మరణ స్పృహ (Devotional)

ఒక సన్యాసి సముద్రప్రయాణం చేస్తున్నాడు. పడవ ఎక్కే ప్రతి ఒక్కరూ సన్యాసికి అభివాదం చేసి ఆయన సలహా అడిగేవాళ్ళు. ఆయన అందరికీ ఒకే సలహా ఇచ్చాడు. అదేమిటంటే “మరణం పట్ల స్పృహతో వుండడానికి ప్రయత్నించండి. మీకు మరణం గురించి తెలిసేదాకా అలాగే ప్రయత్నించండి” అని. కొంతమందికి ఆయన చెప్పిన మాటల్లో ఆకర్షణ కనిపించింది. అంతలో గొప్ప తుఫాను ప్రారంభమయింది. సముద్రంలో అల్లకల్లోలం ఆరంభమయింది. అలలు ఆకాశానికి ఎగిసిపడ్డాయి. పడవ అటూఇటూ కదుల్తూ తలకిందులవుతుందేమో అనిపించింది. పడవలో జనం […]

Advertisement
Update:2015-08-01 18:31 IST

ఒక సన్యాసి సముద్రప్రయాణం చేస్తున్నాడు. పడవ ఎక్కే ప్రతి ఒక్కరూ సన్యాసికి అభివాదం చేసి ఆయన సలహా అడిగేవాళ్ళు. ఆయన అందరికీ ఒకే సలహా ఇచ్చాడు.

అదేమిటంటే “మరణం పట్ల స్పృహతో వుండడానికి ప్రయత్నించండి. మీకు మరణం గురించి తెలిసేదాకా అలాగే ప్రయత్నించండి” అని. కొంతమందికి ఆయన చెప్పిన మాటల్లో ఆకర్షణ కనిపించింది.

అంతలో గొప్ప తుఫాను ప్రారంభమయింది. సముద్రంలో అల్లకల్లోలం ఆరంభమయింది. అలలు ఆకాశానికి ఎగిసిపడ్డాయి. పడవ అటూఇటూ కదుల్తూ తలకిందులవుతుందేమో అనిపించింది.

పడవలో జనం ప్రాణ భయంతో విలవిల లాడిపోయారు. మోకాళ్ళమీద కూచుని దేవుణ్ణి ప్రార్థించారు.

అంతసేపూ సన్యాసి ఆందోళన పడకుండా నిర్మలంగా, నిశ్చలంగా ఒకచోట కూచుని ఉన్నాడు. ఆయన్లో ఎటువంటి ఆందోళనా లేదు. అల్లకల్లోల సముద్రం మధ్య చలనం లేకుండా ఉండిపోయాడు.

కాసేపటికి తుఫాను నిష్క్రమించింది. అలలు శాంతించాయి. పడవ సాఫీగా సాగింది. అందరూ నిట్టూర్చారు. అప్పుడు కదలిక లేకుండా కూచుని వున్న సన్యాసిని చూశారు.

ఒక వ్యక్తి సన్యాసి దగ్గరకు వెళ్ళి “ఈ భయంకరమయిన తుఫానులో మనకు మరణానికి మధ్య బలమైన చెక్కబల్ల ఆహ్వానం పలుకుతున్నట్లు అనిపించింది” అన్నాడు.

సన్యాసి “అవును. సముద్రంలో ప్రయాణిస్తున్నపుడు ఎప్పుడూ అలాగే ఉంటుంది. అంతేకాదు నేను నేలమీద ఉన్నపుడు కూడా చిన్నిచిన్ని సంఘటనల్లోనూ మరణం మరింత సన్నిహితంగా ఉన్నట్లు అనుభూతి చెందుతూ ఉంటాను” అన్నాడు.

– సౌభాగ్య

Tags:    
Advertisement

Similar News