బాణాసురుడు (For Children)

ఎవరికైనా రెండు చేతులు ఉంటాయి! శక్తిపరులైన దేవతలకు నాలుగు చేతులుంటాయి! కాదంటే ఎనిమిది చేతులుంటాయి! పదహారు చేతులుండడం యెక్కువ! కాని బాణుడనే అసుర జాతికి చెందిన బాణాసురుడికి వెయ్యి చేతులుంటాయి! అంత బల శాలి. బలి కుమారుడే బాణాసురుడు! శివభక్తుడు. శివుణ్ణి పూజించి ఆరాధించి ప్రసన్నం చేసుకున్నాడు. ప్రత్యక్షమయిన శివుడు యేం వరం కావాలో కోరుకొమ్మన్నాడు. శత్రుభయమున్న బాణాసురుడు ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి శివుణ్ణే సతీసమేతంగా తన నగరానికి వచ్చి కాపురం ఉండమని కోరాడు. దాంతో బాణుడు […]

Advertisement
Update:2015-08-02 18:32 IST

ఎవరికైనా రెండు చేతులు ఉంటాయి! శక్తిపరులైన దేవతలకు నాలుగు చేతులుంటాయి! కాదంటే ఎనిమిది చేతులుంటాయి! పదహారు చేతులుండడం యెక్కువ! కాని బాణుడనే అసుర జాతికి చెందిన బాణాసురుడికి వెయ్యి చేతులుంటాయి! అంత బల శాలి. బలి కుమారుడే బాణాసురుడు!

శివభక్తుడు. శివుణ్ణి పూజించి ఆరాధించి ప్రసన్నం చేసుకున్నాడు. ప్రత్యక్షమయిన శివుడు యేం వరం కావాలో కోరుకొమ్మన్నాడు. శత్రుభయమున్న బాణాసురుడు ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి శివుణ్ణే సతీసమేతంగా తన నగరానికి వచ్చి కాపురం ఉండమని కోరాడు. దాంతో బాణుడు నివాసముంటున్న శోణపురానికి శివపార్వతులు వచ్చి ఉన్నారు!.

అంతటితో బాణాసురుడికి భయంపోయింది. భయం స్థానంలో అహం చోటుచేసుకుంది. అహం వల్ల మాట మారింది. మొక్కిన శివునితోనే “నాతో పోరాడేవాడెవడూ నాకూ కనిపించడం లేదు. నా చేతులకు పని లేకుండా ఉంది. నీవే నాతో యుద్ధానికి రాకూడదూ?” అన్నాడు. “నీ చేతులకు పని చెప్పేవాడూ పనిపట్టేవాడు ఉన్నాడు. నీ గర్వం నువ్వే మోయలేనప్పుడు వస్తాడు. వెళ్ళు…” అన్నాడట శివుడు!.

అయితే – బాణాసురునికి ఒక కూతురుంది కదా, ఆమె పేరు ఉషా. ఆ ఉషకి కలవచ్చింది. కలలో అందగాడు కనిపించాడు. కవ్వించాడు. చెలిమి చేసాడు. ఆమాటే చెలికత్తె చిత్రరేఖకు చెప్పింది. చిత్రరేఖ రాజకుమారుల చిత్రాలను గీస్తే అందులో అతణ్ణి పోల్చుకుంది. అతడు అనిరుధుడని చెప్పింది. చెప్పడమే కాదు నిద్రలో ఉన్న అతణ్ణి తెలియకుండా తెచ్చి అంతఃపురంలో ఉంచింది చిత్రలేఖ. అనిరుధుని వల్ల ఉష నెల తప్పింది. ఈ విషయం బాణాసురుడికి తెలిసింది. భగభగమండాడు. అంతఃపురానికి వెళ్ళి నాగపాశంతో అనిరుధుణ్ణి బంధించాడు. ఈ కబురు నారదుని వల్ల కృష్ణునికి తెలిసింది. కృష్ణుడు సైన్యాన్ని వెంటేసుకొని శోణపుర నగరానికి వచ్చాడు. అనిరుధుని నాగపాశం నుండి విడిపించమని బాణాసురుణ్ణి కోరాడు. కాని బాణాసురుడు అందుకు ఒప్పుకోలేదు.

బాణాసురుని తిరస్కారంతో సమస్య జటిలమయింది. శ్రీకృష్ణుడు బాణాసురుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. బాణాసురుడూ తగ్గలేదు. వేయి బాహువులతో తనబలాన్ని చూపించబోయాడు. బాణాసురుడి వేయి చేతుల్ని శ్రీకృష్ణుడు నరికేసాడు! అహం ఆవిరైంది! అహంతోపాటు ఆయువు తీయబోయిన శ్రీకృష్ణుణ్ణి శివుడు వారించాడు. ప్రాణాలు విడవమని కోరాడు. శివుని కోర్కె తీర్చాడు కృష్ణుడు!.

అలా ప్రాణాలతో బయటపడ్డ బాణాసురుడు ప్రాణ సమానమైన కూతురు ఉషని అనిరుధునికి ఇచ్చి పెళ్ళి చేసాడు!

బలికి ఆశకూ పుట్టినవాడే బాణాసురుడని భాగవతకథ చెప్తోంది!.

– బమ్మిడి జగదీశ్వరరావు

Tags:    
Advertisement

Similar News