వయసు వర్సెస్ ఆనందం!
మన జీవితాల్లో మ్యాజిక్ చేసేది మనసే కాదు, వయసు కూడా. సాధారణంగా ఎవరైనా తమ అసలు వయసు కంటే కాస్త తక్కువగా కనిపించాలనే చూస్తారు. అంతేకాకుండా మనుషులు, ఎంత వయసు పెరుగుతున్నా తామున్న వయసుకంటే మరో పదేళ్లకు అవతలే వృద్ధాప్యం ఉన్నట్టుగా ఫీలవుతుంటారట. అంటే అరవై ఏళ్ల వ్యక్తి దృష్టిలో వృద్ధాప్యం అంటే డెభ్బై…అలాగే డెబ్బైకి ఎనభై….. బాగుంది కదూ…ఇది మనసు చేసే మాయ. భూమ్మీద ఉండడానికి మనం ఇచ్చే విలువ అది. ఈ నేపథ్యంలోనే మన జీవితంలో యవ్వనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. వయసులో […]
మన జీవితాల్లో మ్యాజిక్ చేసేది మనసే కాదు, వయసు కూడా. సాధారణంగా ఎవరైనా తమ అసలు వయసు కంటే కాస్త తక్కువగా కనిపించాలనే చూస్తారు. అంతేకాకుండా మనుషులు, ఎంత వయసు పెరుగుతున్నా తామున్న వయసుకంటే మరో పదేళ్లకు అవతలే వృద్ధాప్యం ఉన్నట్టుగా ఫీలవుతుంటారట. అంటే అరవై ఏళ్ల వ్యక్తి దృష్టిలో వృద్ధాప్యం అంటే డెభ్బై…అలాగే డెబ్బైకి ఎనభై….. బాగుంది కదూ…ఇది మనసు చేసే మాయ. భూమ్మీద ఉండడానికి మనం ఇచ్చే విలువ అది. ఈ నేపథ్యంలోనే మన జీవితంలో యవ్వనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. వయసులో ఉన్నపుడే ప్రపంచాన్ని జయించేయాలనే జీవన సూత్రాలు చెబుతుంటాం.
వయసు విషయంలో మనం ఎలాంటి లాజిక్ లేకుండా ప్రపంచం చెప్పే ఫిలాసఫీని పాటించేస్తుంటాం. అందుకే వయసు పెరుగుతున్న కొద్దీ ఇక జీవితం అయిపోతుందనే ఫీలింగ్‌తో ఉంటాం. ఇక మీ పని అయిపోయింది…మీరు పక్కనుండండి… అనే సినిమా డైలాగులు జీవితంలోనూ వాడేస్తుంటాం. వయసుకీ, ఆనందానికి, జీవితం అనుభవించడానికి సంబంధం ఉందని కూడా భావిస్తుంటాం. మంచి ఆహారం తిని అరాయించుకోవడం, శరీరం శక్తివంతంగా ఉండటం, ఆపోజిక్ సెక్స్ ని ఆకర్షించగలగడం, ఎక్కడికైనా ప్రయాణాలు చేయగలగడం, ఎక్కువ సమయం పనిచేయగలగడం, కొత్త విషయాలు నేర్చుకునే శక్తి ఉండటం ఇవన్నీ…యవ్వనానికి చిహ్నంగా భావిస్తుంటాం కనుక, వయసు పెరుగుతున్న కొద్దీ ఈ ఆనందాలు ఉండవనే దృక్పథం ఉంటుంది.
సరే…ఇది నిజమేనా… అనే యాంగిల్లో ఒక్కసారి ఆలోచిద్దాం…. వయసులో ఉన్నపుడు జీవితం ఎందుకు బాగుంటుందంటే ఈ ప్రపంచంలో మనం అనుభవించాల్సినవి చాలా ఉన్నాయని, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయనే ఫీలింగ్‌తో ఉంటాం. శరీరమూ ఆరోగ్యం సైతం సహకరిస్తుంటాయి కాబట్టి అంతా ఆనందంగానే ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే… చేయడానికి కొత్త పనులు, సరికొత్తగా ఆలోచించే మెదడు, ఆరోగ్యవంతమైన శరీరం ఉన్నపుడు వయసులో ఉన్నవారికి, లేనివారికి తేడా ఏమిటో మనం ఆలోచించాలి.
