ముత్యాలు (For Children)
అతని పేరు భోలానాథ్. అతను కాశ్మీర్ దేశపు రైతు. భూలోకస్వర్గం అని పిలవబడే కాశ్మీర్‌లో ఒకసారి కరువు వచ్చింది. పంటలు ఎండిపోయాయి. అందరూ బిచ్చగాళ్ళుగా మారారు. భోలానాథ్ కూడా బిచ్చమెత్తుకుంటూ బయలుదేరాడు. దారిలో ఒక ఆశ్రమం కనిపించింది. అందులో ఒక సన్యాసి కనిపించాడు. నమస్కరించాడు. ఆ సన్యాసి “నాయనా! నీకేమయినా సాయం చెయ్యగలనా?” అని అడిగాడు. భోలానాథ్ తన పరిస్థితి వివరించాడు. సన్యాసి ‘అడవి అంచులోని గ్రామంలో మా అమ్మాయి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆమెను కలిశావంటే […]
అతని పేరు భోలానాథ్. అతను కాశ్మీర్ దేశపు రైతు. భూలోకస్వర్గం అని పిలవబడే కాశ్మీర్‌లో ఒకసారి కరువు వచ్చింది. పంటలు ఎండిపోయాయి. అందరూ బిచ్చగాళ్ళుగా మారారు. భోలానాథ్ కూడా బిచ్చమెత్తుకుంటూ బయలుదేరాడు.
దారిలో ఒక ఆశ్రమం కనిపించింది. అందులో ఒక సన్యాసి కనిపించాడు. నమస్కరించాడు. ఆ సన్యాసి “నాయనా! నీకేమయినా సాయం చెయ్యగలనా?” అని అడిగాడు. భోలానాథ్ తన పరిస్థితి వివరించాడు.
సన్యాసి ‘అడవి అంచులోని గ్రామంలో మా అమ్మాయి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆమెను కలిశావంటే ఆమె నీ సమస్యను తీరుస్తుంది’ అని చెప్పాడు.
ఎంతో ఆశలో భోలానాథ్ ఆ గ్రామం వెళ్ళి సన్యాసి కూతుర్ని కలిశాడు. ఆమె అతనికి మర్యాద చేసింది. భోలానాథ్ తన పరిస్థితులు, దరిద్రం వివరించారు. అంతా విని ఆ అమ్మాయి భోరున విలపించింది. జలజలా కన్నీళ్ళు రాలాయి. ‘ఎంత వెన్నలాంటి మనసు’ అనుకున్నాడు భోలానాథ్. కిందపడిన కన్నీటి బొట్లన్నీ ముత్యాలుగా మారిపోయాయి. ఆ అమ్మాయి వాటన్నిట్నీ ఏరి ఇచ్చి వాటిని అమ్మి కావలసిన సరుకులు ఖరీదు చేయమంది.
బోలానాథ్ ఆశ్చర్యపడి ఆమె ఇచ్చిన ముత్యాలు తీసుకుని అంగళ్ళ దగ్గరికి వెళ్ళాడు. చిత్రమేమిటంటే అక్కడ ఎవరూ ఆ ముత్యాలు కొనడానికి సిద్ధంగా లేరు. కారణం అందరూ అతన్ని ఒకే ప్రశ్న వేశారు. ‘నిన్నటి దాకా నువ్వు అష్టదరిద్రుడివి. ఈరోజు ఉన్నట్లుండి ఇన్ని ముత్యాలు నీకెలా వచ్చాయి. నువ్వు ఎక్కడయినా దొంగతనం చేస్తే తప్ప అది వీలు కాదు’ అని అతన్ని బంధించి రాజు దగ్గరకు తీసుకువెళ్ళి వివరంగా జరిగింది చెప్పారు.
భోలానాథ్ ఆ ముత్యాలు తనకు ఎలా అందాయో కథంతా చెప్పాడు. కానీ రాజుకు అది నమ్మబుద్ధి కాలేదు. కన్నీళ్ళు ముత్యాలుగా మారడం కట్టుకథలా అనిపించింది. రాజు ‘సరే! నువ్వు ఇది నిజమంటున్నావు గనక నేనూ నీతోబాటు వస్తాను. కళ్ళారా చూసిగానీ నేను నమ్మను’ అన్నాడు. ఇద్దరూ కలిసి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళారు. ఆ అమ్మాయి వాళ్ళు వచ్చిన కారణం తెలుసుకుని గది నించీ బయటకే రాలేదు. రాజును కలవడానికి ఒప్పుకోలేదు. కానీ ఆ అమ్మాయి ఏడ్చింది. కన్నీళ్ళు ముత్యాలుగా మారాకా అవి రాజుకు అందజేసింది.
