దేశభక్తా....అబ్బో... మనకది చాలా పెద్ద పదం!
కాలేజీల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరినొకరు ఏరా, ఎమే అని సంబోధించుకుంటున్నారు, తల్లిదండ్రులను పిల్లలు మీరు అని గౌరవించడం ఎప్పుడో ఔటాఫ్ కల్చర్ అయిపోయింది…గురువులు తల్లిదండ్రులు ఎవరైనా సరే….పిల్లలను స్నేహితులుగానే చూడాలిప్పుడు. గౌరవ మర్యాదలకు, స్నేహభావానికి మధ్య ఉన్న రేఖ మరింత పలుచగా మారిపోతోంది. ఇప్పుడు ఏ వ్యక్తుల మధ్య అయినా సరే… ఉండాల్సింది ఒకే ఒక్కటి…అది కమ్యునికేషన్ మాత్రమే. కొలీగ్స్ బాస్, తల్లిదండ్రులు పిల్లలు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, ఇరుగుపొరుగు ఎవరైనా సరే…అంతా సమానమే…కాబట్టి గౌరవం, భక్తి, మర్యాద లాంటి పదాల స్థానంలో స్నేహం, సమానత్వం, కమ్యునికేషన్ ఈ […]
కాలేజీల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరినొకరు ఏరా, ఎమే అని సంబోధించుకుంటున్నారు, తల్లిదండ్రులను పిల్లలు మీరు అని గౌరవించడం ఎప్పుడో ఔటాఫ్ కల్చర్ అయిపోయింది…గురువులు తల్లిదండ్రులు ఎవరైనా సరే….పిల్లలను స్నేహితులుగానే చూడాలిప్పుడు. గౌరవ మర్యాదలకు, స్నేహభావానికి మధ్య ఉన్న రేఖ మరింత పలుచగా మారిపోతోంది. ఇప్పుడు ఏ వ్యక్తుల మధ్య అయినా సరే… ఉండాల్సింది ఒకే ఒక్కటి…అది కమ్యునికేషన్ మాత్రమే. కొలీగ్స్ బాస్, తల్లిదండ్రులు పిల్లలు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, ఇరుగుపొరుగు ఎవరైనా సరే…అంతా సమానమే…కాబట్టి గౌరవం, భక్తి, మర్యాద లాంటి పదాల స్థానంలో స్నేహం, సమానత్వం, కమ్యునికేషన్ ఈ పదాలు వచ్చి చేరాయి. సరిగ్గా కమ్యునికేట్ చేస్తే అసలు గొడవలే ఉండవని నమ్ముతున్నాం.
సరే….ఇన్ని మారిపోయినపుడు దేశభక్తి అనే పదంలో…దాన్ని అంటిపెట్టుకుని ఉన్న మన భావోద్వేగాల్లో మార్పులు వస్తాయా రావా…వస్తాయి…వచ్చితీరతాయి. మనమంతా ఇప్పుడు గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్ ల తరహాలో, కనీసం ఆకాలంలో జీవించిన సాధారణ పౌరుల స్థాయిలో దేశభక్తిని ప్రదర్శించలేము. అప్పుడంటే వారి ముందు దేశభక్తితో ముడిపడి ఉన్న ఒక మహోజ్వలమైన ఆశయం ఉంది అదే స్వాతంత్ర్య పోరాటం. కాబట్టి అప్పుడు దేశమంతా ఒక్కతాటిపై నడిచింది. భావోద్వేగాలకు వేవ్‌లెంగ్త్ లతో పనిలేదు, అందుకే…ఒక మేధావి, ఒక పామరుడు దేశభక్తిని ఒకేలా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఫీలింగ్స్ కి మేధస్సు అంతరాలు ఉండవు కాబట్టి. అలా అంతా ఒక్కటై దేశభక్తిని ప్రదర్శించారు…స్వాతంత్ర్యాన్ని సాధించారు. సరే ఇక మన విషయానికి వద్దాం….ఇప్పుడు మనకు అలాంటి దేశభక్తిని ప్రదర్శించే అవకాశం లేదు. ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే టివిల ముందు కూర్చుని మనవాళ్లు ఫోర్లు, సిక్స్ లు కొడుతుంటే కేకలు వేయడం, గెలిస్తే మేరా భారత్ మహాన్ అని సంబరాలు చేసుకోవడం మాత్రమే మనం ప్రదర్శించే దేశభక్తి. ఇప్పుడు మనం ఈ జనరేషన్ పిల్లలకు దేశభక్తి…అని మొదలుపెడితే వారు జీర్ణించుకోవడం కష్టం. అప్పుడు ఉన్న సిట్యుయేషన్ జాతి మొత్తం ఏకం కావాల్సిన పోరాటం కనుక అప్పుడు మన ఫీలింగ్స్ లో అత్యున్నత స్థాయి అయిన భక్తి కావాల్సి వచ్చింది. పైగా అప్పటి జనరేషన్‌కి భక్తి అనేపదంతో ఉన్న అనుబంధం కూడా ఎక్కువ. ఇప్పుడు కూడా భారత్, పాక్ సరిహద్దుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్న సైనికుల్లో ఉన్న భావాన్ని దేశభక్తి అనే అనాలి. కానీ దేశం లోపల ఉండి, మన జీవితాలు మనం యాంత్రికంగా బతికేస్తూ ఆగస్టు 15న స్వాతంత్ర్య పోరాటాన్ని, నాటి నాయకులను, వారి పోరాట గుణాలను గుర్తు తెచ్చుకునే మనకు దేశభక్తి అనే పదం చాలా పెద్దదే.
నిజానికి ఏ విషయాన్నయినా మనం అత్యున్నతంగా భావించినపుడు మాత్రమే భక్తి అవసరం. అంటే ఆ విషయాలు మన ప్రాణంతో సమానమై ఉండాలి. స్వాతంత్ర్య పోరాట సమయంలో ఉన్న పరిస్థితి అదేమరి. అయితే ఇప్పుడు మనం, దేశం పట్ల గౌరవం, ప్రేమ, అభిమానం, అన్నింటికీ మించి దేశం పట్ల ఒక బాధ్యత ఇవన్నీ ఫీలయితే చాలు. కులం, మతం, రాజకీయ పార్టీలు, భాషలు, పేద గొప్ప… ఇలా రకరకాల అడ్డుగోడలతో ఎప్పటికప్పుడు మనల్ని నిట్టనిలువుగా చీల్చే పరిస్థితులే మన చుట్టూ ఉన్ననేపథ్యంలో మనమంతా ఒకేదేశానికి చెందినవాళ్లమని గుర్తుంచుకోవడం కాస్త కష్టమే. మన వాళ్లు విదేశాల్లో గ్లోబల్ కంపెనీలకు సిఇఓలుగా ఎంపికై విజయబావుటా ఎగరేశారని, మన పిల్లలు తమ మేధస్సుతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారని, ఫలానా భారత సంతతి వ్యక్తి ఫలానా దేశంలో గొప్ప గుర్తింపులు, అవార్డులు పొందారని… ఇవన్నీ కాకుండా ప్రపంచ స్థాయి క్రీడల పోటీల్లో మనవాళ్లు గెలిచినపుడు, ర్యాంకులు సాధించినపుడు…..ఇలాంటి వార్తలు విన్నపుడు మాత్రమే మనం మన దేశం పట్ల ఒక్క క్షణం గర్వంగా ఫీలవుతాం. అయితే ఆ వార్త టివిలో చూసి బయటకు వచ్చిన క్షణానికే…పక్కింటి వాడి బంగాళానో, కారునో చూస్తే మనకు ఈర్ష్య పుడుతుంది. మన ఇండియనే కదా, బాగా పైకి వచ్చాడులే…అనే ఆనందం కలుగదు. అలాగే మన చుట్టూ ఎంతమంది నిరుపేదలు, ఇబ్బందుల్లో ఉన్నవారు కనబడుతున్నా అరే తోటి భారతీయుడిని ఆదుకుందాం…అనిపించదు. అందుకే దేశభక్తి అనేది చాలా పెద్దపదం. దాన్ని అందరం ఎప్పుడో ఒకసారి ఒక్క క్షణమైనా ఫీలవకుండా ఉండం. కానీ అంతకుమించి మనం చేయాల్సింది ఏమిటో మనకు క్లారిటీ లేదు.
