు రాశారు. అందులో 12 పుస్త‌కాలను ప్ర‌చురించారు. ప్ర‌స్తుతం ఆయ‌న మాస్ట‌ర్స్ డిగ్రీ కూడా చేస్తున్నారు. ల‌క్ష్మ‌ణ‌రావు పుస్త‌కాలు త‌న టీ షాపులోనూ…ఇంకా ఫ్లిప్‌కార్డ్, అమేజాన్, కిండిల్ లాంటి ఆన్‌లైన్ షాపుల్లో కూడా అందుబాటులో ఉన్నాయి.

మ‌హారాష్ట్ర‌కు చెందిన ల‌క్ష్మ‌ణ‌రావుకి చిన్న‌త‌నంనుండీ సాహిత్య‌మంటే మ‌క్కువ. గుల్ష‌న్ నందా ర‌చన‌లు చ‌దువుతూ ఆయ‌న‌లా మంచి ర‌చ‌యిత‌గా పేరు తెచ్చుకోవాల‌ని ఆశిస్తుండేవారు. అయితే ఆయ‌న పుట్టింది పేద‌కుటుంబంలో కావ‌డంతో చ‌దువుకునే అవ‌కాశ‌మే ఉండేది కాదు. చ‌దువుకోస‌మే తాను పుట్టిన గ్రామం నుండి అమ‌రావ‌తికి మ‌కాం మార్చాడాయ‌న‌. ఇళ్ల‌లో ప‌నిచేస్తూ, స్పిన్నింగ్ మిల్ వ‌ర్క‌ర్‌గా రోజులు గ‌డుపుతూ చ‌దువుని కొన‌సాగించారు.

అలా చ‌దువుకునే రోజుల్లోనే న‌దిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన త‌న క్లాస్‌మేట్ రాందాస్ గురించి పుస్త‌కం రాయ‌డంతో త‌న ర‌చ‌నా వ్యా సాంగం మొద‌లుపెట్టారు. ప‌దో త‌ర‌గ‌తి పూర్తి చేశాక కొన్నేళ్లు వ్య‌వ‌సాయం చేశారు. ఆ త‌రువాత తండ్రి ద‌గ్గ‌ర తీసుకున్న న‌ల‌భై రూపాయ‌లతో ఢిల్లీ బ‌య‌లుదేరారు. అయితే భోపాల్ వ‌ర‌కు వెళ్లే స‌రికి డ‌బ్బు అయిపోయింది. అక్క‌డ భ‌వ‌న నిర్మాణ కూలీగా ప‌నిచేశారు. చివ‌రికి 1975లో పాతికేళ్ల యువ‌కుడిగా ఢిల్లీ చేరారు ల‌క్ష్మ‌ణ‌రావు. ఉపాధి కోసం ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసి, కూలీగా, హోటల్లో క్లీన‌ర్ కూడా ప‌నిచేశారు. త‌రువాత ఓ పాన్‌షాపుని పెట్టారు. దాన్ని మార్చి టీ వ్యాపారం మొద‌లుపెట్టారు. అంత‌కుముందు కూడా ర‌చ‌న‌లు చేసినా, టీ వ్యాపారం పెట్టాక ల‌క్ష్మ‌ణ‌రావు క్యాప్ మూయ‌ని ర‌చ‌యిత‌గా రాస్తూనే ఉన్నారు.

