నిప్పుకథ (Devotional)
పూర్వం ఒకప్పుడు ఒక వ్యక్తి ప్రకృతి చర్యల్ని బాగా పరిశీలించాడు. అగ్ని ఎట్లా రూపొందుతుంది. అగ్నిని ఎట్లా వుపయోగించవచ్చు అని తెలుసుకున్నాడు. అతని పేరు నూర్. వివిధ ప్రాంతాల్లో సంచరించి జనాలకు తను కనిపెట్టిన విషయం గురించి వివరించాలనుకున్నాడు. ఎన్నో ప్రాంతాలు తిరిగి ఎన్నో తెగలకు తనకు తెలిసిన రహస్యాన్ని గురించి వివరించాడు. కొంతమంది ఆ జ్ఞానాన్ని అందుకున్నారు. ఇంకొంతమంది అంత విలువైన ఆవిష్కరణ గురించి అర్థం చేసుకోకముందే అతన్ని తిరస్కరించారు. దాని వుపయోగం గురించి వాళ్ళు […]
పూర్వం ఒకప్పుడు ఒక వ్యక్తి ప్రకృతి చర్యల్ని బాగా పరిశీలించాడు. అగ్ని ఎట్లా రూపొందుతుంది. అగ్నిని ఎట్లా వుపయోగించవచ్చు అని తెలుసుకున్నాడు. అతని పేరు నూర్. వివిధ ప్రాంతాల్లో సంచరించి జనాలకు తను కనిపెట్టిన విషయం గురించి వివరించాలనుకున్నాడు.
ఎన్నో ప్రాంతాలు తిరిగి ఎన్నో తెగలకు తనకు తెలిసిన రహస్యాన్ని గురించి వివరించాడు. కొంతమంది ఆ జ్ఞానాన్ని అందుకున్నారు. ఇంకొంతమంది అంత విలువైన ఆవిష్కరణ గురించి అర్థం చేసుకోకముందే అతన్ని తిరస్కరించారు. దాని వుపయోగం గురించి వాళ్ళు కనీసం ఆలోచించలేదు. చివరికి ఒక తెగ దగ్గరికి వెళ్ళి నూర్ అగ్ని ఆవిర్భావాన్ని ప్రదర్శించాడు. వాళ్ళు అతను చేసిన పని చూసి భయపడిపోయి అతన్ని దయ్యమనుకుని నూర్‌ని చంపేశారు.
వందల ఏళ్ళు గడిచిపోయాయి. మొదట అగ్ని గురించి తెలుసుకున్న తెగ ఆ రహస్యాన్ని వాళ్ళ పూజారులకే తెలిసేటట్లు కట్టడి చేశారు. జనం చలికి గడ్డకట్టినా ఆ రహస్యం పూజారుల దగ్గరే వుండిపోయింది.
రెండో తెగ ఆ రహస్యాన్ని మరచిపోయి కేవలం ఉపకరణాల్ని పూజించడానికే పరిమితమయిపోయింది.
మూడో తెగ ఆ రహస్యాన్ని బోధించిన నూర్‌ని ఆరాధించడానికే పరిమితమయిపోయింది.
నాలుగో తెగ తమకు సంబంధించిన కథల్లో, గాధల్లో ఆ రహస్యాన్ని నిక్షిప్తం చేసింది. ఆ విషయాన్ని కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు.
ఐదో తెగ మాత్రమే అగ్నిని వుపయోగించడం తెలుసుకుంది. వెచ్చబరచుకోవడానికి, వంట చేసుకోవడానికి, అన్ని రకాలుగా అగ్నిని వుపయోగించుకోవడం నేర్చుకుంది.
చాలా చాలా ఏళ్ళు గడిచాయి. ఒక జ్ఞాని తన శిష్యులతో కలిసి ఆ తెగలు నివసించే ప్రాంతాల గుండా సాగాడు.
