ప్రయాణం (Devotional)
ఒక వ్యక్తి సమస్యల్లో చిక్కుకున్నాడు. అతను తను ఈ సమస్యల్నించి బయటపడితే తన ఇల్లు అమ్మేసి ఆ డబ్బంతా పేదవాళ్ళకు ఇచ్చేస్తానని ప్రమాణం చేశాడు. కొన్నాళ్ళకు అతను సమస్యలనించీ బయటపడ్డాడు. కానీ కష్టకాలంలో తాను ఆవేశపడి చేసుకున్న నిర్ణయం గుర్తుకొచ్చింది. ఇల్లు అమ్మి ఆ డబ్బంతా చూస్తూ పేదవాళ్ళకు ధారపోయడానికి మనస్కరించలేదు. కానీ ప్రమాణం ప్రమాణమే. పామూ చావకుండా కట్టెవిరక్కుండా ఏదయినా పథకం వేయాలి అని ఆలోచనలో పడ్డాడు. మొత్తానికి ఆలోచనతట్టింది. ఇంటిని ఒక వెండి నాణేనికి […]
ఒక వ్యక్తి సమస్యల్లో చిక్కుకున్నాడు. అతను తను ఈ సమస్యల్నించి బయటపడితే తన ఇల్లు అమ్మేసి ఆ డబ్బంతా పేదవాళ్ళకు ఇచ్చేస్తానని ప్రమాణం చేశాడు.
కొన్నాళ్ళకు అతను సమస్యలనించీ బయటపడ్డాడు. కానీ కష్టకాలంలో తాను ఆవేశపడి చేసుకున్న నిర్ణయం గుర్తుకొచ్చింది. ఇల్లు అమ్మి ఆ డబ్బంతా చూస్తూ పేదవాళ్ళకు ధారపోయడానికి మనస్కరించలేదు. కానీ ప్రమాణం ప్రమాణమే. పామూ చావకుండా కట్టెవిరక్కుండా ఏదయినా పథకం వేయాలి అని ఆలోచనలో పడ్డాడు.
మొత్తానికి ఆలోచనతట్టింది.
ఇంటిని ఒక వెండి నాణేనికి బేరానికి పెట్టాడు. అయితే దాంతోబాటు ఒక పిల్లిని కూడా కొనాలి. పిల్లి ఖరీదు మాత్రం పదివేలు.
ఒకవ్యక్తి ఇంటిని దాంతోపాటు పిల్లిని కొనడానికి ముందుకొచ్చాడు. ఒక వెండినాణేన్ని ఇచ్చి ఇంటిని, పదివేల వెండి నాణేల్ని ఇచ్చి పిల్లిని కొన్నాడు.
ఇతను ఆ డబ్బును తీసుకున్నాడు. ఒక వెండినాణేన్ని పేదవాడికి దానం చేశాడు. తను ఇంటిని అమ్మిన ధనాన్ని ధర్మం చేసినట్లు మనసులో అనందించాడు. పదివేల వెండి నాణేల్ని జోబులో వేసుకున్నాడు.
తప్పుపట్టడానికి తర్కం ఒప్పుకోదు కదా! ఎవరూ దాన్ని నిరూపించలేరు కదా!
చాలామంది మనుషులు చేసే పనులు ఇలానే ఉంటాయి. అన్ని నిర్ణయాల్ని మనుషులు తమకు అనుకూలంగా మలచుకుంటూ ఉంటారు.
లోతుల్లో ఆలోచిస్తే చేసినపని తప్పే. ప్రయోజనాన్ని సంతృప్తి పరచాలంటే ఆత్మవంచన అనివార్యం.
పుణ్యక్షేత్రాల్లో భక్తులు దైవానికి ముడుపులు చెల్లించుకోవడంలో ఇలాంటివన్నీ చూడొచ్చు.
– సౌభాగ్య