మెమన్‌కు మరికొన్ని గంటల్లో ఉరి!

యాకుబ్‌ మెమన్‌ తనకు క్షమాబిక్ష పెట్టమని ఆఖరిసారిగా చేసిన విజ్ఞప్తిని కూడా తిరస్కరించడంతో అన్ని దారులు మూసుకుపోయాయి. ఇక మరి కొన్ని గంటల్లో ముంబై పేలుళ్ళ నిందితుడు యాకుబ్‌ మెమన్‌కు ఉరి శిక్షను అమలు చేయబోతున్నారు. రాష్ట్రపతి తనకు వచ్చిన అభ్యర్థనను హోంశాఖ అభిప్రాయం కోసం పంపించడంతో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాత్రి బాగా పొద్దుపోయాక పది గంటల సమయంలో ప్రణబ్‌ముఖర్జీని కలిసి మెమన్‌ ఉరిపై దాదాపు గంటన్నరపాటు చర్చలు జరిపారు. ఈలోగా రాష్ట్రపతి ప్రణబ్‌ […]

Advertisement
Update:2015-07-29 17:35 IST
యాకుబ్‌ మెమన్‌ తనకు క్షమాబిక్ష పెట్టమని ఆఖరిసారిగా చేసిన విజ్ఞప్తిని కూడా తిరస్కరించడంతో అన్ని దారులు మూసుకుపోయాయి. ఇక మరి కొన్ని గంటల్లో ముంబై పేలుళ్ళ నిందితుడు యాకుబ్‌ మెమన్‌కు ఉరి శిక్షను అమలు చేయబోతున్నారు. రాష్ట్రపతి తనకు వచ్చిన అభ్యర్థనను హోంశాఖ అభిప్రాయం కోసం పంపించడంతో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాత్రి బాగా పొద్దుపోయాక పది గంటల సమయంలో ప్రణబ్‌ముఖర్జీని కలిసి మెమన్‌ ఉరిపై దాదాపు గంటన్నరపాటు చర్చలు జరిపారు. ఈలోగా రాష్ట్రపతి ప్రణబ్‌ సొలిసిటర్‌ జనరల్‌ అభిప్రాయాన్ని కూడా కోరారు. ఈ ఇద్దరి నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మెమన్‌ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించారు. దాంతో ఉరి శిక్ష అమలు ఖరారైంది. దీంతో నాగపూర్‌ సెంట్రల్‌ జైలు చుట్టూ కిలోమీటర్‌ పరిధిలో 144 సెక్షన్‌ విధించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉదయం 7 గంటలకు ఆయనను జైలు అధికారులు ఉరి తీయడానికి ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రపతి తన అభిప్రాయం చెప్పడానికి ఆలస్యమవుతుందన్న కారణంతో మెమన్‌ తరఫు న్యాయవాదులు మరోసారి ఈ రాత్రికే సుప్రీంకోర్టుకు వెళ్ళాలని నిర్ణయించారు. న్యాయమూర్తి ఇంటిలోనే విచారణ కొనసాగించాలని అభ్యర్థించి రాష్ట్రపతి నిర్ణయం వెలువడే వరకు ఆయన ఉరిపై స్టే ఇవ్వాలని అభ్యర్థించదలచుకున్నారు. దీనికి ఏర్పాట్లు కూడా చేశారు. అయితే అనుకోని విధంగా రాత్రి 10.45 నిమషాల సమయంలో రాష్ట్రపతి తన నిర్ణయాన్ని ప్రకటించడంతో ఉరి అమలు చేయడం మాత్రమే ఇక మిగిలి ఉంది.
అంతకుముందు ఉదయం… మెమన్‌ ఉరిశిక్ష ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. మెమన్‌ క్యూరెటివ్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. గతంలో తీసుకున్న నిర్ణయం సరైనదేనని, విచారణ సరైన పద్ధతిలోనే జరిగిందని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. మరోసారి విచారణ జరపాల్సిన అవసరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఉరా? ఉపిరా? అని ఎదురు చూస్తున్న ఈ సమయంలో జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ప్రఫుల్ల సి.పంత్‌, జస్టిస్‌ అమితవ రాయ్‌లతో ఏర్పాటయిన ఈ సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం వెలువరించిన తీర్పు ఉరిని ధ్రువ పరిచింది. మూడు రోజుల నుంచి అనేక మలుపులు తిరిగిన ఈ మెమన్‌ కేసులో చివరి క్షణంలో ఆయన ఊపిరి తీసేలా తీర్పు వెలువడింది. దీంతో గురువారం ఉదయం నాగపూర్‌ జైలులో యాకుబ్‌ మెమన్‌ను ఉరి తీస్తారు. ఉదయం ఏడు గంటలకు దీన్ని అమలు చేయాలని జైలు అధికారులు నిర్ణయించారు. ఇందుకు ఏర్పాట్లు కూడా చేశారు.
నిజానికి మెమన్‌ ఉరిపై సుప్రీం కోర్టులోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చివరికి న్యాయమూర్తుల్లో ‘విభజన’కు కూడా కారణమైంది. ఇంతకుముందే మెమన్‌కు టాడా కోర్టు విధించిన మరణ శిక్షను హైకోర్టు సమర్థించింది. ఆపై సుప్రీంకోర్టు కూడా శిక్షను ధ్రువీకరించింది. రాష్ట్రపతి, మహారాష్ట్ర గవర్నర్‌లు క్షమాభిక్షను తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో మెమన్ మళ్ళీ సుప్రీంకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. రెండు రోజులు వాదనలు విన్న ఇద్దరు సభ్యుల బెంచ్‌ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. ఇద్దరు న్యాయమూర్తుల్లో ఒకరు ఉరిశిక్షను సమర్ధించగా… మరొకరు ఈ కేసులో అనేక సాంకేతిక లోపాలున్నాయని, మరింత లోతుగా విచారణ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కేసులో యాకూబ్‌ ఉరితీతను జస్టిస్‌ ఏఆర్‌ దవే సమర్థించగా… జస్టిస్‌ జోసెఫ్‌ కురియన్‌ సాంకేతిక కారణాలు చూపిస్తూ అతని క్యూరేటివ్‌ పిటిషన్‌పై మరోమారు విచారణ జరపాలన్నారు. దీంతో ఉరితీతపై ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఈ ఇద్దరు న్యాయమూర్తులు ఉరితీతపై భిన్నాభిప్రాయలు వ్యక్తం చేయడంతో విషయం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తు కోర్టుకు చేరింది. దీనిపై విచారణకు మరో విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని ద్విసభ్య ధర్మాసనం కోరడం… అందుకు చీఫ్‌ జస్టిస్‌ అంగీకరించడం జరిగిపోయింది. జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ప్రఫుల్ల సి.పంత్‌, జస్టిస్‌ అమితవ రాయ్‌లతో విస్తృత ధర్మాసనం ఏర్పడింది. ‘గురువారం… యాకూబ్‌ 53వ పుట్టిన రోజు! ఆ రోజు అతడిని ఉరి తీయాలా? ఆపాలా?’అనే విషయాన్ని విచారించిన త్రిసభ్య బెంచ్‌ చివరకు ఉరి శిక్షను ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది. రేపే ఆయన బర్త్‌ డే… అదే ఆయన డెత్‌ డే కూడా కావడం యాదృచ్చికం!
Tags:    
Advertisement

Similar News