ప్రయోగం (Devotional)
రాజేష్ ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, టిఫిన్ చేసి ఆఫీసుకి బయల్దేరడానికి సిద్ధపడ్డాడు. పిల్లలకు రాజేష్ భార్య టిఫిన్ క్యారియర్లు సిద్ధం చేసింది. మొదట పిల్లల ఆటో వచ్చింది. పిల్లలు ఆటోలో స్కూలుకు వెళ్ళిపోయారు. రాజేష్ భార్యకు టాటా చెప్పి వెళ్ళబోయాడు. భార్య “ఆగండి ఎందుకంత నీరసంగా ఉన్నారు? నీరసంగావుంటే ఆఫీసుకు వెళ్లడమెందుకు? సెలవు పెట్ట వచ్చు కదా! అంది.” రాజేష్ ఆశ్చర్యపోయాడు. “నీరసమేమిటి? నాకు ఎట్లాంటి నీరసం లేదు, అయామ్ ఆల్‌రైట్” అని […]
రాజేష్ ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, టిఫిన్ చేసి ఆఫీసుకి బయల్దేరడానికి సిద్ధపడ్డాడు. పిల్లలకు రాజేష్ భార్య టిఫిన్ క్యారియర్లు సిద్ధం చేసింది. మొదట పిల్లల ఆటో వచ్చింది. పిల్లలు ఆటోలో స్కూలుకు వెళ్ళిపోయారు.
రాజేష్ భార్యకు టాటా చెప్పి వెళ్ళబోయాడు. భార్య “ఆగండి ఎందుకంత నీరసంగా ఉన్నారు? నీరసంగావుంటే ఆఫీసుకు వెళ్లడమెందుకు? సెలవు పెట్ట వచ్చు కదా! అంది.” రాజేష్ ఆశ్చర్యపోయాడు.
“నీరసమేమిటి? నాకు ఎట్లాంటి నీరసం లేదు, అయామ్ ఆల్‌రైట్” అని బయట పడ్డాడు. బయటికివచ్చాడే కానీ అతని మనసులో భార్య అన్నమాటలు కదిలాయి. తాను బాగానే ఉన్నాను కదా! ఆవిడ నీరసంగా ఉన్నావంది ఏమిటి?” అనుకున్నాడు.
ఇంటినించీ బయటికి వస్తూనే పక్కింటి రవి రాజేష్‌ని చూసి “రాజేష్ ఏమయింది? జ్వరమొచ్చిందా? నీరసంగా కనిపిస్తున్నావు?” అన్నాడు. రాజేష్ ఆశ్చర్యపోయాడు. తన భార్య చెబితే ఏదో అనుకున్నాడు. కానీ పక్కింటి రవి చెప్పేసరికి తనకు నీరసంగా ఉందా? అన్న సందేహం కలిగింది.
అక్కడి నించీ ఆఫీస్‌కు వెళ్ళాడు. ఆఫీసులో అడుగుపెడుతూనే రిసెప్షనిస్టు “గుడ్ మార్నింగ్ సార్! ఏమైంది? అలా ఉన్నారు? జ్వరమొచ్చిందా?” అంది. ఆ మాటల్తో రాజేష్‌కు నీరసం వచ్చింది. జ్వరం కూడా వస్తుందేమో అనిపించింది. ఇంతమంది చెబుతున్నారంటే తప్పక తనకు జ్వరం వచ్చి ఉండాలి. తను నీరసంగా ఉండిఉండాలి. ఆ సంగతి తనకు తెలీదు కానీ అందరూ గుర్తించారు” అనుకున్నాడు.
కాసేపటికి అటెండర్ టీ తెచ్చియిచ్చాడు “సార్! ఎందుకలావున్నారు? జ్వరమొచ్చిందా? బాగా నీరసంగా కనిపిస్తున్నారు” అనేసి వెళ్ళిపోయాడు.
పది నిముషాల తరువాత మేనేజర్ ఆఫీసుకొచ్చాడు. తన రూంలోకి వెళ్ళబోతూవుంటే రాజేష్ “గుడ్ మార్నింగ్ సార్” అన్నాడు. మేనేజర్ రాజేష్‌ని చూసి “హౌ ఆర్ యూ, నాట్ ఫీలింగ్ వెల్? బాగా నీరసంగా కనిపిస్తున్నావ్? జ్వరమొచ్చిందా? లీవు తీసుకో, రెస్టుతీసుకో” అన్నాడు.
ఇంతమంది చెప్పడంతో రాజేష్‌కి నీరసమే కాదు, జ్వరం కూడా వచ్చింది. మధ్యాహ్నం సెలవు తీసుకుని ఇంటికి వచ్చాడు. భార్య తల పట్టి చూసి “ఉదయాన్నే చెప్పాను నీరసంగా ఉందా అని, ఇప్పుడు చూడండి జ్వరంలో ఒళ్ళు కాలిపోతోంది పడుకోండి” అంది. జ్వరంతో వణుకుతూ రాజేష్ వెళ్ళి పడుకున్నాడు.
ఇది ఒక ప్రయోగం. కొంతమంది వ్యక్తులపై చేశారు. వాళ్ళలో రాజేష్ ఒకడు. ముందస్థుగా అందరికీ చెప్పిపెట్టి అందరూ అతన్ని ప్రశ్నించమన్నారు. సందేహం మనసులో బీజంగా నాటారు. ఒక అబద్ధాన్ని వందసార్లు నిజమని చెబితే అది నిజమై కూచుంటుందంటారే ఇది అలాంటిది.
మనిషికి స్పష్టత ఉంటే, నిత్య చైతన్యం ఉంటే, నిరంతర స్పృహవుంటే అతన్ని ఏవీ వంచించలేవు. మొసగించలేవు. భౌతికమయిన విషయాలయినా, ఆధ్యాత్మిక రంగంలోనయినా అతన్ని దారి మళ్ళించడం అసంభవం. ఇట్లాంటి ప్రయోగాలు బలహీనులపట్ల పనిచేయవచ్చు.
తన పట్ల, ప్రపంచంపట్ల నిత్య స్పృహవున్న వ్యక్తి ప్రయోగాలకు లొంగడు. గుడ్డిగా విశ్వసించడు.
– సౌభాగ్య