ఆ ప్రాంతాల్లో వివిధ తెగల ఆచార వ్యవహారాల్ని చూసి శిష్యులు ఆశ్చర్యపోయారు. ‘ఇవన్నీ అగ్నిని ఎట్లా సృష్టించవచ్చన్న వ్యవహారానికి సంబంధించిన ఆచారాలు. మనం వీళ్ళని సంస్కరించాలి’ అన్నారు. గురువు ‘అయితే మళ్ళీ మనం మన ప్రయాణాన్ని మొదటినించీ ప్రారంభిద్దాం. చివరికి మనలో మిగిలిన వాళ్ళకు అసలు సమస్య ఏమిటి? దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి? అన్న విషయం తెలుస్తుంది’ అన్నాడు.
వాళ్ళు మొదటి తెగ దగ్గరికి వెళ్ళారు. ఆ తెగవాళ్ళు వాళ్ళని ఆహ్వానించి ఆతిథ్యమిచ్చారు. వాళ్ళ మతపరమయిన ఉత్సవంలో భాగస్వాములు కమ్మని పూజారి కోరాడు. అగ్నిని వెలిగించి వాళ్ళు ఉత్సవం జరుపుకున్నారు. ఆ అద్భుతమయిన ఆవిష్కారం దైవ సంబంధమయిందని ఆడారు, పాడారు, ఉత్సాహంగా వూగిపోయారు.
అప్పుడు గురువు, శిష్యులకేసి చూసి ‘మీలో ఎవరయినా ఏదైనా మాట్లాడదలచుకున్నారా?’ అని అడిగాడు.
ఒక శిష్యుడు ‘నేను నాకు తెలిసిన ఒక సత్యాన్ని వీళ్ళముందు బహిరంగ పరచదలచుకున్నాను’ అన్నాడు.
గురువు ‘నువ్వు ప్రమాదాన్ని కొని తెచ్చుకునేటట్లయితే నీ యిష్టం’ అన్నాడు. శిష్యుడు పూజారి దగ్గరికి వెళ్ళి ‘మీరు ప్రత్యేక భక్తి శ్రద్ధలతో ఈ అగ్ని చుట్టూ ఆడారు, పాడారు. నేను ఈ అగ్నిని పుట్టిస్తాను, ఇన్నేళ్ళుగా మీరు తప్పు చేస్తున్నారని మీరు అంగీకరిస్తారా?’ అన్నాడు.
వెంటనే పూజారి ఆగ్రహంతో ‘ఇతన్ని నా కళ్ళ ముందు కనిపించకుండా లాక్కెళ్ళండి’ అన్నాడు.
అతన్ని పూజారి మనుషులు లాక్కుపోయారు.
గురువు శిష్యులతోబాటు అక్కడి నించి రెండో తెగ నివసించే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ రెండో తెగ జనం అగ్నిని పుట్టించే పని ముట్లని ఆరాధించడం కనిపించింది.
ఒక శిష్యుడు గురువుగారి అనుమతితో ‘మీరు హేతుబద్ధంగా ఆలోచించే జనమని నమ్ముతున్నాను. మీరు పనిముట్లను మాత్రమే ఆరాధిస్తున్నారు. వాటి గుండా ఏమిసంభవిస్తుందో, ఏది ఆవిష్కరింప బడుతుందో అన్నదానితో నిమిత్తం లేకుండా ఆ పని చేస్తున్నారు. దాని ప్రయోజనాన్ని విస్మరిస్తున్నారు. ఈ ఆచార కర్మకాండ వెనుక వున్న అసలు సత్యం నాకు తెలుసు’ అన్నాడు.
వాళ్ళని సహేతుకంగా ఆలోచించడానికి శిష్యుడు ప్రయత్నించాడు. కానీ వాళ్ళు ‘మీరు అపరిచితులుగా, ప్రయాణికులుగా మా దగ్గరికి వచ్చారు. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు విదేశీయులు గనక మా ఆచార వ్యవహారాల్ని మీరు అర్థం చేసుకోలేరు. మీరు పొరపాటు చేశారు. మా మతాన్ని మార్చాలని ప్రయత్నించారు. అందువల్ల మీరు చెప్పేవి మేము వినదలచుకోలేదు’ అన్నారు.
గురువు శిష్యులతోబాటు సాగిపోయాడు.
