నక్క-పులి (Devotional)
అడవిలో ఒక నక్కకి ప్రమాదంలో రెండు కాళ్ళు విరిగాయి. అది జంతువుల్ని వేటాడే పరిస్థితిలో లేదు. కానీ జీవిస్తోంది. ఒకసారి ఒక మనిషి దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. జంతువుల్ని వేటాడలేని స్థితిలో వున్నా అదెలా జీవిస్తోందో అతనికి అర్థం కాలేదు. అంతలో పులి గాండ్రింపు వినపడింది. అతను చెట్ల వెనక దాక్కున్నాడు. పులి ఒక జింకను చంపి లాక్కుంటూ వచ్చింది. అది తిన్నంత తిని మిగిలింది వదిలేసి వెళ్ళింది. నక్కిన నక్క బయటకువచ్చి మిగిలిన జింక మాంసాన్ని […]
అడవిలో ఒక నక్కకి ప్రమాదంలో రెండు కాళ్ళు విరిగాయి. అది జంతువుల్ని వేటాడే పరిస్థితిలో లేదు. కానీ జీవిస్తోంది.
ఒకసారి ఒక మనిషి దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. జంతువుల్ని వేటాడలేని స్థితిలో వున్నా అదెలా జీవిస్తోందో అతనికి అర్థం కాలేదు. అంతలో పులి గాండ్రింపు వినపడింది. అతను చెట్ల వెనక దాక్కున్నాడు.
పులి ఒక జింకను చంపి లాక్కుంటూ వచ్చింది. అది తిన్నంత తిని మిగిలింది వదిలేసి వెళ్ళింది. నక్కిన నక్క బయటకువచ్చి మిగిలిన జింక మాంసాన్ని ఎముకల్ని తిన్నది.
ఇట్లా రెండు మూడు సార్లు జరిగింది.
మనిషి జరిగిన తంతు గమనించాడు.
“దేవుడు దయా మయుడు. ఎవరికి కావాల్సిన ఆహారాన్ని వాళ్ళకు ఆయన సమకూరుస్తాడు. కాళ్ళు లేకుండా కదలలేని నక్కకు కూడా దాని దగ్గరకే ఆహారాన్ని తెచ్చియిస్తున్నాడు. ప్రపంచంలో జీవకోటిమనుగడ ఆయన మీదే ఆధారపడి ఉంది” అని మనిషి దేవుడిపట్ల కృతజ్ఞత ప్రకటించాడు.
మనిషికి వున్నట్లుండి ఒక ఆలోచన వచ్చింది.
“నేను కూడా దేవుడి పట్ల విశ్వాసంతో ఉన్నాను. నా అవసరాలు ఆయనకు తెలుసు. నా ఆకలి ఆయనకు తెలుసు. కాళ్ళు లేని నక్కకు కడుపునిండా తిండిపెట్టే భగవంతుడు కరుణామయుడు. నేను ఎక్కడికో వెళ్ళడమెందుకు? ఇక్కడనే కూచుంటాను. నేనూ దైవసృష్టిలో భాగాన్నే. దేవుడు అన్నీ నాకు సమకూరుస్తాడు” అని అతను దృఢ నిశ్చయంతో దేవుని దయపట్ల గాఢమైన విశ్వాసంతో ఒక దగ్గర కదలకుండా కూచున్నాడు.
ఒకరోజు గడిచింది, రెండ్రోజులయ్యాయి, వారమయింది.
దేవుడు అతనికి ఎట్లాంటి సాయమూ చెయ్యలేదు.
పది రోజులయ్యాయి. ఎముకలు బయటపడ్డాయి. బక్కచిక్కిపోయాడు.
కళ్ళలో ప్రాణాలు పెట్టుకున్నాడు. దేవుడు తనపట్ల ఎందుకింత నిర్దయగా ప్రవర్తిస్తున్నాడో అతనికి అంతుపట్టలేదు.
అతను ఆకాశంలోకి చూసి “దేవా! కాళ్ళులేని నక్కకు కడుపునిండా తిండి పంపించే నువ్వు నన్ను దయచూడవా?” అని ఆక్రోశించాడు.
ఆకాశంనించీ “కాళ్ళులేని నక్కను నువ్వు ఆదర్శంగా తీసుకున్నావు. దానికి ఆహారాన్ని తీసుకొచ్చిన పులిని ఎందుకు నువ్వు ఆదర్శంగా తీసుకోలేదో ఆలోచించు” అన్న మాటలు వినిపించాయి.
– సౌభాగ్య