ఇలాంటపుడే -దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్….అనే గురజాడ కవిత్వాన్ని మనం తలచుకుని తీరాలి. దేశమంటే మన పక్కింటివాడు, మన పొరుగింటివాడు, మన కొలీగ్, మన బాస్…మనతో రైల్లో ప్రయాణం చేసే తోటి ప్రయాణీకుడు, మన బంధువులు, రోడ్డుమీద మనకు ఎదురయ్యే ప్రతి మనిషీ….వీరందరిలో దేశముంది. వీరిని మనం మన కులపోడు, మన ప్రాంతం వాడు, మన చుట్టం…ఉన్నవాడు, లేనివాడు… ఇలాంటి విభజనలు లేకుండా చూడగలిగితే అప్పుడు మనకు మనుషుల్లో దేశం కనబడుతుంది. ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తులున్నారు…దేశం పట్ల బాధ్యత అంటే మనం నివసిస్తున్న సమాజం పట్ల బాధ్యతగా ఉండటమే. అలాంటివారు మనచుట్టూ చాలామందే ఉన్నారు. తాము సంపాదించిన దాంట్లో ఎంతోకొంత సమాజసేవకు ఖర్చుపెడుతున్నవారు, సామాజిక సేవా సంస్థల్లో భాగం పంచుకుంటూ సోషల్ సర్వీస్ చేస్తున్న యువతరం…ఇలాంటివారు ఎంతోమంది మనకళ్లముందు కనబడుతున్నారు.
సరిగ్గా వారం క్రితం….బిఎస్‌సి అగ్రికల్చర్ కౌన్సెలింగ్‌కి తల్లితో కలిసి బయలుదేరిన ఒక నిరుపేద అమ్మాయి, కోయంబత్తూర్‌లోని యూనివర్శిటీకి బదులు, చెన్నైలోని అన్నా యూనివర్శిటీకి చేరి అయోమయంలో ఉన్నపుడు…..అక్కడ మార్నింగ్ వాకింగ్ చేస్తున్న కొంతమంది పెద్దమనుషులు వారికి చేసిన సహాయం…వారికి విమాన టిక్కెట్లు కొని, కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న కాలేజి అధికారులకు ఫోన్లు చేసి వీరి సమాచారం అందించి, వాళ్లు ఫ్లయిట్ దిగగానే కాలేజికి తీసుకెళ్లేలా కారు మాట్లాడి…వారి చేతిలో కొంత డబ్బు ఉంచి….ఒక మనిషి తలచుకుంటే మరో మనిషికి ఎంత సహాయం చేయగలడో నిరూపించిన సందర్భం ఇది. ఇలాంటి సహాయాలు, సహృదయాలు బాధ్యతగా భావించడాలు…. లెక్కకుమించి పెరిగితే దేశం ఎందుకు బాగుండదు..అలా బాగుండేందుకు మన పరిధిలో మనం ఏంచేసినా అది దేశభక్తే. స్వాతంత్ర దినోత్సవం రోజున స్కూళ్లలో జెండా ఎగరేసి, వందేమాతరం, జనగణమన పాడేసి, చాక్‌లెట్లు ఇచ్చి పంపేయడం కంటే ఇలాంటి మానవత్వం మూర్తీభవించిన ఒక పది సందర్భాలను పిల్లలకు కథలుగా చెబితే బాగుంటుంది.
దేశభక్తి అంటే ఇదే…అని వారికి అర్థమయ్యే భాషలో చెబితే మరింత బాగుంటుంది…!
-వడ్లమూడి దుర్గాంబ