గ‌త ఇర‌వై సంవ‌త్స‌రాలుగా ఒక ప‌క్క పొగలు క‌క్కే టీని, మ‌రో ప‌క్క సాహిత్య గుబాళింపుల‌తో ర‌చ‌న‌ల‌ను చేస్తూనే ఉన్నారు. టీ షాపు పెట్ట‌డానికి ముందే, పుట్టిన ఊరునుండి ఢిల్లీ వ‌ర‌కు … త‌న ప్ర‌యాణమే క‌థ‌గా న‌యీ దునియాకీ న‌యీ క‌హానీ అనే పుస్త‌కాన్ని రాశారు. స్నేహితుడిపై రాసిన పుస్త‌కాన్ని, దీన్ని తీసుకుని ప‌బ్లిష‌ర్ల వ‌ద్ద‌కు వెళ్లారు. వెళ్లిన ప్ర‌తిచోటా ఆయ‌న‌కు తిర‌స్క‌ర‌ణ‌లే ఎదుర‌య్యాయి. కొంత‌మంది హేళ‌న చేశారు. గెటౌట్ అన్నారు. ఒక టీ వ్యాపారం చేసుకునే వ్య‌క్తి పుస్త‌కం రాయ‌డం అనే విష‌యాన్ని ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోయారు. అప్పుడే నిర్ణ‌యించుకున్నారు ల‌క్ష్మ‌ణ‌రావు త‌న పుస్త‌కాల‌ను తానే ప్ర‌చురించుకోవాల‌ని. తాను క‌ష్ట‌ప‌డి దాచుకున్న ఏడువేల రూపాయ‌ల‌తో 1979లో త‌న మొద‌టి పుస్త‌కం నయీ దునియాకీ నయీ క‌హానీని ప్ర‌చురించారు. ఆపై, త‌న పుస్త‌కాన్ని త‌నే అమ్ముకోవాల్సిన ప‌రిస్థితి క‌నుక‌…ఇందుకోసం సైకిల్‌మీద లైబ్ర‌రీలు, స్కూళ్లు తిరిగేవారు. విప‌రీత శ్ర‌మ‌తో పుస్త‌కాల‌ను అమ్మాల్సి వ‌చ్చేది. ఇది ఆనాటి ప‌రిస్థితి…నేడు ల‌క్ష్మ‌ణ‌రావు ఏటా నాలుగు ర‌చ‌న‌లను 500 పుస్త‌కాల చొప్పున ప్ర‌చురిస్తున్నారు. త‌న టీస్టాల్లో నెల‌కు వంద పుస్త‌కాలు అమ్ముతుంటారు. మిగిలిన‌వి ఇ కామ‌ర్స్ వెబ్‌సైట్ల ద్వారా జ‌నంలోకి వెళుతున్నాయి. మంచి అమ్మ‌కాలూ జరుగుతున్నాయి. అంతేకాదు, ఆయ‌న‌కు ఎంతో పేరునూ తెచ్చిపెడుతున్నాయి. ఆయ‌న మొద‌టి పుస్త‌కం రాందాస్, మూడు ముద్ర‌ణ‌ల‌తో త‌న పుస్త‌కాల్లో అత్య‌ధికంగా అమ్ముడు పోయిన ర‌చ‌న‌గా నిలిచింది.

ల‌క్ష్మ‌ణ్‌రావు గురించి ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన ఒక వ్యాసాన్ని చ‌దివిన ఒక కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, ఆయ‌న‌కు, అప్ప‌టి ప్ర‌ధాని ఇందిరాగాంధీని క‌లుసుకునే అవ‌కాశం క‌ల్పించారు. ఇందిరాగాంధీ ల‌క్ష్మ‌ణ‌రావుని అభినందించి, ర‌చ‌న‌ల‌ను కొన‌సాగించ‌మ‌ని చెప్పారు. ల‌క్ష్మ‌ణ‌రావు, ఆమె జీవిత క‌థ‌ను రాయాల‌ని ఉంద‌ని, అనుమ‌తి కోర‌గా ఇందిర త‌న రాజ‌కీయ జీవితం గురించి వ్యాసాలు రాయాల్సిందిగా సూచించారు. ఆ ప్రోత్సాహంతో ప్ర‌ధాన‌మంత్రి అనే నాట‌కాన్ని రాశారు. దాన్ని తాను ఇందిరాగాంధీకి ఇవ్వాల‌నుకున్నాన‌ని, అయితే అంత‌లోనే దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఆమె హ‌త్య‌కు గుర‌య్యార‌ని ల‌క్ష్మ‌ణ‌రావు నాటి జ్ఞాప‌కాల‌ను చెబుతుంటారు.

