కాళీయుడు (For Children)
కాళీయ మర్ధనం యెవరు చేసారో గుర్తుంది కదా?, ఔను కృష్ణుడే చేసాడు! ఎందుకు చేసాడంటే… అసలు కాళీయుడెవరో అతని కథేమిటో తెలియాలి! కాళింది మడుగున వున్న విషసర్పం పేరే కాళీయుడు! కాళీయుడు చిమ్మిన విషం వల్ల నీళ్ళన్నీ విషతుల్యమయ్యాయి. ఆ నీళ్ళు తాగిన వాళ్ళు చనిపోయారు. ఆ నీటిలో వున్న చేపలూ తాబేళ్ళూ వంటి జీవరాసులెన్నో చనిపోయాయి. కాళింది మడుగులోకి దిగాలంటేనే జనం భయపడిపోయారు. కాళింది మడుగునే కాళీయుడున్నాడు. దాక్కున్నాడు! కాళీయుడు కాళింది మడుగున దాక్కోవడం వెనుక […]
కాళీయ మర్ధనం యెవరు చేసారో గుర్తుంది కదా?, ఔను కృష్ణుడే చేసాడు! ఎందుకు చేసాడంటే… అసలు కాళీయుడెవరో అతని కథేమిటో తెలియాలి!
కాళింది మడుగున వున్న విషసర్పం పేరే కాళీయుడు! కాళీయుడు చిమ్మిన విషం వల్ల నీళ్ళన్నీ విషతుల్యమయ్యాయి. ఆ నీళ్ళు తాగిన వాళ్ళు చనిపోయారు. ఆ నీటిలో వున్న చేపలూ తాబేళ్ళూ వంటి జీవరాసులెన్నో చనిపోయాయి. కాళింది మడుగులోకి దిగాలంటేనే జనం భయపడిపోయారు. కాళింది మడుగునే కాళీయుడున్నాడు. దాక్కున్నాడు!
కాళీయుడు కాళింది మడుగున దాక్కోవడం వెనుక కథ ఉంది. కద్రువ కడుపున పుట్టిన కాళీయుడు మొదట రమణక ద్వీపంలోనే ఉండేవాడు. అక్కడున్న పాముల్ని చూసి జనం భయపడిపోయారు. వాటికి కావలసిన ఆహారం ఇస్తే తమ జోలికి రావని భావించారు. అందుకే ప్రతిరోజూ ఆహారాన్ని తీసుకొచ్చి చెట్ల మొదళ్ళ దగ్గర పెట్టేసి వెళ్ళిపోయేవారు. దాంతో పాములు జనం మీదకి వెళ్ళేవికావు. కాని పాముల్ని చూసి జనం భయపడినట్టే – గరుడుని చూసి పాములూ భయపడేవి. అందుకే తమకి జనం పెట్టిన ఆహారంలో కొంత భాగం తీసి గరుడుడికి ఇచ్చేవి. దాంతో గరుడుడు పాములజోలికి వెళ్ళేవాడు కాదు. అయితే కాళీయుడు గరుడుడికి కేటాయించి పెట్టిన ఆహారాన్ని వదలకుండా తనే తినేవాడు. ఈ సంగతి గరుడుడికి తెలిసింది. కోపం వచ్చింది. కక్ష పెరిగింది. కాళీయుడు కోసం గరుత్మంతుడు వెదికాడు. వెంటాడి వేటాడ బోయాడు. కాళీయుడు భయపడ్డాడు. పారిపోయి వచ్చి కాళింది మడుగున స్థిరపడ్డాడు. గరుత్మంతునికి తెలిసినా కాళీయుడు ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటే గరుత్మంతుడు కాళింది మడుగుకి వచ్చాడా చచ్చాడే! అలాంటి శాపముంది. ఆ శాపం కాళీయుడికి తెలిసింది. గరుత్మంతుడు తననేమీ చేయలేడని మరింత గర్వపడ్డాడు కాళీయుడు!
కాళింది మడుగు ఉన్నా దాంట్లోకి పెద్దలు దిగనివ్వక పోవడం, జరిగిన నష్టం యెరిగి కృష్ణుడు ఊరుకోలేదు. మడుగు పక్కనే వున్న చెట్టు ఎక్కాడు. ఆ చెట్టుకొమ్మలు మడుగులో తమ నీడ చూసుకుంటుంటే – కొమ్మ మీదుగా వచ్చిన కృష్ణుడు కాళీయుని జాడ చూసుకున్నాడు. మిత్రులు వారించినా వినలేదు. అద్దంలా మెరిసే నీళ్ళలో కాళీయుడు పడగ విప్పి కనిపిస్తూ ఉండడంతో అదే అదనుగా పడగమీదకు దూకాడు కృష్ణుడు. పడగ మీద పాదం మోపి తాండవం చేసాడు. కాళీయుడు కృష్ణుణి భారాన్నీ అవమాన భారాన్నీ మోయలేకపోయాడు. నీటిపైకి శిరస్సు యెత్తి ముంచి యెంతో ప్రయత్నించాడు. కృష్ణుడు కాళీయ మర్దనం అంటే కాళీయుని పడగని పొగరుని నలగ్గొట్టాడు. అతిబల గర్వాన్ని, అహంకారాన్ని అణచేసాడు. శిరసు చితికిపోయేంతగా తొక్కాడు కృష్ణుడు.
కాళీయుని భార్యలైన నాగకన్యలు వచ్చారు. తమ భర్తని విడిచిపెట్టమని వేడుకున్నారు. కృష్ణుడు చంపకుండా కాళీయుణ్ణి వదిలాడు. గరుత్మంతునితో చావులేకుండా అభయమిచ్చాడు. పాతాళలోకానికి పొమ్మన్నాడు. తిరిగి తాను నివసించిన రమణక ద్వీపానికి కృష్ణుని అనుమతితో భార్యల్ని తీసుకుని కాళీయుడు వెళ్ళిపోయాడు!
కృష్ణుని కాళీయ మర్ధనం వల్ల అటు కాళీయునికీ ఇటు కాళిందిని రక్షించి జనానికి మేలు జరిగింది!.
– బమ్మిడి జగదీశ్వరరావు