రాజు ఎంతో ఆశ్చర్యానికి లోనయి, ఆనందించి సన్యాసి ఆశ్రమానికి వచ్చి అతని కూతుర్ని తనకిచ్చి పెళ్ళి చెయ్యమన్నాడు. ఆ సన్యాసి ఎంతో సంతోషించి తన కూతుర్ని ఆశ్రమానికే రప్పించి రాజుకు, ఆమెకు పెళ్ళి చేశాడు. వివాహానంతరం రాజు తన రాజధానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు.
పెళ్ళి ఊరేగింపు అరణ్యమార్గం గుండా సాగింది. మేలిముసుగు ఉండడం వల్ల అప్పటిదాకా రాజు ఆమెను చూడలేదు. రాజు దగ్గర పనిచేసే ఒక చెలికత్తె దురుద్దేశంతో కొంతమంది సాయంతో రాజకుమారిని ఒక పెట్టెలో బంధించి నదిలో తోయించింది. తాను పెళ్ళికూతురు బట్టలు వేసుకుని పల్లకీలో కూచుంది.
నదిలో పెట్టెకొట్టుకుంటూ పోతోంటే అడవికి వచ్చిన కట్టెలు కొట్టే వ్యక్తి ఆ పెట్టెను నదినించీ ఒడ్డుకు లాగాడు. తీసిచూస్తే అందులో అందమైన అమ్మాయి స్పృహతప్పి పడి ఉంది. అతను మెల్లగా ఆమెను తన గుడిసెకు చేర్చాడు. ఆమెకు స్పృహ వచ్చింది. కానీ కళ్ళు లేవని తెలిసి వచ్చింది. పిల్లలు లేనివాడు గనక సొంత కూతురిలా ఆమెను చూసుకున్నాడు. ఆమె మెల్లగా కోలుకుంది. ఆమెకు ఏడుపు వస్తే కన్నీళ్ళు రాలి ముత్యాలుగా మారేవి. ఆశ్చర్యపడి చూస్తున్న అతన్తో ‘నాన్నా! ఇవి తీసుకెళ్ళి అమ్మి ఇంటికి కావలసినవి తీసుకురా!’ అంది. అతనామెను కన్నబిడ్డలా చూసుకున్నాడు.
క్రమక్రమంగా కట్టెలు కొట్టే అతను సంపన్నుడయ్యాడు. పెద్ద భవనంలోకి మారాడు. పొలాలుకొన్నాడు. పళ్ళతోటలు కొన్నాడు. ఖరీదయిన వస్త్రాలు ధరించాడు.
ఒకరోజు అతను ‘అమ్మా! నువ్వు ఎవరో ఆ పెట్టెలోకి ఎందుకు వచ్చావో ఆ విషయాలేవీ చెప్పలేదే’ అన్నాడు. దీనికి కారణమెవరు? నీకు చూపు వచ్చే మార్గం లేదా? అని అడిగాడు.
‘నాన్నా! ఇన్ని ప్రశ్నలకూ నేను సమాధానం చెప్పలేను. కానీ నాకు చూపు వస్తుందని మాత్రం చెప్పగల్ను’ అంది. ‘నన్నేం చెయ్యమంటావో చెప్పు’ అన్నాడు.
‘నాన్నా! పిడికెడు ముత్యాలు తీసుకుని రాజభవనానికి వెళ్ళు. అక్కడ ఒక చెలికత్తెకు ఇవి ఇచ్చి, రాజుగారి భార్యగా మారిన ప్రధాన చెలికత్తె కళ్ళు కావాలని అడుగు. నేను అవి పెట్టుకుంటే నాకు కళ్ళు వస్తాయి’ అంది. చాలా శ్రమపడి అతను కళ్ళు తీసుకొచ్చాడు. అవి పెట్టుకుంటే ఆమెకు కళ్ళు వచ్చాయి.
క్రమంగా కట్టెలు కొట్టే అతను దేశంలోనే సంపన్నుడయిన వ్యక్తి అయ్యాడు. సందేహించి రాజు అతన్ని పిలిపించాడు. అతను రాజుతో జరిగిన విషయమంతా వివరించాడు. తన భార్య ఇంత మోసగత్తా! చూపు కోల్పోయినా నిజం చెప్పలేదా! అని రాజు ఆగ్రహంతో నకిలీ భార్యకు మరణశిక్ష విధించాడు. అప్పుడు బాధలో కన్నీళ్లు పెట్టుకుంటే ముత్యాలకన్నీళ్లు రాలుస్తున్న నిజమైన భార్యను చూసి పరవశించాడు.
– సౌభాగ్య