వాళ్ళు మూడో తెగ నివసించే ప్రాంతంలో అడుగు పెడుతూనే అగ్నిని కనిపెట్టిన నూర్ విగ్రహాన్ని వాళ్ళు పూజిస్తూ కనిపించారు. యింకో శిష్యుడు ఆ తెగ జనాన్ని చూసి ‘ఈ విగ్రహం ఒక మనిషికి ప్రతినిధి. శక్తి వుపయోగానికి ప్రతినిధి’ అన్నాడు.
కావచ్చు. నిజమైన రహస్యం తెలిసిన వాళ్ళు కొద్దిమందే అని అన్నారు మూడో తెగ జనం.
‘కానీ ఆ యదార్థాన్ని తెలిసిన వాళ్ళకు మాత్రమే యిది. తెలియని వాళ్ళకోసం కాదనే వాళ్ళకోసం కాదు’ అన్నాడు శిష్యుడు.
ఆ తెగకు సంబంధించిన పూజారి ‘కనీసం మా భాషకూడా మాట్లాడలేని, భిన్న మతస్థుడు మా విశ్వాసాన్ని అర్థం చేసుకోలేడు’ అన్నాడు.
చర్చ ఆగిపోయింది.
గురువు శిష్యులతో పాటు సాగాడు.
వాళ్ళు నాలుగో తెగను సమీపించారు.
ఒక శిష్యుడు అక్కడ సమావేశమయిన జనంతో ‘అగ్నిని ఎట్లా పుట్టించవచ్చో ఆ కథ నిజం. దాన్ని ఎట్లా సృష్టించాలో నాకు తెలుసు’ అన్నాడు. తెగ జనం మధ్య అయోమయం నెలకొంది. వాళ్ళు గుంపులుగా విడిపోయి చర్చల్లో మునిగారు.
కొందరు ‘అది నిజం కావచ్చు, అది నిజమైతే అగ్నిని ఎట్లా సృష్టించవచ్చో మాకూ తెలుసుకోవాలని వుంది’ అన్నారు. వాళ్ళ మనసులో అది వున్న వాళ్ళకు ప్రదర్శించినా వాళ్ళు ఆ పని చెయ్యలేరు.
యింకొందరు ‘మేము కథలు, గాథల్ని నమ్మం. ఇతను మమ్మల్ని గొర్రెల్ని చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు. మాతో నివాసం ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు’ అన్నారు.
మరికొందరు ‘కథలు, గాథల్ని కాదని పక్కన పెడితే నువ్వు చెప్పేవన్నీ నిష్ప్రయోజనం’ అన్నారు.
అందరూ ఎవరి యిష్టప్రకారం వాళ్ళు మాట్లాడారు.
గురువు శిష్యులతో ఐదవ తెగ నివసించే ప్రాంతంలో అడుగు పెట్టాడు.
అక్కడ అగ్ని వుపయోగం సర్వసాధారణంగా కనిపించింది. గురువు శిష్యులతో ‘మీరు ఎట్లా బోధించాలో మొదట తెలుసుకోవాలి. మనుషులు బోధనలకు సుముఖంగా వుండరు. జనాలకి ఎట్లా గ్రహించాలో, తెలుసుకోవాలో మీరు బోధించాలి. మీరు వాళ్ళకి బోధించే ముందు యింకా తెలుసుకోవలసింది కొంత వుంది అని చెప్పాలి. వాళ్ళు తెలుసుకోవడానికి సిద్ధంగా వున్నట్లు వూహిస్తారు. కానీ వాళ్ళు దేన్ని ‘వూహిస్తారో’ దాన్ని తెలుసుకోవడానికే సిద్ధంగా వుంటారు. మొదట ఏది తెలుసుకోవాలో దానిపట్ల శ్రద్ధ పెట్టరు. ఈ విషయం మీరు గ్రహిస్తే మీకు బోధించడం గురించి తెలుస్తుంది. ప్రత్యేకమైన నైపుణ్యం నిండిన జ్ఞానం, ప్రత్యేకమయిన నైపుణ్యం లేని జ్ఞానం లాంటిది కాదు’ అన్నాడు.
– సౌభాగ్య