సుమతి (For Children)
సూర్యడు ఉదయించకపోతే ఏమవుతుంది? లోకం చీకటవుతుంది! చీకటి లోకాన్ని ఊహించగలమా? కళ్ళుండీ లేనట్టే కదా? అలాంటి సందర్భం ఒకటి వచ్చింది. ఎవరు చేసారా? సుమతి! ఎందుకు చేసింది? సుమతి మహాపతివ్రత. పండితుడూ నిష్టాగరిష్టుడైన కౌశికుని భార్య. ఆ దంపతులిద్దరూ అన్యోన్యంగా ఆనందంగా ఉండేవారు. ఒకరోజు కౌశికుడు రాజసభకు వెళ్ళి రాజనర్తకి నృత్యం చూసాడు. మెచ్చుకున్నాడు. ఆ నర్తకి కౌశికుని కోసం ప్రత్యేక నృత్యం చేసింది. ఆ పరిచయం అలా ప్రణయంగా మారింది. నర్తకే లోకంగా మారింది. ఇల్లు […]
సూర్యడు ఉదయించకపోతే ఏమవుతుంది? లోకం చీకటవుతుంది! చీకటి లోకాన్ని ఊహించగలమా? కళ్ళుండీ లేనట్టే కదా? అలాంటి సందర్భం ఒకటి వచ్చింది. ఎవరు చేసారా? సుమతి! ఎందుకు చేసింది?
సుమతి మహాపతివ్రత. పండితుడూ నిష్టాగరిష్టుడైన కౌశికుని భార్య. ఆ దంపతులిద్దరూ అన్యోన్యంగా ఆనందంగా ఉండేవారు. ఒకరోజు కౌశికుడు రాజసభకు వెళ్ళి రాజనర్తకి నృత్యం చూసాడు. మెచ్చుకున్నాడు. ఆ నర్తకి కౌశికుని కోసం ప్రత్యేక నృత్యం చేసింది. ఆ పరిచయం అలా ప్రణయంగా మారింది. నర్తకే లోకంగా మారింది. ఇల్లు గుల్లయింది. దరిద్రానికి తన ఇంట చోటు లేదంది. కౌశికున్ని కాదంది. ఆ తరువాత ఒళ్ళూ గుల్లయింది. కౌశికునికి కుష్టువ్యాధి వచ్చింది. సుమతి భర్తకు అన్నీతానయి చూసుకుంది. సేవలెన్నో చేసింది. కాని కౌశికుడు మెచ్చలేదు. దిగులు వీడలేదు. రాజనర్తకీ కావాలన్నాడు. చావుకు దగ్గరపడ్డ తన కోరిక తీర్చమన్నాడు కౌశికుడు.
భర్త సంతోషమే తన సంతోషంగా భావించే సుమతి దగ్గర ధనం లేదు. డబ్బులేదు. దారి లేదు. దయ కావాలి. రాజనర్తకీ దయ కావాలి. తన భర్త ముఖంలో కాంతి రావాలి. అందుకని రోజూ తెల్లవారు ఝామునే లేచి వెళ్ళి రాజనర్తకి ఉండే ఇంటి వాకిలి తుడిచి ముగ్గులు పెట్టి వచ్చేది. గుడికి చేసినట్టు చేసేది. కొన్నాళ్ళకి రాజనర్తకి చూసింది. గ్రహించింది. ఎవరు నువ్వు? ఏమి ఆశించి చేస్తున్నావు? ఏం కావాలి నీకు అని అడిగింది. నీ దయకావాలి అంది సుమతి. నీ దాక్షిణ్యం ఉంటే బతికిపోతామనీ అంది. సాయం చేస్తానని మాటయిస్తే అడుగుతానంది. నర్తకి చేతనైందయితే చేస్తానంది. చెప్పమంది. చేతులు జోడించి సుమతి చెప్పింది. తన భర్త కౌశికుడని, మునుపు మీయింటికి వచ్చేవాడని గుర్తు చేసింది. ఇప్పుడతడు చావుబతుకుల్లో ఉన్నాడని – ఒక్కసారి మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నాడని – ఆఖరి కోరిక తీర్చమని అర్థించింది. సుమతికి భర్తపట్ల ఉన్న ప్రేమానురాగాలకు నర్తకి కరిగిపోయింది. కాదనలేక పోయింది. సరేనంది. కుష్టురోగ గ్రస్తులకు ప్రవేశము లేదన్న రాజాజ్ఞను గుర్తుచేస్తూనే – మాపటికి చీకటి పడ్డాక రహస్యంగా తీసుకురమ్మంది నర్తకి. సుమతి తన కష్టం, ప్రయత్నం ఫలితాన్నిచ్చిందనుకుంది. భర్తకు సంతోషంగా చెప్పింది. రాత్రిపూట గంపలో భర్తను కూర్చోబెట్టుకొని నర్తకి ఇంటికి తీసుకు వెళ్ళింది. నర్తకిని చూసిన కౌశికుడు ఆనందపడ్డా, కౌశికున్ని చూసి నర్తకి బాధపడింది. మాట్లాడింది. కాసేపు గడిపింది. సెలవు తీసుకున్న కౌశికున్ని శిరసున గంపకెత్తుకొని తిరుగు ప్రయాణమయింది సుమతి. నడుస్తూ ఆ చీకటిలో తోవ తప్పింది. శ్మశానం చేరింది. రాజు కొడుకును చంపిన నేరారోపణతో మాండవ్యముని గొంతులో కొర్రుదించిన శిక్షను అనుభవిస్తూవుండగా – గంపతో చీకట్లో సుమతి తాకింది. బాధ పెరిగింది. పట్టలేక “సూర్యోదయంలోపల నీభర్త చస్తాడు!” అని శపించాడు ముని. సుమతి ఎంత వేడుకున్నా ఫలితం లేకపోయింది. భర్తను దక్కించుకోవాలన్న తాపత్రయంతో “నేనే పతివ్రతనైతే సూర్యుడు రేపు ఉదయించకుండుగాక!” అని ప్రతిజ్ఞ చేసింది.
ఫలితంగా సూర్యుడు ఉదయించలేదు. లోకం చీకటయ్యింది. అంధకారం. ఈ సంగతి తెలిసి రాజు సహా ఎందరెందరో వచ్చి సుమతిని ప్రతిజ్ఞని వెనక్కితీసుకోమన్నారు. నాభర్త ప్రాణాలు నాకు ముఖ్యమంది. దేవతలు దిగి వచ్చారు. ఫలితం లేదు. బ్రహ్మ దగ్గరకు వెళ్ళి వేడుకున్నారు. మహా పతివ్రత అనసూయే మార్గమన్నాడు. అనసూయ దగ్గరకు వెళ్ళారు. అన్నీ తెలుసుకున్న అనసూయ సుమతి దగ్గరకొచ్చింది. లోకాలు చీకటై మునులూ జనులూ ఎంత బాధపడుతున్నారో చెప్పి- నీ భర్త ప్రాణాలకు భయం లేదు, నేను బతికిస్తానని చెప్పి సూర్యుణ్ని పిలిచి లోకాన్నివెలిగించమని సుమతిని కోరింది. సుమతి ప్రతిజ్ఞను ఉపసంహరించుకొని సూర్యుణ్ణి పిలిచింది.
సూర్యోదయంతో మరణించిన కౌశికునికి ప్రాణం పోసి మళ్ళీ బతికించింది అనసూయ.
సుమతి భర్తకు మృత్యువు చెర వీడింది! లోకానికి చీకటి తెర వీడింది!!.
– బమ్మిడి జగదీశ్వరరావు