వదులు కోవడం (Devotional)
ఒక కోటీశ్వరుడు విపరీతంగా సంపాదించాడు. దేశంలో ఎవరి దగ్గరా లేనంత ఐశ్వర్యం అతని దగ్గరవుంది. కానీ అతను అశాంతితో అల్లాడిపోయాడు. శాంతికోసం, ఆనందం కోసం, సత్యం కోసం తపించాడు. తన దగ్గరున్న కోటానుకోట్ల విలువచేసే వజ్రాల్ని ఒక సంచిలో పెట్టుకుని సత్యాన్ని, ఆనందాన్ని అందించే గురువు కోసం బయల్దేరాడు. గుర్రం మీద ఎక్కి ఎన్నో ప్రాంతాలలో సరయిన గురువు కోసం అన్వేషించాడు. ఒక పట్టణ పొలిమేరలో ఒక చెట్టుకింద సర్వ సంగ పరిత్యాగి అయిన సూఫీ నివసిస్తున్నాడని, […]
ఒక కోటీశ్వరుడు విపరీతంగా సంపాదించాడు. దేశంలో ఎవరి దగ్గరా లేనంత ఐశ్వర్యం అతని దగ్గరవుంది. కానీ అతను అశాంతితో అల్లాడిపోయాడు. శాంతికోసం, ఆనందం కోసం, సత్యం కోసం తపించాడు. తన దగ్గరున్న కోటానుకోట్ల విలువచేసే వజ్రాల్ని ఒక సంచిలో పెట్టుకుని సత్యాన్ని, ఆనందాన్ని అందించే గురువు కోసం బయల్దేరాడు.
గుర్రం మీద ఎక్కి ఎన్నో ప్రాంతాలలో సరయిన గురువు కోసం అన్వేషించాడు. ఒక పట్టణ పొలిమేరలో ఒక చెట్టుకింద సర్వ సంగ పరిత్యాగి అయిన సూఫీ నివసిస్తున్నాడని, ఎందరికో ఆయన జ్ఞానదాత అని విన్నాడు. ఇన్నాళ్ళ తన అన్వేషణ ఫలించబోతోందని ఆ వ్యాపారికి అనిపించింది.
సాయంత్రమవుతోంది. వ్యాపారి పట్టణం పొలిమేర చేరాడు. చెట్టుకింద నిరాడంబరంగా, పాత బొంత భుజంపై వేసుకున్న సూఫీని చూశాడు. గుర్రం దిగి సంచి పక్కన పెట్టి గుర్రాన్ని చెట్టుకు కట్టేసి సూఫీకి అభివాదం చేశాడు.
సూఫీ ఆ వ్యాపారి కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళలో కదుల్తున్న అశాంతిని గమనించాడు.
వ్యాపారి “గురువు గారూ! నా పేరు విననివారు ఉండదు. లెక్కలేనంత సంపాదించాను. కానీ నాలో అంతులేని ఆందోళన, అశాంతి పేరుకున్నాయి. నాకు ఆనందాన్ని, ప్రశాంతతని మీరు ఇస్తే ఈ వజ్రాల సంచిని మీకు సమర్పించుకుంటాను. ఇది కోట్ల విలువచేసే వజ్రాల సంచి. దీంతో దాదాపు ఒక పట్టణాన్ని ఖరీదు చెయ్యవచ్చు. ఎట్లాగయినా నాకు మీరు సత్యమార్గాన్ని చూపాలి. ఆనందాన్ని నాకు అందివ్వాలి. దానికి ప్రతిఫలంగా ఈ అపార సంపదను మీకు సమర్పించుకుంటాను” అన్నాడు.
సూఫీ గురువులు చిత్రమయిన వాళ్ళు. వాళ్ళు ప్రశ్నలకు సమాధానమివ్వరు. చర్యల ద్వారా అనుభవానికి తెస్తారు.
ఆ సూఫీ గురువు వ్యాపారి చెప్పిన మాటలకు ఏమీ బదులివ్వలేదు. ఆయన మౌనంగా ఉండేకొద్దీ వ్యాపారి తన బాధను మరింత చెప్పుకోసాగాడు. తన వజ్రాల సంచిని వదులుకోడానికి సంసిద్ధతను వ్యక్త పరిచాడు.
సూఫీ గురువు హఠాత్తుగా లేచి ఆ వజ్రాల సంచిని తీసుకుని పట్టణం వేపు శరవేగంగా పరిగెట్టాడు.
ఆ చర్యతో వ్యాపారి అవాక్కయ్యాడు, ఒక సూఫీ గురువు, ఒక సత్యాన్ని, జ్ఞానాన్ని అందించే గురువు ఇట్లా వజ్రాలకు ఆశపడి దొంగగా మారుతాడా! అని ఆశర్యపోయి, జ్ఞానం, సత్యం, ఆనందం అన్నీ మరచిపోయి తన వజ్రాల సంచికోసం గురువు వెంట పరుగులు తీశాడు. సూఫీ గురువుకు ఆ పట్టణం పరిచితమైంది. సందులు, గొందులు బాగా తెలిసినవే. దాంతో మెరుపు తీగలా మాయమవుతూ వ్యాపారిని ముప్పు తిప్పలు పెట్టాడు.
వ్యాపారి “దొంగ!దొంగ! నా వజ్రాల సంచితో పారిపోతున్నాడు పట్టుకోండి” అని అరిచాడు. జనాలు గుంపుగా చేరి వ్యాపారిని విషయమడిగారు. చెట్టుకింద సన్యాసి తన డబ్బంతా దొంగిలించి పారిపోయాడని లబోదిబోమన్నాడు.
జనాలు వ్యాపారితోబాటు పట్టణమంతా వెతికారు. కానీ సూఫీ గురువు జాడలేదు.
చివరగా పొలిమేరలో ఉన్నాడేమో అని వెతికారు. చెట్టు కింద వజ్రాల సంచితో సూఫీ గురువు తాపీగా కూచుని ఉన్నాడు.
సూఫీ గురువు వజ్రాల సంచిని వ్యాపారికిచ్చి “ఇప్పుడు సంతోషం కలిగిందా?” అన్నాడు.
వ్యాపారి “ఇంత సంతోషం నా జన్మలో చూడలేదు” అన్నాడు.
సూఫీ గురువు “సంతోషం వజ్రాలసంచిలో ఉందనుకుంటున్నావు. అది చేజారితే బాధలో మునిగిపోయావు. సంతోషం, బాధ నీలోనే ఉన్నాయి. వాటిని వస్తువులకు ఆపాదించినంతవరకు నీకు దుఃఖం అనివార్యం” అన్నాడు.
వ్యాపారికి జ్ఞానోదయమైంది.
– సౌభాగ్య