సత్యభామ (For Children)
భామ అంటే అర్ధం స్త్రీ! సులభంగా కోపం వచ్చు స్త్రీ – అని కూడా అర్థం. ఈ రెండవ అర్థం బహుశా సత్యభామ నుండే వచ్చి ఉంటుంది?! ఎందుకంటే సత్యభామకు కోపం యెక్కువ! అది కూడా ముక్కుమీదే ఉంటుంది! అంతేనా?, ఆమెకు గర్వమూ, అతిశయమూ యెక్కువే! ఈర్ష్యా ద్వేషమూ యెక్కువే! పొగరూ అహంకారమూ అన్నీ యెక్కువే! అందం మరీ యెక్కువ! అందుకే అందర్లోకి ముద్దుల భార్య అయింది… శ్రీకృష్ణునికి! సత్రాజిత్తు అనే సామంత రాజు కూతురు సత్యభామ. […]
భామ అంటే అర్ధం స్త్రీ! సులభంగా కోపం వచ్చు స్త్రీ – అని కూడా అర్థం. ఈ రెండవ అర్థం బహుశా సత్యభామ నుండే వచ్చి ఉంటుంది?! ఎందుకంటే సత్యభామకు కోపం యెక్కువ! అది కూడా ముక్కుమీదే ఉంటుంది! అంతేనా?, ఆమెకు గర్వమూ, అతిశయమూ యెక్కువే! ఈర్ష్యా ద్వేషమూ యెక్కువే! పొగరూ అహంకారమూ అన్నీ యెక్కువే! అందం మరీ యెక్కువ! అందుకే అందర్లోకి ముద్దుల భార్య అయింది… శ్రీకృష్ణునికి!
సత్రాజిత్తు అనే సామంత రాజు కూతురు సత్యభామ. సూర్యుణ్ణి విశేషంగా ఆరాధించిన సత్రాజిత్తు శమంతకమణిని వరంగా పొందాడు. శమంతకమణిని రెండో సూర్యుడిగా చెప్పుకుంటారు. సూర్యకిరణాలతో మణి కిరణాలు పోటీ పడేవి. కిరణాలు సోకిన వన్నీ బంగారంగా మారి పోతుండేవి. ఆ మణి రోజుకు యెనిమిది బారువ (ఒక బారువకు యిరవై మణుగులు)లు బంగారం ఇచ్చేది. అలాంటి బంగారపు ఇంట సింగారపు బొమ్మ సత్యభామ!
అలాంటి శమంతకమణిని కృష్ణుడే యెత్తుకెళ్ళాడని అపవాదు వచ్చి పడింది. ఒకరోజు ఆ మణిని ధరించి సత్రాజిత్తుడు ఉగ్రసేన మహారాజు సభకు వచ్చాడు. ఆ మణి రాజు దగ్గరుంటే ప్రజలకు మేలు అన్నాడు కృష్ణుడు. ఆ మణి ఇచ్చే ఆదాయం ప్రజలకు వినియోగించ వీలు వుంటుందని కృష్ణుడు భావన. సత్రాజిత్తుకు కోపం వచ్చింది. తన కష్టార్జితం అంటూ వెళ్ళి పోయాడు. సత్రాజిత్తు తమ్ముడు ప్రశేనుడు ఆ మణిని ధరించి అడవికి వెళ్ళడం – సింహం అతన్ని చంపేయడం – సింహాన్ని జాంబవంతుడు చంపి మణిని సొంతం చేసుకోవడం జరిగింది. కృష్ణుడు జాంబవంతునితో పోరాడి శమంతకమణిని తిరిగి సత్రాజిత్తునకిచ్చి తనమీద ఉన్న నిందను చెరిపేసుకున్నాడు. మన్నింపును కోరిన సత్రాజిత్తు శమంతకమణితో పాటు తనకూతురు సత్యభామను శ్రీకృష్ణునికిచ్చి పెళ్ళి జరిపించాడు! అలా సత్యభామ కృష్ణుని భార్య అయ్యింది!
సత్రాజిత్తుకు సత్యభామ ఏకైక కూతురు గనుక కొడుకైనా తనేనని భావించి యుద్ధ విద్యలన్నీ నేర్పించాడు. అందుకనే నరకాసురినితో యుద్ధానికి శ్రీకృష్ణుడు వెళ్ళినపుడు వెంట సత్యభామ కూడా వెళ్ళింది. నరకాసురుని బాణాలకు శ్రీకృష్ణుడు మూర్ఛపోయినపుడు సత్యభామ తను పోరాడింది. నరకాసురుణ్ణి నిలువరించింది. తేరుకున్న శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి వధించాడు. శ్రీకృష్ణ విజయంలో సత్యభామకీ భాగం ఉంది. సత్యభామ భూదేవి అవతారమని భావిస్తారు!
నరకాసురుడు యెత్తుకొచ్చిన ఇంద్రుని తల్లి అదితి కర్ణకుండలాలు ఇవ్వడానికి సత్యభామ సమేతంగా కృష్ణుడు వెళ్ళాడు. దేవలోక అతిధులుగా కొన్నాళ్ళు అక్కడేవున్నారు. నందనవనం అందానికి భామ ముగ్దురాలైంది. అందులోని పారిజాతం ఆకర్షించింది. పారిజాతాన్ని భూలోకం తీసుకువెళ్ళాలని కోరిక కలిగింది. ఆ కోరికను కృష్ణుడు తీర్చాడు. దేవలోక పారిజాతం భూలోకంలో సత్యభామ ఇంట పూచింది. రాల్చింది మాత్రం రుక్మిణి ఇంట్లో నంట!
శ్రీకృష్ణుడు తనకే బంధీ కావాలని, అతని ప్రేమ మొత్తం తనకే దక్కాలని భావించింది సత్యభామ. “భర్త దాన వ్రతం” చేసి భర్తను బ్రాహ్మణునికి దానమివ్వాలి అని చెప్పాడు నారదుడు. తిరిగి భర్త యెత్తు బంగారం ఇచ్చి భర్తను కొనుక్కొని సొంతం చేసుకోవాలి అన్నాడు. బంగారం పుట్టలు పెట్టే శమంతకమణి ఉండనే ఉంది. అందుకే రుక్మిణిని పిలిచి మరీ పోటీ పడింది. ఎంత బంగారం త్రాసులో వేసినా కృష్ణుని సాటిరాలేదు. ద్వారక వీధుల్లో అమ్మకానికి కృష్ణుణ్ణి పెట్టాడు నారదుడు. సమస్త బంగారాన్ని, సవతుల్ని అడిగితెచ్చిన బంగారాన్ని వేసినా భర్త బరువుకి సమానంకాదే?, ఆ బంగారం అంతా తీయించి కృష్ణుని ధ్యానించి వేసిన తులసి దళానికి తూగాడు కృష్ణుడు. సత్యభామకు గర్వభంగమైంది!
సత్యభామ శృంగారనాయకి. భామాకలాపము, పారిజాతాపహరణము, తులాభారము అన్నీ సత్యభామ కేంద్రకమైనవే!.
– బమ్మిడి జగదీశ్వరరావు