కుబేరుడు (For Children)

మనకు కుబేరుడనగానే వేంకటేశ్వరస్వామికి అప్పిచ్చిన వాడిగానే తెలుసు! వెంకటేశ్వరుని అంతటివానికే అప్పిచ్చాడంటే ధనానికి తక్కువవాడు కాదని. డబ్బున్న మారాజుల్ని కుబేరులతో పోలుస్తాం. అంతకు మించి కుబేరునికి తనదైన కథ ఉన్నది! కుబేరుడు తొలిజన్మలో యజ్ఞదత్తుడైన బ్రాహ్మణుని కుమారుడు. పేరు గుణనిథి. ఎలాంటి గుణాలకు నిధి అనుకున్నారు? దొంగతనం, వ్యభిచారం, క్రూరత్వం, దుర్మార్గం… ఇవే అతని గుణాలు. అలా ఉంటే ఏ తండ్రయినా యేం చేస్తాడు? ఇంటి నుంచి పొమ్మన్నాడు. పోయాడు. కాని తినేందుకు తిండి కూడా లేకపోయింది. […]

Advertisement
Update:2015-07-23 18:32 IST

మనకు కుబేరుడనగానే వేంకటేశ్వరస్వామికి అప్పిచ్చిన వాడిగానే తెలుసు! వెంకటేశ్వరుని అంతటివానికే అప్పిచ్చాడంటే ధనానికి తక్కువవాడు కాదని. డబ్బున్న మారాజుల్ని కుబేరులతో పోలుస్తాం. అంతకు మించి కుబేరునికి తనదైన కథ ఉన్నది!

కుబేరుడు తొలిజన్మలో యజ్ఞదత్తుడైన బ్రాహ్మణుని కుమారుడు. పేరు గుణనిథి. ఎలాంటి గుణాలకు నిధి అనుకున్నారు? దొంగతనం, వ్యభిచారం, క్రూరత్వం, దుర్మార్గం… ఇవే అతని గుణాలు. అలా ఉంటే ఏ తండ్రయినా యేం చేస్తాడు? ఇంటి నుంచి పొమ్మన్నాడు. పోయాడు. కాని తినేందుకు తిండి కూడా లేకపోయింది. దాంతో ఎవరో శివుణ్ణి పూజించి ప్రసాదం పెట్టుకొని ఉంటే దొంగిలించాడు. ఆబగా ఆకలికి నోట్లో వేసుకున్నాడు. చూసిన రాజభటులు ఊరుకుంటారా? లేదు, వెంటపడ్డారు. కాని ఇంతలో చీకటయిపోవడంతో వారికి చిక్కలేదు! చివరికి చనిపోయిన కుబేరుని తీసుకెళ్ళాలని యమదూతలు వచ్చారట. విష్ణుదూతలూ వచ్చారట. శివుని ప్రసాదం తిన్నందువల్ల విష్ణుదూతలే తమవెంట తీసుకెళ్ళిపోయారట!

మలిజన్మలో కళింగాధీశుడైన ఆరిందముడి కుమారుడు. పేరు దముడు. రాజ్యపాలన చేపట్టినా గుడుల్లో దీపాలు వెలిగించాడు. కాశీపట్టణంలోని విశ్వేశ్వరుణ్ని ప్రార్థించాడు. పూజలకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. తేజాన్ని చూడలేక చూసే శక్తి నడిగాడు. శివుడిచ్చాడు. చూడగలిగే శక్తి కన్నులకు వచ్చాక పార్వతిని చూస్తూ ఉండిపోయాడు. అక్కడితో ఆగలేదు. ఆమె అంద చందాల్ని భర్తముందే వర్ణించాడు. పార్వతికి కోపం వచ్చింది. దాంతో చూస్తున్న కుబేరుని కుడికన్ను పగిలిపోయింది. వీడెవడంటూ పార్వతి కోపగించుకుంటే మనబిడ్డ వంటివాడు అన్నాడు శివుడు. భక్తుడన్నాడు. దయచూపమన్నాడు. పార్వతి భర్తమాట కాదనలేక కరుణించింది. కన్ను చెడినా దృష్టి చెడకుండా వరమిచ్చింది. ఇదంతా శివపురాణంలోని కథ!

ఉత్తర రామాయణంలో మరోకథ కూడా ఉంది. విశ్రవశునికి ఇలబిలకు పుట్టినట్టు తండ్రి గురించికాక తాత బ్రహ్మ గురించి తపస్సు చేసినట్టు కథ ఉంది. రావణుడు ఇతని సవతి సోదరుడు. కుబేరుడు బ్రహ్మనుండి తపస్సు వల్ల అయిదు వరాలు పొందాడు. ఒకటి నలకుబేరుడనే కొడుకును పొందాడు. రెండు లోకపాలకత్వాన్ని కోరాడు. మూడు ధన ధాన్యాది ఐశ్వర్యాలను పొందాడు. నాలుగు శంకరునితో స్నేహాన్ని కోరాడు. ఐదు లంకాపురాన్ని పొందాడు. అయితే తనను పూజించనందుకు విశ్రవసునికి కోపం వచ్చింది. అపకారం తలపెట్టబోతే కుమారుడనని గుర్తు చేసాడు. సపర్యలు చేయడానికి ముగ్గురు యువతుల్ని పంపాడు. వారే పుష్పోత్కట, మాలిని, పాక. విశ్రవశునివల్ల పుష్కోత్కటకు రావణ కుంభకర్ణులు, మాలినికి విభీషణుడు, పాకకు ఖరుడు, శూర్పణఖ పుట్టారు. పుష్పక విమానం ఎక్కితిరుగుతున్న కుబేరుణ్ణి చూసి కైకసి అసూయనూ కోరికనూ రావణుని ముందు బైట పెట్టింది. రావణుడు ఘోర తపస్సుచేసి అంతకు మించిన పుష్పక విమానం సాధించడమే కాదు, సుమాలి వచ్చి కుబేరుడు వచ్చి ఉండడానికి ముందు లంక రాక్షసులదేనని చెప్పడంతో కుబేరుణ్ణి లంకను వదిలిపొమ్మన్నాడు. కుబేరుడు తండ్రి దగ్గరకు వెళితే కైలాస మార్గం చూపాడు. కుబేరుడు శివునితో స్నేహం చేసాడు. అలకాపట్టణాన్నీ పొందాడు. శివుని తొడమీద కూర్చున్న పార్వతిని కుడికంటితో కుబేరుడు చూసాడు. గుణం పసిగట్టిన పార్వతి కోపంతో చూడడంతో కుబేరుని కుడికన్ను పగిలిపోయింది. మళ్ళీ తపస్సు చేసిన కుబేరుడు చెడిన కన్నుకు చూపు తెచ్చుకున్నాడు. దాన్నే పింగళాక్షి అన్నారు. అంటే గుడ్లగూబకన్ను గలవాడు అదే పింగళాక్షుడన్నమాట!

అదీ కుబేరుని కథ!

– బమ్మిడి జగదీశ్వరరావు

Tags:    
Advertisement

Similar News