తెలంగాణాలోనూ కాంగ్రెస్ ఖాళీ అవుతుందా?
దేశంలో తొలి జాతీయ పార్టీగా పేరొందిన కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఏడాదికాలంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దశాబ్దకాలంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను 2014 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రజలు మట్టికరిపించారు. ఇలాంటి సమయంలో అధికార పార్టీలు కాంగ్రెస్ నేతలకు గాలం వేయడం పరిపాటి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసింది కూడా ఇదే. జాతీయ పార్టీగా మరే ఇతర పార్టీకి లేని చరిత్ర కాంగ్రెస్‌కు ఉంది. పార్టీని నమ్ముకుని ఎంతో మంది సీనియర్లు ఉంటారు. వారిని కాపాడుకుంటేనే క్షేత్రస్థాయిలో […]
దేశంలో తొలి జాతీయ పార్టీగా పేరొందిన కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఏడాదికాలంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దశాబ్దకాలంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను 2014 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రజలు మట్టికరిపించారు. ఇలాంటి సమయంలో అధికార పార్టీలు కాంగ్రెస్ నేతలకు గాలం వేయడం పరిపాటి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసింది కూడా ఇదే. జాతీయ పార్టీగా మరే ఇతర పార్టీకి లేని చరిత్ర కాంగ్రెస్‌కు ఉంది. పార్టీని నమ్ముకుని ఎంతో మంది సీనియర్లు ఉంటారు. వారిని కాపాడుకుంటేనే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు పనిచేస్తారు. దేశవ్యాప్త ఓటమి పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టినా వారిని ఉత్సాహ పరిచే ప్రయత్నాలు పెద్దగా చేపట్టకపోవడం ఆ పార్టీకి ఎదురుదెబ్బగా మారుతున్నాయి. ఇప్పట్లో ఎన్నికలు లేవన్న నిర్లక్ష్యం ఇందుకు కారణం కావచ్చు. కానీ, అప్పటిదాకా పార్టీలో పనిచేసే వారు ఉండాలి కదా! పార్టీ నేతలను, కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నాలు చేయకపోవడం, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోవడం ఆ పార్టీ అధిష్టానం వైఫల్యానికి కారణాలుగా చెప్పవచ్చు.
తెలుగు రాష్ర్టాల్లో పరిస్థితి దారుణం..!
రాష్ట్ర విభజన అంశం ఏపీలో కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీసింది. అక్కడ కనీసం సర్పంచి కూడా లేకపోవడం ఆపార్టీని ప్రజలు ఎంతగా ద్వేషిస్తున్నారో తెలియజెబుతోంది. గుడ్డిలో మెల్లలా తెలంగాణలో 21 స్థానాలకు పరిమితమైంది. ఇప్పుడు ఆ సంఖ్య 17కు పడిపోయింది. ఇది మరింత తగ్గే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మంత్రులుగా పదేళ్లపాటు పనిచేసిన వారు, వివిధ పదవులు అనుభవించిన వారు పార్టీని వీడుతాననడం పార్టీ మనుగడకు హెచ్చరికలుగా కనిపిస్తున్నాయి. గత ఎన్నికలలో ఏపీలో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. అయినప్పటికీ పార్టీని నడిపించేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారు. బొత్స సత్యనారాయణలాంటి సీనియర్లు పార్టీని వీడుతున్నా.. ఏపీ పీసీసీ ఇన్‌చార్జి రఘువీరారెడ్డిలాంటివారు పార్టీని అంటిపెట్టుకుని విధేయులుగా ఉంటున్నారు. పార్టీని నడిపించేందుకు రఘువీరా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. రాష్ర్ట విభజన పాపం తమకు అంటినా, సహచరులు పార్టీని వీడుతున్నా.. ఆత్మవిశ్వాసంతో రఘువీరా పార్టీకి ఊపిరిలూదే ప్రయత్నం చేస్తున్నారు. ఓటుకు నోటు కేసులో సీఎంపై మాటల దాడిలో నూటికి నూరు శాతం సఫలమయ్యారని అధిష్టానం కితాబు కూడా ఇచ్చింది. కాంగ్రెస్ అధిష్టానం ఇక్కడ సరైన వ్యక్తికే పార్టీ పగ్గాలు అప్పజెప్పింది.
తెలంగాణలో తప్పుల మీద తప్పులు!
తెలంగాణ రాష్ర్టం ఇచ్చినా.. ఇక్కడ అధికారంలోకి రాలేకపోయింది. ఇందుకు అధిష్టానం చేసిన తప్పులే కారణం. 2014 ఎన్నికలకు ముందు తెలంగాణలో బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని కాదని పార్టీని బీసీ అయిన పొన్నాల లక్ష్మయ్య చేతిలో పెట్టింది. అభ్యర్థుల ఎంపికపై పొన్నాల సొంత సామాజిక వర్గానికి పెద్దపీట వేయడంతో రెడ్డి సామాజికవర్గం నేతలు పనిచేయలేదని విమర్శలు వచ్చాయి. గెలుపు గుర్రాలను పక్కనబెట్టి తన అనుచరులకు టిక్కెట్లు ఇచ్చుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. పార్టీ దారుణ ఓటమికి ఇవే కారణమని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఎన్నికల అనంతరం నలుగురు ఎమ్మెల్యేలు కారెక్కుతుంటే వారిని ఆపలేకపోయారు. ఫలితంగా ఆయనపై వేటు పడింది. నాలిక కరుచుకున్న అధిష్టానం ఈ సారి రెడ్డి సామాజికవర్గానికి దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. ఉత్తమ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. ఆయన పార్టీ పగ్గాలు చేపట్టినా పార్టీ తీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. ఇటీవల ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవడం మినహా ఆయన పెద్దగా సఫలీకృతమైంది లేదు. పార్టీలో సీనియర్లతో సఖ్యతగా మెదలడం లేదని.. ఎవరు ఏం చేస్తున్నారో.. పార్టీలో ఏం జరుగుతోందో తెలుసుకోలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఓటుకు నోటుకుంభకోణంలో పీసీసీ అధ్యక్షుడిగా ఆయన విఫలమయ్యారనే చెప్పాలి. ఈ వ్యవహారంలో ఆయన మౌనం ఒక రకంగా టీడీపీకి లాభించింది. ఏపీలో రఘువీరారెడ్డి టీడీపీ దోషిని చేసి మాట్లాడుతుంటే.. ఉత్తమ్ ఎందుకు మౌనం వహించారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. తాజాగా మాజీ పీసీసీ అధ్యక్షుడు డీఎస్ పార్టీని విడాడు. మాజీ మంత్రులు దానం, సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌లు పార్టీ వీడుతున్నారని సమాచారం. గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ వలసలు పార్టీని మరింత కష్టాల్లోకి నెడతాయి.