ధనం " వివేకం (For Children)
ఇద్దరు మిత్రులుండేవాళ్ళు. వాళ్ళలో మొదటి మిత్రుడు ధనవంతుడు. ప్రపంచంలో అన్నిటికన్నా ధనమే ముఖ్యమని, ధనమే గొప్పదని అన్నాడు. రెండో మిత్రుడు వివేకవంతుడు. ప్రపంచంలో అన్నిటికన్నా వివేకమే గొప్పదని, ఎంత ధనవంతుడయినా వివేకానికి తలవంచక తప్పదని అన్నాడు. ఈ విషయమై వారి మధ్య ఎప్పుడూ చర్చలు జరిగేవి. ఏది గొప్పదని తేల్చుకోడానికి ఇద్దరూ ఎందర్నో సంప్రదించేవాళ్ళు. వాళ్ళు ఎవరివైపూ మొగ్గలేకపోయేవాళ్ళు. చివరికి ఒకరోజు మంత్రి దగ్గరికి వెళ్లి ధనం గొప్పదా? వివేకం గొప్పదా? తేల్చమన్నారు. అతను వివేకం గొప్పదని […]
ఇద్దరు మిత్రులుండేవాళ్ళు. వాళ్ళలో మొదటి మిత్రుడు ధనవంతుడు. ప్రపంచంలో అన్నిటికన్నా ధనమే ముఖ్యమని, ధనమే గొప్పదని అన్నాడు. రెండో మిత్రుడు వివేకవంతుడు. ప్రపంచంలో అన్నిటికన్నా వివేకమే గొప్పదని, ఎంత ధనవంతుడయినా వివేకానికి తలవంచక తప్పదని అన్నాడు.
ఈ విషయమై వారి మధ్య ఎప్పుడూ చర్చలు జరిగేవి. ఏది గొప్పదని తేల్చుకోడానికి ఇద్దరూ ఎందర్నో సంప్రదించేవాళ్ళు. వాళ్ళు ఎవరివైపూ మొగ్గలేకపోయేవాళ్ళు.
చివరికి ఒకరోజు మంత్రి దగ్గరికి వెళ్లి ధనం గొప్పదా? వివేకం గొప్పదా? తేల్చమన్నారు. అతను వివేకం గొప్పదని భావించేవాడైనా అటువేపు మొగ్గడానికి జంకాడు. ఎందుకంటే ప్రభువు ముందు, అతను తలవంచక తప్పదు.
చివరకు మిత్రులు రాజుగారి దగ్గరికే వెళ్ళారు. తమ మధ్య ఎప్పటినించో వున్న ఈ సమస్యను పరిష్కరించమని రాజుగారిని అడిగారు. రాజుగారు తనను పరీక్షించడానికి వచ్చిన వాళ్ళనే పరీక్షించడానికన్నట్లు మంత్రిని పిలిచాడు.
మంత్రి వచ్చాడు. ఇద్దరు మిత్రులు అక్కడ ఎందుకున్నారో తెలీలేదు. రాజుగారు మంత్రిని దగ్గరికి రమ్మని పిలిచి ‘మంత్రిగారూ! మీరు వెంటనే వీళ్ళని తీసుకెళ్ళి చెరసాలలో వేయండి. రేపు సాయంత్రం వీళ్ళని ఉరితీయండి’ అన్నాడు.
ఆ నిర్ణయంతో ఇద్దరు మిత్రులు అదిరిపోయారు. కోరికోరి ప్రాణాలు మీదికి తెచ్చుకున్నామే అని బాధపడిపోయారు. మంత్రి ఏం చేస్తాడు? రాజాజ్ఞను ధిక్కరించలేడు కదా! వాళ్లిద్దర్నీ తీసుకెళ్లి చెరసాలలో బంధించాడు.
సంపన్నుడు కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఇంత అర్థాంతరంగా తన జీవితం ముగిసిపోతున్నందుకు అల్లాడిపోయాడు. మిత్రునితో ”నన్ను ఈ ప్రాణాపాయం నించీ తప్పించిన వాడికి నా ఆస్తిలో సగభాగం రాసిస్తాను’ అన్నాడు. వివేకవంతుడు ‘ ఆసంగతి కాగితంలో రాసి సంతకం చేయి’ అన్నాడు. ధనవంతుడు అలా చేశాడు.
తరువాత జైలర్‌తో దయచేసి మంత్రిగారిని నేను రమ్మన్నానని చెప్పండి అన్నాడు వివేకవంతుడు.
మంత్రి అతని మాటని మన్నించి వచ్చాడు. అతను ‘మంత్రిగారూ! దయచేసి రేపు సాయంత్రం దాకా ఎందుకు? ఈరోజే మమ్మల్ని ఉరితీయండి’ అన్నాడు. మంత్రి ఆశ్చర్యంతో ‘ఎందుకు?’ అన్నాడు. వివేకవంతుడు ‘ఏంలేదు, నిరపరాధుల్ని చంపితే వాళ్ళు నరకానికి, నిరపరాధులు స్వర్గానికి వెళతారు. అందుకని త్వరగా వెళదామని’ అన్నాడు.
మంత్రి ఇద్దర్నీ తీసుకుని రాజుగారి దగ్గరకు వెళ్లాడు. వివేకవంతుడు మంత్రితో చెప్పినమాటలే చెప్పాడు. అట్లాగే తన మిత్రుడు తన ఆస్తిలో తనని రక్షించినవారికి సగం వాటా ఇస్తానన్న విషయమూ వివరించాడు.
మిత్రుణ్ణి, మంత్రిని సులభంగా బుట్టలో వేసిన వివేకవంతుని తెలివికి రాజు సంతోషించాడు. ఇద్దరికీ క్షమాభిక్ష ప్రకటించాడు. ‘వివేకమే ప్రపంచంలో గొప్పదని’ రాజు అన్నాడు.
మిత్రులు ఆస్తిని సమంగా పంచుకుని ఆనందంగా జీవించారు.
– సౌభాగ్య