అత్యాశ (Devotional)

కొందరికి డబ్బుమీద ఆశ, కొందరికి భూమిమీద ఆశ. ఆ వ్యాపారస్థునికి డబ్బుతో సమానంగా భూమి మీద కూడా ఆశ ఉంది. వీలయినంత ఎక్కువ భూమిని కొని పంటలు పండించి విపరీతంగా ధనం సంపాదించాలని, ప్రపంచంలో సాటిలేని సంపదగలవాడుగా పేరుపొందాలని అతని తపన. కొన్ని వందల వేల ఎకరాలు కొనాలని అతని సంకల్పం. ఒకేచోట అంత విస్తీర్ణంలో ఎక్కడ భూమి ఉంటుందా? అని వాకబు చేశాడు. హిమాలయపర్వతాల సానువుల్లో అంత విస్తీర్ణంలో భూమి ఉందని, దాన్ని ఎవరో కోయరాజు […]

Advertisement
Update:2015-08-12 18:31 IST

కొందరికి డబ్బుమీద ఆశ, కొందరికి భూమిమీద ఆశ. ఆ వ్యాపారస్థునికి డబ్బుతో సమానంగా భూమి మీద కూడా ఆశ ఉంది. వీలయినంత ఎక్కువ భూమిని కొని పంటలు పండించి విపరీతంగా ధనం సంపాదించాలని, ప్రపంచంలో సాటిలేని సంపదగలవాడుగా పేరుపొందాలని అతని తపన.

కొన్ని వందల వేల ఎకరాలు కొనాలని అతని సంకల్పం. ఒకేచోట అంత విస్తీర్ణంలో ఎక్కడ భూమి ఉంటుందా? అని వాకబు చేశాడు. హిమాలయపర్వతాల సానువుల్లో అంత విస్తీర్ణంలో భూమి ఉందని, దాన్ని ఎవరో కోయరాజు పాలిస్తాడని అక్కడికి వెళితే నీ కోరిక తీరవచ్చునని ఎవరో చెప్పారు.

వ్యాపారికి ఉత్సాహం కలిగింది. సుదీర్ఘ ప్రయాణం చేసి ఒక పట్టణంలో తినుబండారాలు, మిఠాయిలు తీసుకుని ఆ కోయరాజు దగ్గరికి వెళ్ళి తాను తెచ్చిన తినుబండారాలు ఇచ్చాడు. కోయరాజు వాటిని తిని వాటి రుచికి ఎంతో సంతోషించి “నువ్వు నానోరు తీపి చేశావు. నీకు ఏంకావాలో కోరుకో” అన్నాడు.

వ్యాపారి ఇదే సమయమని “నాకు కొన్ని వందల ఎకరాలు భూమి కావాలి. నేను కొనాలనుకుంటున్నాను” అన్నాడు.

కోయరాజు “దానికేమిభాగ్యం. నా దగ్గర వందల ఎకరాల నేల ఖాళీగా పడిఉంది. నాకు ఒకపైసా అవసరం లేదు. అదంతా నీకిస్తాను, సాగుచేసుకో” అన్నాడు.

వ్యాపారి ఎగిరి గంతేశాడు. కోయరాజు “అయితే ఒక షరతు. నువ్వు ఉదయాన్నే ఇక్కడి నుండి బయల్దేరి ఎంతదూరం వెళతావో వెళ్ళు. మళ్ళీ అక్కడి నుండి బయలు దేరి సాయంత్రానికి ఇక్కడికి చేరాలి. చేరితే నువ్వు ఎంతదూరం నడిచావో అంత భూమి నీ సొంతం” అన్నాడు.

వ్యాపారి సంతోషానికి పట్టపగ్గాల్లేకుండా పోయింది. నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరనుకున్నాడు.

మళ్ళీ ఆలస్యమవుతుందని బయల్దేరాడు అనడం కన్నా పరిగెత్తాడంటే బావుంటుంది. అతను కొంత స్థూలకాయుడు. రెండు ఫర్లాంగుల పరిగెత్తే సరికి చెమట పట్టింది. ఆయాసం వచ్చింది. కానీ తనముందు విస్తరించిన నేలను చూసి ఉత్సాహంపుంజుకుని పరుగెత్తాడు.

పోతూనేవున్నాడు. అలసిపోయాడు. కానీ ఆశ ఆగనివ్వలేదు. దాహం వేసింది. మధ్యాహ్నమయింది. కోయరాజు సాయంత్రం కల్లా తిరిగి రావాలని పెట్టిన షరతు గుర్తుకొచ్చింది.

మళ్ళీ తిరుగు ప్రయాణమయ్యాడు. దాహం వేసింది. నీరసం వచ్చింది. దగ్గర్లో ఒక నీళ్ళబావి కనిపించింది. మెట్లుదిగి లోపలికి దిగి నీళ్ళు తాగి మళ్ళీ పైకి వచ్చేసరికి పది పదిహేను నిముషాలు పడుతుంది. కానీ అంత సమయంలో కనీసం పది ఎకరాల నేల దాటవచ్చు.

ఆ ఆలోచన రాగానే నీళ్ళు తాగే ఆలోచన కట్టిపెట్టి ముందుకు సాగాడు. పడమటి కొండల అంచుల్ని సూర్యుడు తాకుతున్నాడు. ఆలస్యం చేస్తే తను గమ్యం చేరలేనని వేగం పెంచాడు.

చూస్తూవుండగానే సూర్యుడు కుంగిపోయాడు.

కనుచూపు మేరలో కోయరాజు సేవకుల్తో ఎదురు చూడ్డం కనిపించింది. ప్రాణాల్ని బిగబట్టి పరిగెత్తాడు వ్యాపారి. కానీ గమ్యం చేరకుండానే కిందపడి ప్రాణాలు వదిలాడు. కోయరాజు బాధపడి ఆరడుగుల గుంతతీసి వ్యాపారస్థుణ్ణి పాతిపెట్టారు.

(టాల్‌స్టాయ్‌ కథకు అనుకరణ)

– సౌభాగ్య

Tags:    
Advertisement

Similar News