మంత్రాల గిన్నె (For Children)

కైలాస్‌ పేదవ్యక్తి. కష్టపడి పనిచేసేవాడు. కానీ అది కరువుకాలం. కడుపునిండుగా తిండి కూడా దొరకని కష్టకాలం దాపురించింది. ఒకపూట తింటే ఇంకో పూట దొరకని పరిస్థితి. కైలాస్‌ నడవడానికే శక్తిలేకుండా తయారయ్యాడు. ఇక అతని భార్య కళ్ళు లోపలికి వెళ్ళి, ఎముకలు బయటపడి అతి దీనంగా తయారయింది. కనీసం భార్యకు కూడా తిండిపెట్టలేని బతుకు ఎందుకు అని భార్యకు చెప్పకుండా అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలో ఒక చెట్టుకింద కూర్చుని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే అడుగుల శబ్దం వినిపించింది. […]

Advertisement
Update:2015-08-14 18:32 IST

కైలాస్‌ పేదవ్యక్తి. కష్టపడి పనిచేసేవాడు. కానీ అది కరువుకాలం. కడుపునిండుగా తిండి కూడా దొరకని కష్టకాలం దాపురించింది. ఒకపూట తింటే ఇంకో పూట దొరకని పరిస్థితి. కైలాస్‌ నడవడానికే శక్తిలేకుండా తయారయ్యాడు.

ఇక అతని భార్య కళ్ళు లోపలికి వెళ్ళి, ఎముకలు బయటపడి అతి దీనంగా తయారయింది. కనీసం భార్యకు కూడా తిండిపెట్టలేని బతుకు ఎందుకు అని భార్యకు చెప్పకుండా అడవిలోకి వెళ్ళిపోయాడు.

అడవిలో ఒక చెట్టుకింద కూర్చుని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే అడుగుల శబ్దం వినిపించింది. చూస్తే ఒకసన్యాసి. కైలాస్‌ దగ్గరికి వచ్చి ఆసన్యాసి నిలబడి ‘ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగాడు.

కైలాస్‌ ‘మీరు ఆరుస్తారా? తీరుస్తారా? దరిద్రం నన్ను పట్టుకుంది’ అన్నాడు. సన్యాసి నవ్వి తన జోలెలోని ఒక రాగి గిన్నె నిచ్చి “నువ్వు దీన్ని స్వీకరించు. ఇది మంత్రాల గిన్నె. నువ్వు ఎంత ఆహారాన్ని కోరితే అంత ఆహారాన్ని ఇది ఇస్తుంది” అన్నాడు.

కైలాస్‌ ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు. నమ్మబుద్ధి కాలేదు. పరీక్షించి చూద్దామని తనకిష్టమయిన మాంసాన్ని కోరాడు. కోరిన మరుక్షణం మాంసం ప్రత్యక్షమైంది. అన్నం అడిగాడు. వచ్చింది. ఆవురావురుమని తిని సన్యాసికి కృతజ్ఞతలు చెప్పి ఇంటికి వెళ్ళాడు.

దారిలో దయనీయంగా ఉన్న ఒక గుడిసెలో దీనంగా ఏడుస్తున్న ఇద్దరు పసివాళ్ళ స్వరాలు విన్నాడు. వాళ్ళు ఆహారం కోసం అల్లాడుతున్నారు. ఆ పసిపిల్లల తల్లి ‘నాయనా! రేపు అన్నం పెడతాను. పడుకోండి’ అని సర్దిచెపుతోంది. పిల్లలు ఆకలితో అల్లాడుతున్నారు. కైలాస్‌ వాళ్ళ ఇంటి దగ్గర ఆగి ‘పిల్లలూ రండి, అన్నం పెడతాను’ అన్నాడు. పిల్లలు, తల్లి బయటికి వచ్చి అతన్ని ఇంటిలోకి ఆహ్వానించింది.

కైలాస్‌ తన గిన్నెతో రకరకాల వంటకాల్ని సృష్టించాడు. పిల్లలు ఆవురావురుమని తిన్నారు. ఈమధ్యలో పిల్లల తల్లి ఆ గిన్నె పైన మూత వేసి అలాంటి గిన్నెను తెచ్చి దాని స్థానంలో పెట్టి అసలు గిన్నెను దాచింది.