అబ్దుల్ కలాం, అక్కినేని నాగేశ్వరరావు, మహాకవి శ్రీశ్రీ, చలం… ఇలాంటి వారు జీవితాంతం వయసుతో సంబంధం లేకుండానే వారి ఆలోచనలు, ఆశయాలు, చేస్తున్న పనులు… వీటి గుర్తింపుతో అత్యంత శక్తిమంతులుగానే జీవించారు. ఆఖరికి శరీరంలో కంటి రెప్పలు తప్ప ఏమీ కదపలేని ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ గురించి విన్నపుడు…ఆయన ఇంకా ఏం చేస్తాడో, విశ్వ పరిశోధనలో ఏ అద్భుతాలు సృష్టిస్తాడో అనే కుతూహలం తప్ప ఆయన మీద అయ్యోపాపం అని జాలి చూపించాలనే ఆలోచన రాదు, ఎందుకంటే ఆయన మనకంటే సమర్దుడు, మనకంటే చురుగ్గా పనిచేస్తున్నారు కనుక. ఇవన్నీ జీవితాన్ని, వయసునీ నిర్వచించడంలో మనలో కొత్త దృక్పధానికి తెరతీస్తాయి.
వయసు అనేది ఒక ఫీలింగ్ మాత్రమే….అనే మాటలో పూర్తిగా వాస్తవం లేదు కానీ, జీవితం, ఆనందం అనేవి మాత్రం తప్పకుండా ఫీలింగ్సే. ఎందుకంటే వయసు శరీరంలో మార్పులు తేవచ్చు కానీ, ఆనందంగా ఉండాలి అనే దృక్పథం మనలో ఉంటే… దాంట్లో మార్పులు తేలేదు. అయితే ఆనందం అనేది చిన్నతనంలో అమ్మానాన్న మనకోసం దాచి ఉంచిన ఫిక్స్ డ్ డిపాజిట్ లాంటిదా…లేదా దాన్ని ఎప్పటికప్పుడు మనమే సృష్టించుకోవాలా అనేది ప్రశ్న. చిన్నతనంలో అమ్మానాన్న ఇచ్చేది ఆనందం కాదు…ఆనందాన్ని అనుభవించే శక్తి. వారు, నువ్వు చాలా విలువైనవాడివి, నువ్వు చాలా చేయగలవు, చేయాలి, నీ జీవితానికో పర్పస్ ఉంది అనే ఆలోచనలు నింపితే మనలో ఆనందంగా ఉండగల శక్తి స్టోరయి ఉంటుంది. ఆ శక్తే మనకు కొత్త పనులను, చేస్తున్న పనుల్లో ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. అలాంటివారు వయసుతో సంబంధం లేకుండా జీవితం ఉన్నంతకాలం ఆనందంగా ఉంటారు. అందుకే ఆనందంగా ఉండగలగడం అనేది ఒక శక్తి అంటున్నాం. ఈ శక్తిని ఈ ఫీలింగ్ ని ఎవరూ కొలవలేరు. నీకు డెబ్భై ఏళ్లొచ్చినయి… కనుక ఇక నువ్వు ఆనందంగా ఉండొద్దు అని ఒక మనవడు ఒక తాతని అంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే, నువ్వు ఇక ఊపిరి పీల్చాల్సిన అవసరం లేదు అన్నంతగా. ఒక వికసిస్తున్న పువ్వుని చూసి ఆనందించగల శక్తి ఆ వృద్ధునిలో ఉంటే, ఆయన మనవడికంటే మానసికంగా శక్తివంతంగా ఉన్నట్టే లెక్క.
