దేవుడెక్కడున్నాడు? (Devotional)
మనం రకరకాల మతాల వాళ్ళను చూస్తూ ఉంటాం. మనిషిని మనిషిగా చూస్తే ఎవర్నీ ఇతను ఫలానా మతం వాడని గుర్తుపట్టలేం. పిలకలు ఉండడం, గడ్డం పెంచుకోవడం, మెడలో రుద్రాక్షలు, లేదా తాయెత్తులు, తలపాగాలు, ఇతర మత చిహ్నాలు వేలాడదీసుకోవడం వీటిని బట్టి ఎవరికి వారు తాము ఫలానా మతం వాళ్ళమని ప్రదర్శించుకుంటూ ఉంటారు. అంటే బాహ్యరూపాల్ని బట్టి తెలుసుకోమంటారు. ఎవరి ప్రార్థనాలయాలకు వాళ్ళు వెళతారు. ఇతర్ల మందిరాలకు వెళ్ళరు. వాళ్ళ ఉద్దేశంలో దేవుడు వాళ్ళ ప్రార్థనా మందిరంలో […]
మనం రకరకాల మతాల వాళ్ళను చూస్తూ ఉంటాం. మనిషిని మనిషిగా చూస్తే ఎవర్నీ ఇతను ఫలానా మతం వాడని గుర్తుపట్టలేం. పిలకలు ఉండడం, గడ్డం పెంచుకోవడం, మెడలో రుద్రాక్షలు, లేదా తాయెత్తులు, తలపాగాలు, ఇతర మత చిహ్నాలు వేలాడదీసుకోవడం వీటిని బట్టి ఎవరికి వారు తాము ఫలానా మతం వాళ్ళమని ప్రదర్శించుకుంటూ ఉంటారు. అంటే బాహ్యరూపాల్ని బట్టి తెలుసుకోమంటారు.
ఎవరి ప్రార్థనాలయాలకు వాళ్ళు వెళతారు. ఇతర్ల మందిరాలకు వెళ్ళరు. వాళ్ళ ఉద్దేశంలో దేవుడు వాళ్ళ ప్రార్థనా మందిరంలో మాత్రమే ఉంటాడు. ఇతర మతస్థులు పాపులు. ప్రతివాడూ ఇంకో మతస్థుణ్ణి గురించి అలాగే అనుకుంటాడు.
హసన్ అని ఒక భక్తుడు ఉండేవాడు. నిరంతరం దైవచింతనలో నిమగ్నమయి ఉండేవాడు. డెబ్బయి సంవత్సరాలపాటు నిత్యం క్రమం తప్పకుండా మసీదుకు వెళ్ళి ప్రార్థనలు చేసేవాడు. ఆ విషయం అందరికీ తెలుసు. డెబ్బయేళ్ళుగా అతనికి మసీదుతో అనుబంధం. అతనూ మసీదు వేరుకాదన్నంతగా కలిసిపోయారు.
హసన్ గ్రామాన్ని వదిలి వెళ్ళేవాడు కాదు. అందువల్ల రోజూ మసీదుకు వచ్చేవాడు. రోజుకు ఐదు సార్లు ప్రార్థన చేసేవాడు. అనారోగ్యంతో ఉన్నా వచ్చేవాడు.
అలాంటిది ఒకరోజు అతను మసీదులో కనిపించలేదు. రాలేదంటే అతను చనిపోయాడని అర్థం. అందరూ అతని విషయంలో ఆ నిశ్చయానికి వచ్చారు.
కొందరు కదలలేని పరిస్థితి వచ్చి మసీదుకు రాలేదేమో అని వెతుక్కుంటూ వెళ్ళారు. హసన్ ఒక చెట్టుకింద కనిపించాడు. ఆరోగ్యంగా ఉన్నాడు. అందరూ ఎందుకు మసీదుకు రాలేదా? అని ఆశ్చర్యపోయారు. హసన్‌తో “ఎందుకిక్కడున్నావు? ప్రార్థనకు సమయమయింది కదా? మసీదుకు ఎందుకు రావు?” అని అడిగారు.
హసన్ వాళ్ళను చూసి “నేను క్రమం తప్పకుండా డెబ్బయి సంవత్సరాల పాటు మసీదుకు వచ్చాను. అది ఆలయం. దేవుని ఆలయం. అక్కడ ఆలయం తప్ప మరొకటి నాకు కనిపించలేదు. నాకు అప్పటిదాకా దేవుడుండే స్థలం మసీదన్న ఒక అభిప్రాయం ఉండేది. ఇప్పుడు దేవుడు మసీదులోనే కాదు, అన్ని చోట్లా ఉన్నాడని గ్రహించాను. ఆయన లేనిచోటు ఏదీ లేదని గ్రహించాను. అందుకని ఇప్పుడు నాకు దేవుడికోసం మసీదుకు మాత్రమే వెళ్ళాల్సిన పనిలేదని తెలిసింది. దేవుడు ఇక్కడ లేడు ఫలానా చోట ఉన్నాడు అని తెలిస్తే అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ కూడా ఉన్నాడని తెలిస్తే అక్కడికి వెళ్ళాల్సిన పనేముంది” అన్నాడు.
అతని మాటలు జనాలకు అర్థం కాలేదు. హసన్‌కు పిచ్చెక్కింది అనుకున్నారు. సాధారణ ప్రజానీకానికి హసన్‌లో వచ్చిన విప్లవాత్మక పరిణామం అర్థం కాదు.
– సౌభాగ్య