కైలాస్‌ అది గుర్తించలేదు. తన గిన్నె అనుకుని నకిలీ గిన్నెను తీసుకుని ఇంటికి వెళ్లాడు. సంతోషంతో భార్యను చూసి ‘నీకు ఏం తెచ్చానో చూడు’ అని గిన్నెను చూపాడు. ఆమె నాకు ఆ రాగి గిన్నెను చూపడానికా అంత ఉత్సాహం ప్రదర్శిస్తున్నావు’ అంది. కైలాస్‌ ‘పిచ్చిదానా! ఇది మామూలు గిన్నె కాదు. మంత్రాల గిన్నె. నీకు ఏ ఆహారం కావాలంటే ఆ ఆహారాన్ని ఇది ఇస్తుంది’ అన్నాడు.

ఆకలితో ఆరాటంతో ఉన్న ఆమె ఆవురావురుమని మనసులో మెదిలిన వంటకాలన్నిట్నీ కోరింది. కానీ ఏమీ జరగలేదు. దాంతో హతాశురాలయి ఆమె జలజలా కన్నీళ్లు కార్చింది. కైలాస్‌ గుండె బద్దలయి ఆ గిన్నెను తీసుకుని అడవిలోకి వెళ్ళి అదే చెట్టుకింద కూచున్నాడు. సన్యాసి జాడలేదు. చీకటిపడింది. ఆశ వదులుకుని తిరిగి ఇంటికి చేరాడు.

మరుసటి రోజు పొద్దున్నే మళ్ళీ కైలాస్‌ అడవిలోకి వెళ్ళాడు. అదే చెట్టు కింద కూచున్నాడు. ఆతృతగా యిటూ అటూ చూశాడు. అడుగుల సవ్వడి వినిపించింది. సన్యాసి అటు వచ్చాడు. కైలాస్‌ని చూసి ఆశ్చర్యంగా ‘ఏమైంది నాయనా! మళ్ళీ వచ్చావు?’ అన్నాడు.

‘స్వామీ! మీరిచ్చిన గిన్నె అన్నం ఇవ్వడం మానేసింది’ అన్నాడు. సన్యాసి అది అసంభవం. దాన్ని నాకు చూపు అన్నాడు.

కైలాస్‌ చూపించాడు.

సన్యాసి దాన్ని పరీక్షించి ‘ఇది నేను నీకు ఇచ్చిన గిన్నె కాదు. నా దగ్గర నించీ రెండు గిన్నెలు సంపాదించాలని పథకం వేశావా?’ అన్నాడు.

‘స్వామీ! అట్లాంటి దురాలోచన నాకు లేదు. ఇది మీరిచ్చిన గిన్నే’ అన్నాడు. సన్యాసి నిన్న జరిగిందంతా వివరించమన్నాడు. కైలాస్‌ ఒక పేద స్త్రీ ఇంటి దగ్గర ఆగి ఆమె పిల్లలకు ఆహారం పెట్టడం గురించి చెప్పాడు. సన్యాసి ఆ స్త్రీ ఈ గిన్నెను మార్చి ఉంటుంది. మళ్ళీ ఇంకో గిన్నెఇస్తాను. తీసుకెళ్ళు. నువ్వు కోరిన కోరికల్ని ఇది తీరుస్తుందని చెప్పు’ అన్నాడు. కైలాస్‌ ఆ గుడిసె దగ్గరకు వెళ్ళాడు. మొదట ఆ స్త్రీ భయపడింది. కానీ కైలాస్‌ ‘ఈ గిన్నె మన కోరిన కోరికలన్నిట్నీ తీరుస్తుంది’ అన్నాడు. ఆమె వెంటనే ఆ గిన్నె తీసుకుని కళ్ళు మూసుకుని మనసులో ఏవో కోరుకుంది. ఆమె మనసులో ఏమి కోరుకుందో ఏమో కానీ రెండు కట్టెలు ప్రత్యక్షమై ఆమె వీపును వాయగొట్టాయి. ఆమె ఎంత ఏడ్చినా అవి కొట్టడం ఆపలేదు.

చివరికి ఆమె ‘తప్పయింది. నేను దొంగిలించిన గిన్నె ఇచ్చేస్తా’ అంది. వెంటనే కట్టెలు అదృశ్యమయ్యాయి. కైలాస్‌ ఆ గిన్నె తీసుకుని ‘నేను రోజూ వచ్చి నీ బిడ్డలకు అన్నం పెడతాను’ అని తన ఇంటికి వెళ్ళాడు. అప్పుడు నిజంగా మంత్రాలగిన్నె నించీ మధుర భక్ష్యాలు సృష్టించి తన భార్యకు పెట్టాడు. ఆమె తృప్తిగా తిన్నది. భార్య కడుపు నిండా భోంచెయ్యడం చూసి భర్త కళ్ళలో ఆనందభాష్పాలు కదిలాయి.

– సౌభాగ్య

Tags:    
Advertisement

Similar News