మాట్లాడే పుర్రె (Devotional)
ఒక వేటగాడు అడవికి వెళ్ళాడు. దారిలో ఒక చెట్టుకింద అతనికి ఒక పుర్రె కనిపించింది. బాగా ఎండగా ఉండడంతో విశ్రాంతి కోసం అతను చెట్టు కింద కూచున్నాడు. పక్కనే కపాలముంది. అది అక్కడ ఎందుకుందో అతనికి అర్థం కాలేదు. అతను ఎంతో దూరం నడవడం వల్ల అలసిపోయాడు. నిర్జనమైన ఆ ప్రదేశంలో ఎవరూ పలకరించడానిక్కూడా లేరు. నిశ్శబ్దం. మట్లాడానికి ఎవరూ లేకపోవడంతో పక్క నున్న పుర్రెను చూసి అతను ” ఎవరు? ” అన్నాడు. […]
ఒక వేటగాడు అడవికి వెళ్ళాడు. దారిలో ఒక చెట్టుకింద అతనికి ఒక పుర్రె కనిపించింది. బాగా ఎండగా ఉండడంతో విశ్రాంతి కోసం అతను చెట్టు కింద కూచున్నాడు. పక్కనే కపాలముంది. అది అక్కడ ఎందుకుందో అతనికి అర్థం కాలేదు.
అతను ఎంతో దూరం నడవడం వల్ల అలసిపోయాడు. నిర్జనమైన ఆ ప్రదేశంలో ఎవరూ పలకరించడానిక్కూడా లేరు. నిశ్శబ్దం. మట్లాడానికి ఎవరూ లేకపోవడంతో పక్క నున్న పుర్రెను చూసి అతను ” ఎవరు? ” అన్నాడు.
అట్లా పుర్రెను పలకరించినందుకు తనలో తనే నవ్వుకున్నాడు. అంతలో ఎవరో తిరిగి ” ఎవరు? ” అని పలకరించారు. ఆశ్చర్యంతో అటూ ఇటూ చూశాడు. ఎవరూ లేరు. మళ్ళీ ” ఎవరు? ” అన్న మాట వినిపించింది. పుర్రెను చూశాడు. ఆ పుర్రె అతన్ని తిరిగి ” ఎవరు? ” అంటోంది. అదిరిపోయాడు.
తనను తను సంభాళించుకుని పుర్రెను చూసి “నువ్వు మాట్లాడుతావా? ” అన్నాడు.
పుర్రె “అవును, మాట్లాడుతాను” అంది.
అప్పుడతను “నిన్నీ పరిస్థితులో ఇక్కడికి తెచ్చిన వాళ్ళెవరు? ” అని ప్రశ్నించాడు.
పుర్రె “మాట్లాడ్డం, విపరీతంగా మాట్లాడం నన్నిక్కడకు తెచ్చింది” అంది. అతను వింతగా చూశాడు, భయపడ్డాడు.
అతను పరిగెత్తుకుంటూ అడవి దాటి నగరం చేరి చెమటలు కుక్కుకుంటూ దేశాన్ని పాలించే రాజు దగ్గరికి వెళ్ళి “రాజుగారూ! ఇది ఎవరూ నమ్మలేని నిజం. ఒక పుర్రె మాట్లాడడం నేను చూశాను. నా చెవుల్తో విన్నాను. ఒక చెట్టుకింద ఆ పుర్రె పడివుంది. “అది నన్ను చూసి ” ఎవరు? ” అంది ” అన్నాడు.
రాజు వేటగాడి మాట నమ్మలేదు.
“నువ్వు నవ్వులాటకు చెబుతున్నావేమో”
“రాజుగారూ! మీతో నవ్వులాటా”
“అయితే నేనూ వస్తాను, చూద్దాం” అన్నాడు రాజు
రాజుతో బాటు పరివారమంతా కదిలింది.
వేటగాడు అందర్నీ అడవిలో ఉన్నచెట్టుకిందకు తీసుకెళ్ళి పుర్రెను చూపించాడు.
వేటగాడు “పుర్రెను పలకరించండి” అన్నాడు రాజుతో
రాజు ” ఎవరు? ” అన్నాడు. సమాధానం లేదు.
రాజు మళ్ళీ ” ఎవరు? ”, ” ఎవరు? ” అన్నాడు, బదులు లేదు
వేటగాడు ” ఎవరు? ” అన్నాడు. పుర్రె బదులివ్వలేదు.
రాజు వేటగాడు తనని వెర్రివాణ్ణి చేశాడని ఆగ్రహించాడు. కోపం కట్టలు తెంచుకుంది.
“నాకు ముందే తెలిసింది. నువ్వు పిచ్చివాడివి. లేదా నన్ను మోసం చెయ్యాలని ఈ పని చేశావు” అని వేటగాడి తలను ఖండించమని సైనికులకు ఆజ్ఞాపించాడు.
సైనికులు వేటగాడి తలను ఖండించారు. అది పుర్రెపక్కన పడింది.
పుర్రె తలను చూసి ” ఎవరు? ” అంది.
తల ఆశ్చర్యంతో “అప్పుడు ఎందుకు మాట్లాడలేదు” అంది.
పుర్రె “ఎవరు తెచ్చారు నిన్నిక్కడికి” అని అడిగింది.
తల “అవసరానికి మించి మాట్లాడడం” అంది.
– సౌభాగ్య