ఇద్దరు కావలివాళ్ళు (Devotional)
మరణం తర్వాత ఆత్మ, శరీరం వేరువేరవుతాయి. అప్పుడు శరీరం అనుకుంటుంది “ఈ పాపం చేసింది ఆత్మ. అది వెళ్ళిపోతే నేను మాత్రం స్మశానంలో చలనం లేని రాయిలా పడిఉండాలి” అనుకుంటుంది. అప్పుడు ఆత్మ “అసలు తప్పుచేసింది శరీరం. ఏరోజు నేను దానినించీ వేరయ్యానో నేను ఆకాశంలో పక్షిలా గాలిలో తేలిపోతున్నాను” అనుకుంటుంది అన్నాడు శిష్యుడు. అది విని గురువు “నువ్వు చెప్పింది వింటే నాకో పిట్ట కథ గుర్తుకొస్తోంది” అని ఆ కథ చెప్పాడు. ఓ రాజుకు […]
మరణం తర్వాత ఆత్మ, శరీరం వేరువేరవుతాయి. అప్పుడు శరీరం అనుకుంటుంది “ఈ పాపం చేసింది ఆత్మ. అది వెళ్ళిపోతే నేను మాత్రం స్మశానంలో చలనం లేని రాయిలా పడిఉండాలి” అనుకుంటుంది. అప్పుడు ఆత్మ “అసలు తప్పుచేసింది శరీరం. ఏరోజు నేను దానినించీ వేరయ్యానో నేను ఆకాశంలో పక్షిలా గాలిలో తేలిపోతున్నాను” అనుకుంటుంది అన్నాడు శిష్యుడు. అది విని గురువు “నువ్వు చెప్పింది వింటే నాకో పిట్ట కథ గుర్తుకొస్తోంది” అని ఆ కథ చెప్పాడు.
ఓ రాజుకు మంచి ఆపిల్‌పండ్ల తోట ఉంది. దానికి ఆయన ఇద్దరు కావలివాళ్ళను నియమించాడు. వాళ్ళలో ఒకడేమో కుంటివాడు, ఒకడేమో గుడ్డివాడు. ఆ పళ్ళతోట ఆపిల్‌పళ్ళతో నిగనిగలాడింది. పళ్ళుకోసే సమయం వచ్చింది. ఎట్లాగూ రాజుగారు మనుషుల్ని పెట్టి పళ్ళు కోయిస్తాడు. ఆలోగా మంచి పళ్ళను కోసుకుని తింటే నష్టమేముందని కుంటివానికనిపించింది. అతను గుడ్డివాడితో “తోట నిండుగా యాపిల్ పళ్ళు కాచాయి. త్వరలో రాజు పళ్ళని తెంపి పట్టుకెళతాడు. ఈలోగా మనం కొన్ని పళ్ళను తిందామా?” అని అన్నాడు. గుడ్డివాడు “నిజమే! నువ్వన్నట్లు మనం కొన్ని పళ్ళను తెంపి తిందాం”. సరే! అన్నాడు. ఇప్పుడు సమస్య వచ్చింది. గుడ్డివాడికి పళ్ళెక్కడున్నాయో కనిపించదు. కుంటివాడేమో చెట్టెక్కి పళ్ళుకోయలేడు. ఇద్దరికీ ఒక ఆలోచన వచ్చింది. కుంటివాడు గుడ్డివాడి భుజాలపై ఎక్కి పళ్ళుకోస్తానన్నాడు. గుడ్డివాడు సరేనన్నాడు. కుంటివాడు గుడ్డివాడి భుజాలపైకెక్కి ఆపిల్ పళ్ళు కోశాడు. ఇద్దరూ కడుపారా తిన్నారు.
రాజుగారు తోటకు వచ్చి చెట్లను చూశాడు. ఒకచెట్లో ఆపిల్‌పళ్ళు తక్కువగా కనిపించాయి. కావలివాళ్ళను నిలదీశాడు. కుంటివాడు “రాజా! నేను చెట్టు ఎక్కలేను, నేనెలా పళ్ళుకోస్తాను?” అన్నాడు. గుడ్డివాడు “రాజా! నాకు కళ్ళేకనిపించవు, నేను పళ్ళెలాకోస్తాను” అన్నాడు.
వాళ్ళు అబద్ధాలాడుతున్నారని రాజు గ్రహించి కుంటివాడిని గుడ్డివాడి భుజాలపై ఎక్కించి పళ్ళుకోయమన్నాడు. ఆవిధంగా దొంగలు దొరికిపోయారు. ఈ కథ చెప్పి గురువు” శరీరము, ఆత్మ అలాంటివే. రెండూ కలిసే తప్పుచేస్తాయి. రెంటికీ శిక్ష తప్పదు” అన్నాడు.
– సౌభాగ్య