అందుకే మనం సాధారణీకరించి చూడకూడని అంశాల్లో తప్పకుండా వయసు ఉంటుంది. ముసలివాళ్లంతా ఉదయాన్నే మార్నింగ్ వాక్ చేసి వచ్చి వాలుకుర్చీలో కూర్చుని పేపరు చదువుకుంటూ కూతురో, కోడలో అందించే కాఫీ కప్పు కోసం ఎదురుచూడాలి అనే తీర్మానం…. ఏ రాజ్యాంగంలోనూ లేదు. కానీ రాజ్యాంగం కంటే బలమైన మన ఆలోచనా దృక్పథాల్లో దాన్ని మనం నమోదు చేసి పెట్టుకున్నాం. రాజ్యాంగానికైనా సడలింపులు, సవరణలు ఉంటాయేమో కానీ మన మనోభావాలకు ఉండవు. వయసు పెరగడం, జీవితం తగ్గిపోవడం ఇవి అందరికీ అనివార్యమే…కానీ దాన్ని చూసే విధానంలో మార్పు రావాలి. అప్పుడే వృద్ధాప్యానికి జాలిని, అసహ్యాన్ని, చులకనని కాకుండా గౌరవాన్ని, సహకారాన్ని జతచేసి చూడగలుగుతాం. ఎప్పుడూ మనం జీవితంలో ఎత్తుపల్లాలు, ఆటుపోట్లు, కష్టసుఖాలు లాంటి పదాలు వాడుతుంటాం కానీ, జీవితానికి ఒక రిథమ్ ఉంది, ఒక లయ ఉంది, ఒక శృతి, ఒక వేగం, ఒక రాగం, ఒక స్థిరత్వం, ఒక ధీరత్వం ఉన్నాయని చెప్పము. ఈ పదాలు వాడం. ఇంకా జీవితమో ఛాలెంజ్ అనో, సాహసమనో వర్ణిస్తుంటాం. అందుకే జీవితమంటే మనకు బాధలు భరించే వేదికగా మాత్రమే కనబడుతుంది. అందుకే మనం పెద్దరికాన్ని సహజంగా కాక భారంగా చూస్తున్నాం.
అందుకే మనం వయసు పెరుగుతున్నకొద్దీ ఆనందం తగ్గిపోతుంది, తగ్గిపోవాలి అనే గుడ్డి నమ్మకంతో ఉంటున్నాం. యవ్వనంలో ఉన్నపుడు జీవితం ఇచ్చే అనుభవాలను ప్రేమించడం మనకు తెలుసు. కానీ, వయసు పెరుగుతున్నా, ఎప్పటికప్పుడు జీవితం పట్ల ప్రేమతో, కొత్త అనుభవాలను సృష్టించుకునే శక్తి మాత్రం మనకు ఉండదు. ముఖ్యంగా వయసు విషయంలో మూస ఆలోచనలనుండి మనం బయటపడితే కానీ, మనకు పెద్దవారికి విలువ గౌరవం ఇవ్వాలనే విషయం అర్థం కాదు…. వయసు పెరుగుతున్న కొద్దీ మరింత ఆరోగ్యంగా, ఆనందంగా, సృజనాత్మకంగా మారిపోదాం అనే తపన అసలే రాదు… వృద్ధులను పట్టించుకోని, అవమానిస్తున్న, హేళన చేస్తున్న దేశాల్లో మన దేశం ముందువరుసలో ఉంది. ప్రస్తుతం మనదేశంలో పదికోట్ల మంది వృద్ధులు ఉన్నారు. రానున్న దశాబ్దాల్లో ఈ సంఖ్య మరింతగా పెరుగుతుంది. ఇందులో దాదాపు 65 శాతం మంది కుటుంబ, సమాజ అనాదరణకు గురవుతున్నవారే….. ఇది మరో ఆర్టికల్‌కి ముందుమాటలా అనిపించినా పైన చెప్పుకున్న అంశాలకు ఇది ముగింపు వాక్యం. వయసు పెరుగుదలపై మనకున్న భావాలు మారితే కానీ ఈ పరిస్థితిలో మార్పు రాదు.
-వడ్లమూడి దుర్గాంబ