ఒక‌వైపు ర‌చ‌న‌లు చేస్తూనే త‌న చ‌దువుని సైతం కొన‌సాగించారు. 40 ఏళ్ల వ‌య‌సులో సిబిఎస్‌సి సిల‌బ‌స్‌తో 12 వ‌త‌ర‌గ‌తి, ఢిల్లీ యూనివ‌ర్శిటీ నుండి ప్రయివేటుగా డిగ్రీ పూర్తి చేసి, ఇప్పుడు ఎమ్ ఎ హిందీ చ‌దువుతున్నారు. హిందీలో పుస్త‌కాలు రాసే ల‌క్ష్మ‌ణ‌రావు ఎక్కువ‌గా పుస్త‌కాలు కొంటుంటారు, చ‌దువుతుంటారు. ఆయ‌న రాసే పుస్త‌కాలు ఎక్కువ‌గా నిజ‌జీవిత క‌థ‌ల‌పై ఆధార‌ప‌డి ఉంటాయి. ఇందుకు సంబంధించి ఆయ‌న ఒక సంఘ‌ట‌న చెబుతారు. ఒక రోజు కొంత‌మంది కుర్రాళ్లు ఆయ‌న‌ స్టాల్ ముందు రేణు అనే త‌మ క్లాస్‌మేట్ గురించి మాట్లాడుకున్నారు. ఆమె ఎక్క‌వ‌గా మాట్లాడ‌ద‌నేది వారి మాట‌ల సారాంశం. ఆ విష‌యాన్ని వారి మాట‌ల ద్వారా తెలుసుకున్న ల‌క్ష్మ‌ణ‌రావు వారిద్వారా ఆ అమ్మాయిని క‌లుసుకుని, మాట్లాడారు. ఆమె క‌థ‌తోనే ఆమె పేరుతోనే రేణు అనే పుస్త‌కాన్ని రాశారు. ఈ పుస్త‌కాన్ని ఆయ‌న నాటి రాష్ట్ర‌ప‌తి ప్ర‌తిభాపాటిల్ కి బ‌హుక‌రించారు. ఆమె ఆ ర‌చ‌న ను ఎంతో మెచ్చుకున్నారు. కుటుంబంతో స‌హా రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌కి ర‌మ్మ‌ని ఆహ్వానించారు.

ఇప్ప‌టికీ ల‌క్ష్మ‌ణ‌రావు పుస్త‌కాలు రాస్తూనే ఉన్నారు, ప్ర‌చురిస్తూనే ఉన్నారు. కానీ టీషాపుని మూసే ఉద్దేశ్యం మాత్రం లేదంటారు. బుక్స్ ద్వారా వ‌చ్చిన ఆదాయాన్ని తిరిగి పుస్త‌క ప్ర‌చుర‌ణ‌ల‌కే ఖ‌ర్చుచేస్తున్నాను క‌నుక కుటుంబ పోష‌ణ‌కు టీ వ్యాపారం కావాలంటారు ఆయ‌న‌. ఆయ‌న కుమారులిద్ద‌రూ ఉన్న‌త చ‌దువులు చ‌దువుతున్నారు.

ఎవ‌రైనా ధ‌న స‌హాయం చేయ‌బోతే ల‌క్ష్మ‌ణ‌రావు తీసుకోరు…అందుకు బ‌దులుగా త‌న పుస్త‌కాన్ని కొన‌మ‌ని చెబుతారు. ఈ పెద్ద మ‌నిషిది ఎవ‌రికీ ఏ హానీ చేయ‌ని పుస్త‌క వ్య‌స‌నం…అక్షరాల‌తో స్నేహం….అన్నింటినీ మించి ఓ మంచి జీవిత ల‌క్ష్యం. ఎన్నో జీవితాల‌కు అక్ష‌ర రూపం ఇస్తున్న ఈయ‌న జీవిత చ‌రిత్ర,, వాట‌న్నింటికంటే ఎక్కువ‌గా అక్ష‌ర రూపం దాల్చేందుకు అర్హ‌త ఉన్న‌ది… ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచేది… అన‌డంలో ఏ మాత్రం అతిశ‌యోక్తి లేదు.

-వి.దుర్గాంబ‌

Advertisement

Similar News