పరిశీలకుడు (Devotional)

మనం అన్నిటిపట్ల సాక్షిగా ఉండగలగాలి. నిత్య స్పృహతో, నిత్యచైతన్యంతో, నిరంతర సాధనతో అది సాధ్యం. సంఘటనలన్నవి, సన్నివేశాలన్నవి రాగద్వేషాల వల్ల ఏర్పడతాయి. రాగద్వేషాలు లేనపుడు నిశ్చలత్వం ఉంటుంది. దాన్ని నిరామయమనండి, నిరంజనత్వమనండి శూన్యమనండి. సృష్టికి అదే ఆధారం.             సుఖం కలిగినపుడు సంతోషం వేస్తుంది. బాధ కలిగినపుడు దుఃఖం వస్తుంది. సంతోషం కలిగినప్పుడు సంతోషంలోపడి కొట్టుకుపోతాం. దుఃఖం కలిగినపుడు దుఃఖంలో పడి కొట్టుకుపోతాం. నిజానికి సుఖం మనం కాదు, దుఃఖం మనం కాదు. కాదని ఎవరూ అనుకోరు. […]

Advertisement
Update:2015-07-02 18:31 IST

మనం అన్నిటిపట్ల సాక్షిగా ఉండగలగాలి. నిత్య స్పృహతో, నిత్యచైతన్యంతో, నిరంతర సాధనతో అది సాధ్యం. సంఘటనలన్నవి, సన్నివేశాలన్నవి రాగద్వేషాల వల్ల ఏర్పడతాయి. రాగద్వేషాలు లేనపుడు నిశ్చలత్వం ఉంటుంది. దాన్ని నిరామయమనండి, నిరంజనత్వమనండి శూన్యమనండి. సృష్టికి అదే ఆధారం.

సుఖం కలిగినపుడు సంతోషం వేస్తుంది. బాధ కలిగినపుడు దుఃఖం వస్తుంది. సంతోషం కలిగినప్పుడు సంతోషంలోపడి కొట్టుకుపోతాం. దుఃఖం కలిగినపుడు దుఃఖంలో పడి కొట్టుకుపోతాం. నిజానికి సుఖం మనం కాదు, దుఃఖం మనం కాదు. కాదని ఎవరూ అనుకోరు. భూమికి ఆకర్షణవున్నట్లు రాగద్వేషాలకు ఆకర్షణ ఉంటుంది. మనుషులందరూ వాటిల్లో భాగాలమనుకుంటారు.

మన శరీరం భూమిది. ఆత్మ ఆకాశానిది.

నిశ్చలంగా ఉండడానికి రెండు సంఘటనలు

బ్రహ్మనందస్వామి అన్న గురువు బృందావనంలో ధ్యానంలో ఉన్నాడు. ధ్యానంలో అంటే ప్రశాంతంగా విశ్రాంతిగా కూర్చున్నాడు. ఒక శిష్యుడు ఒక తువ్వాలు తెచ్చి అక్కడ పెట్టిపోయాడు. స్వామి తనకు పట్టనట్టు, తనకు సంబంధించనట్లు ఆ తువ్వాల్ని చూశాడు.

ఒక గంట గడిచింది. స్వామి అర్ధ నిమీలిత నేత్రాలతో ఉన్నాడు. ఒక దొంగ అటూ ఇటూ చూసుకుంటూ మెల్లగా వచ్చి ఆ తువ్వాల్ని దొంగలించుకుని వెళ్ళాడు .అందంతా బ్రహ్మానందస్వామి చూస్తూనే ఉన్నాడు.

స్వామి తువ్వాలు రావడం చూశాడు, పోవడం చూశాడు. కానీ సాక్షిగానే మిగిలాడు. రాకపోకలతో ఆయనకు సంబంధమేర్పడలేదు.

అట్లాగే రమణమహర్షి గురించి ఒక సంఘటన.

ఒక రాత్రి రమణమహర్షి ఆశ్రమంలో దొంగలు పడ్డారు. ఆశ్రమమంతా వెతికారు. విలువైన వస్తువు లేవీ దొరకలేదు. ఆశ్రమంలో విలువైన వస్తువులేముంటాయి? దాంతో వాళ్ళకి ఆగ్రహం కలిగింది. వాళ్ళు రమణమహర్షిని కొట్టి వెళ్ళారు.

మహర్షి ఆ చర్యకు చలించలేదు. అది అనుకోని సంఘటనగా ఆయన భావించలేదు. ఆయనలో ఎలాంటి మార్పూ లేదు. కింద జరుగుతున్న అన్నిట్నీ పరిశీలించే ఒక నక్షత్రంగా ఆయన ధగధగలాడుతూనే ఉన్నారు.

మనం పరిశీలించే వాళ్ళంగా మారామంటే మన మనసు మన చేతిలో ఒక ఉపకరణమవుతుంది. మనం చెప్పినట్లు చేస్తుంది. లేకుంటే మనం మనసు చెప్పినట్లు వింటే అది మనల్ని బానిసల్ని చేస్తుంది. మనపై అధికారం చెలాయిస్తుంది.

మన భావోద్వేగాలపై మనకు అదుపు ఉండాలి.

మన భావోద్వేగాలకు మనం లొంగిపోకూడదు.

– సౌభాగ్య

Tags:    
Advertisement

Similar News