గుడ్డి వాళ్ళు " ఏనుగు (Devotional)

ఒక నగరముండేది. అందులో అందరూ గుడ్డివాళ్ళే. ఒకరోజు రాజుగారు తన పరివారంతో ఆ నగరానికి దగ్గరగా ఎడారిలో గుడారాలు వేయించి విడిది చేశాడు. ఆ విషయం ఆ నగరంలోని గుడ్డి వాళ్ళకు తెలిసింది. రాజు చాలా పెద్దదయిన, బలమయిన ఏనుగు మీద సవారీ చేస్తూ వచ్చాడని కూడా తెలిసింది. వాళ్ళు ఏనుగు గురించి విన్నారు. కానీ అది ఎలా వుంటుందో ఎవరికీ తెలీదు. గుడ్డివాళ్ళకు వున్నది స్పర్శజ్ఞానం. వినికిడి మాత్రమే. అందరికీ ఏనుగు గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహం […]

Advertisement
Update:2015-07-24 18:31 IST

ఒక నగరముండేది. అందులో అందరూ గుడ్డివాళ్ళే. ఒకరోజు రాజుగారు తన పరివారంతో ఆ నగరానికి దగ్గరగా ఎడారిలో గుడారాలు వేయించి విడిది చేశాడు. ఆ విషయం ఆ నగరంలోని గుడ్డి వాళ్ళకు తెలిసింది.

రాజు చాలా పెద్దదయిన, బలమయిన ఏనుగు మీద సవారీ చేస్తూ వచ్చాడని కూడా తెలిసింది. వాళ్ళు ఏనుగు గురించి విన్నారు. కానీ అది ఎలా వుంటుందో ఎవరికీ తెలీదు. గుడ్డివాళ్ళకు వున్నది స్పర్శజ్ఞానం. వినికిడి మాత్రమే. అందరికీ ఏనుగు గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహం కలిగింది.

ఎడారిలో గుడారాల దగ్గర కట్టిన ఏనుగు దగ్గరకు చేరుకున్నారు. వాళ్ళలో కొందరు ఏనుగు దగ్గరికి వెళ్ళి దాన్ని తడిమి చూశారు. ఒకడు చెవిని, ఒకడు తొండాన్ని, ఒకడు దాని కాలిని తడిమి చూశాడు. గుడ్డివాళ్ళకు కనిపించదు కదా! కనిపించని దానికి, స్పర్శకు వూహను జోడించుకున్నారు.

ఏనుగు గురించి తెలిసిపోయిందనుకుని నగరానికి వెళ్ళారు. నగరంలోని గుడ్డివాళ్ళంతా ఆ ముగ్గురి చుట్టూ చేరి ఏనుగు ఎలా వుంటుంది? అని ఉత్సాహంగా అడిగారు.

మొదటివాడు ఏనుగు చెవిని తడిమి చూసినవాడు ‘ఏనుగు చాలా విశాలంగా దుప్పటిలా వుంటుంది’ అన్నాడు. రెండోవాడు ‘వాడు చెప్పింది సరికాదు’ అన్నాడు. అతను ఏనుగు తొండాన్ని తడిమి చూసినవాడు.

‘ఏనుగు బోలుగా వెదురు బొంగులా వుంటుంది’ అన్నాడు.

మూడో వాడు ఏనుగు కాలును తడిమి చూసినవాడు ‘వాళ్ళు చెప్పింది తప్పు. ఏనుగు చాలా బలంగా, పెద్ద స్థంభంలా వుంటుంది’ అన్నాడు.

విన్నవాళ్ళు యింతకూ ఏనుగు ఎలా వుంటుందో నిర్ణయించు కోలేకపోయారు. సందేహంగా నిష్క్రమించారు. వాళ్ళు ముగ్గురూ ఏనుగు ఒక్కో శరీర భాగాన్ని తడిమిన వాళ్ళు మాత్రమే. దానిగుండా తమకు తెలిసిందే సరయిందని భావించారు.

మనిషికి దైవత్వం గురించి కూడా తెలిసింది పాక్షికమైందే. ఎన్ని పరిశోధనలు చేసినా అనంతానికి సంబంధించిన పాక్షిక సత్యాన్ని మాత్రమే ఆవిష్కరిస్తుంది.

సంపూర్ణ సత్యం ఎప్పటికీ మనిషికి అందరానిదే.

– సౌభాగ్య

Tags:    
Advertisement

Similar News